.
ఎదిగేకొద్దీ ఒదగాలి అనేది ఆచరణీయ జీవితసత్యం… విజయం అణకువను నేర్పాలి అనేది మరో నిజం… ప్రత్యేకించి అహంభావాలు, ప్రచారాలు, నమ్మకాలు, సెంటిమెంట్లు, అభద్రత రాజ్యమేలే సినిమా ఇండస్ట్రీలో అణకువ, ఒద్దిక అవశ్యం…
హనుమాన్ చిత్రంతో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మకు మెల్లిమెల్లిగానైనా ఈ జీవిత సత్యం బోధపడబోతోంది… ఆ విజయంతో మేఘాల్లో తిరగడం ప్రారంభించిన ఈ దర్శకుడు ఆల్రెడీ నేలమీదకు దిగిరావడం మొదలైంది…
Ads
తను మరిచిపోతున్నదీ, తనకు ఎవరూ చెప్పలేకపోతున్నదీ ఒకటుంది… ఇండస్ట్రీలో ఒక్కసారి ఏ దర్శకుడైనా సరే… లిటిగెంట్, వివాదస్పదుడు, నమ్మలేని వ్యక్తి అనే ముద్రలు పడితే అది తీవ్రంగా నష్టపరుస్తుంది… నిజానిజాలు చూడదు ఇండస్ట్రీ… దూరంగా ఉండాలని అనుకుంటుంది… కోట్ల పెట్టుబడులు కాబట్టి… లాభం వస్తుందో రాదో తెలియని ఓ లాటరీ దందా కాబట్టి…
ఇప్పుడేమైంది..? ఓ వివాదం పూర్వాపరాల్లోకి వెళ్దాం… హనుమాన్ సినిమా విజయం తరువాత ఈ దర్శకుడు ఆలోచనలు, ప్రణాళికలు హైరేంజుకు వెళ్లిపోయాయి… తప్పులేదు… కానీ దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది… ఏదో యూనివర్స్ పేరిట వరుసగా అన్ని అవతారాల పాత్రలతో వరుసగా సినిమాలు తీసేస్తానన్నాడు… తన హనుమాన్ నిర్మాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (Prime Show Entertainment) ఓనర్ కె. నిరంజన్ రెడ్డితో ఒప్పందాలు… ఏమనీ..?
‘అధీర’, ‘మహాకాళి’, ‘జై హనుమాన్’, ‘బ్రహ్మ రాక్షస్’ వంటి వరుస చిత్రాలకు ఒకేసారి 20 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడట ప్రశాంత్ వర్మ… తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు (Telugu Film Chamber of Commerce) ఫిర్యాదు చేశాడు కూడా… ఏమనీ..?
అడ్వాన్సులు తీసుకున్నప్పటికీ, ప్రశాంత్ వర్మ ఆ సినిమాల పనులు చేయడం లేదనీ, పైగా జై హనుమాన్ సినిమాను ఇతర నిర్మాణ సంస్థలకు కట్టబెడుతున్నాడనీ, సో, మాకు జరిగిన వ్యాపార నష్టాలు, మానసిక ఒత్తిడికి గాను, తీసుకున్న అడ్వాన్సులు తిరిగి చెల్లించడంతో పాటు ₹200 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్…
అబ్బే, అవన్నీ అబద్ధాలు, నిరాధారం, ఇదేదో రిటాలియేషన్ అంటాడు ప్రశాంత్ వర్మ… అసలు తీసుకున్న అడ్వాన్సులు, ఒప్పందాలు కేవలం హనుమాన్ సినిమాకే పరిమితం, పైగా నాకు ఇస్తానన్న ఆ సినిమా లాభమే ఇవ్వక ఎగ్గొడుతున్నారనీ చెప్పుకొస్తున్నాడు…
కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా వార్తలను ప్రచురిస్తున్నాయని, విచారణ పూర్తయ్యే వరకు ఊహాగానాలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాడు… గుడ్…
అయితే ఇక్కడ రెండు వైపులా చూద్దాం… ఒకేసారి నాలుగు సినిమాలకు అడ్వాన్సులు ఇవ్వడం ఏమిటి అసలు..? (ఇవ్వడమే నిజమైతే…) అంతటి ఫేమస్ హొంబలె ఫిలిమ్స్ వంటి సంస్థ పనితీరును సదరు నిరంజన్ రెడ్డి ఓసారి తెలుసుకోవాలి… ముందుగానే నాలుగైదు సినిమాలకు దర్శకుడిని అడ్వాన్సులతో కట్టేసుకుని, పదేళ్లు ఇలా కథ నడిపించాలని అనుకున్నారా..?
బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి భారీ సీక్వెల్స్ ఎంత పద్ధతిగా పూర్తయ్యాయి..? మరి ఇక్కడ ఎందుకు దెబ్బతింటున్నాయి సంబంధాలు..?
ప్రస్తుతం ఈ వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది… నిరంజన్ రెడ్డి తను ఇచ్చిన అడ్వాన్సుల ఆధారాలు కూడా చూపిస్తున్నాడట… ఏమో, అవన్నీ హనుమాన్ ఒప్పందం బాపతు చెల్లింపులు అంటాడేమో ప్రశాంత్ వర్మ… తను గుర్తించాల్సింది మరొకటి ఉంది…
మీడియా తనంతట తనేమీ రాయడం లేదు… నిర్మాత చెబుతున్న వాదనే రాస్తోంది… నిజమేమిటో నువ్వు చెప్పు… మీడియా రాయను అనడం లేదు కదా… పనిగట్టుకుని ప్రశాంత్ వర్మ మీద ఆరోపణలు రాయాల్సిన కక్ష మీడియాకు ఏముంది..? ఎప్పుడైతే నా వెర్షన్ నేనిప్పుడు చెప్పలేను అన్నాడో, తన మీదే తప్పు ఉన్నట్టు పరోక్షంగా చెప్పినట్టయింది…
హీరో వేరు, దర్శకుడు వేరు… హీరోకు ఒక్కసారి హిట్లు పడితే కొన్నేళ్లు ఆ ఊపులో తన ఇష్టారాజ్యంగా చెలాయించుకోగలడు… కానీ దర్శకుడి స్థితి సెన్సిటివ్… లిటిగెంట్ ముద్ర పడకుండా చూసుకోవాలి… అడ్వాన్సులు తీసుకుని, వేరే నిర్మాతలకు పనిచేస్తున్నాడనే ముద్ర ప్రమాదకరం…
జై హనుమాన్ నిర్మాణం పరిస్థితేమిటో ఎవరికీ తెలియదు… ఇంకా ఇంకా ఆలస్యం అనివార్యం… ఇప్పుడిక ఈ వివాదం నేపథ్యంలో ప్రశ్నార్థకం… ఇది ప్రశాంత్ వర్మకే నష్టదాయకం… పైగా వచ్చిపడిన అడ్వాన్సులతో అర్జెంటుగా వీఎఫ్ఎక్స్ స్టూడియో నిర్మాణం తొందరపాటు నిర్ణయమే… ఓవర్ స్పీడ్…
రిషబ్ శెట్టి హనుమంతుడు, తేజ సజ్జ హనుమంతు పాత్ర (లీడ్ రోల్)… రానా రాముడు అట, అంతేకాదు, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని పేర్లు కూడా వినిపించాయి… ఇప్పుడు ఈ ప్రాజెక్టు సిట్యుయేషన్ ఏమిటో మరి..? బహుశా స్క్రిప్టు వర్క్ పూర్తయిందేమో…
ఒక దశలో చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్లు కూడా తన సినిమాల్లో చేయబోతున్నారని అన్నాడు ప్రశాంత్ వర్మ… వాళ్లు చేయడం కాదు, ఆల్రెడీ వార్తల్లో ఉన్న బ్రహ్మ రాక్షస్ సినిమా నుంచి ప్రభాస్ వైదొలిగాడనే వార్తలు వస్తున్నాయి… ఇవేకాదు, రణవీర్ సింగ్, నందమూరి మోక్షజ్ఞ ప్రాజెక్టులు కూడా ఓ దశలో వినిపించాయి… ఏమైనట్టు ఇవన్నీ..! ఈ మొత్తం కథలో ప్రశాంత్ వర్మ తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి..? మనం పైన చెప్పుకున్నదే..!!
Share this Article