Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…

November 4, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. 1993 ప్రాంతంలో ప్రిన్సిపాలుగా క్లాసుల్ని కాపలా కాస్తున్నాను . ఇంటర్ రెండో సంవత్సరం క్లాసులో ఓ కుర్రాడు పాఠం వినకుండా నోట్ పుస్తకంలో ఏదో వ్రాసుకుంటూ ఉన్నాడు . క్లాసులోకి వెళ్ళిపోయి ఆ పుస్తకాన్ని లాక్కొని చూస్తే ఎవరో ఒక అమ్మాయి పేరు రామకోటి లాగా వ్రాసుకుంటున్నాడు .

మేఘసందేశం సినిమాలో ఊరికే పెద్ద , కవి ఒక కళాకారిణి ఆకర్షణలో పడి , ఆ ప్రేమకు విఘాతం కలిగితే పిచ్చివాడై దేశదిమ్మరి అవుతాడు .మీడియాలో చూస్తుంటాం . తాను ప్రేమించిన స్త్రీ తనకు స్వంతం కాలేదని ఏసిడ్లు పోసేవారు , ఆత్మహత్యలు చేసుకునే వారు , సైకోలుగా తయారయ్యే వారు కోకొల్లలు . It’s all possessiveness .

Ads

ప్రేమ మేజిక్ అది . ప్రేమ పిచ్చి , పిచ్చి ప్రేమ రకరకాలు . ఆ ప్రేమ చెరువులో మునిగినోడికే అర్థం అవుతుంది ఆ గోల . ఒడ్డున ఉన్నోడికి ఏందీ తిరణాల అనిపిస్తుంది . ప్రేమను కూడా వ్యాపారం చేసే కర్కశులకు దాని మాధుర్యం అర్థం కాదు .

ఇలాంటి అతి సున్నితమైన అంశంతోనే ఈ మహర్షి సినిమా కధను నేసారు వేమూరి సత్యనారాయణ . దానికి ముగ్గురు స్క్రీన్ ప్లేని తయారు చేసారు .‌వంశీ , తనికెళ్ళ భరణి , వేమూరి సత్యనారాయణ . దర్శకత్వం వంశీ . సంభాషణలను భరణి వ్రాసారు . అందరూ కలిసి ఓ classic ని తయారు చేసారు . సున్నిత హృదయులకు , ప్రేమ విహారులకు గొప్పగా నచ్చుతుంది .

ఓ బాగా డబ్బు చేసిన కుర్రాడు భయం భక్తి లేకుండా కాలేజీలో గోలగాడిగా , ఆడపిల్లల మీద క్రూయెల్ జోక్స్ వేసే సైకోగా పాపులర్ . అదే కాలేజీలో చదువుతున్న హీరోయిన్ అతన్ని అసహ్యించుకుంటుంది . మాటామాటా పెరిగి పంతంగా మారుతుంది .‌ ఆ అమ్మాయి మీద పిచ్చి ప్రేమ కలుగుతుంది . ఆరాధకుడు అవుతాడు . పెళ్ళి చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు . వచ్చే సంబంధాలను చెడగొడతాడు .

కానీ ఆ అమ్మాయి ఛీ కొడుతుంది . తన చిన్ననాటి స్నేహితుడు ఆ ఊరికే సబ్ ఇనస్పెక్టరుగా రావటం , అతనితో పెళ్లి జరిగిపోవటంతో హీరోకి తిక్క రేగుతుంది , కచ్చబోతు అవుతాడు . చివరకు సైకో అవుతాడు . చివరకు తనను ప్రేమించాల్సిందే అని బ్లాక్ మెయిల్ చేయటానికి ఆమె బిడ్డనే కిడ్నాప్ చేస్తాడు . క్లైమాక్సులో సబ్ ఇనస్పెక్టర్ షూట్ చేయవలసి వస్తుంది . హీరోయినుకి సానుభూతి కలగటంతో సినిమా ముగుస్తుంది . విధ్వంస ప్రేమికుడు చనిపోతాడు . ఇదీ ఈ పిచ్చోడి ప్రేమ కధ . ప్రపంచంలో నిఖార్సయిన ప్రేమలన్నీ పిచ్చివే . అందుకే ఓ సినిమా కవి ఎప్పుడో అన్నాడు . ప్రేమ పిచ్చి రెండూ ఒకటే అని .

సినిమా పేరే ఇంటిపేరు అయినవాళ్ళు మనకున్నారు . షావుకారు జానకి , ఆహుతి ప్రసాద్ . అలాగే మా గుంటూరు జిల్లా తెనాలి కుర్రాడు రాఘవ మహర్షి రాఘవ అయిపోయాడు . అతనే ఈ సినిమాకు హీరో . తూ.గో. నుండి వచ్చిన కృష్ణ భగవాన్ ఇందులో సబ్ ఇనస్పెక్టర్ . ఇద్దరికీ ఇదే మొదటి సినిమా .

చాలామంది ఔత్సాహికులు నటించారు . శివాజీ రాజాకు సాంకేతికంగా రెండో సినిమా అయినా గుర్తింపు వచ్చింది ఈ సినిమా ద్వారానే . అలాగే సి వి యల్ నరసింహారావుకు మొదటి సినిమా .

  • ఇంక ప్రత్యేకంగా అభినందించవలసింది లేడి కళ్ళ శాంతిప్రియనే . భానుప్రియ చెల్లెలు . ముగ్ధమనోహరిగా అందంగా నటించింది . నృత్య సన్నివేశాలలో అక్క భానుప్రియ లాగానే అద్భుతంగా నృత్యించింది . సినిమా అంతా ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది .

ఈ సినిమా విజయానికి (?) కారణం ఇళయరాజా సంగీతం . అత్యంత శ్రావ్యమైన ట్యూన్లను అందించారు . ఓ పాటలో బాలసుబ్రమణ్యంతో పాటు తానూ పాడారు .‌ మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది . Most melodious song . వెన్నెలకంటి వ్రాసారు .‌

మరో శ్రావ్యమైన పాట సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం . ఈ పాటలో శాంతిప్రియ నృత్యం బాగుంటుంది . ఆసక్తికరంగా నృత్య దర్శకుల పేర్లు మనకూ అంతగా తెలిసినవి కూడా కాదు . యస్ పి ఆనంద్ , జి పద్మా సుబ్బారావులు నృత్య దర్శకులు . అద్భుతమైన చిత్రీకరణ . ఈ పాటను నాయని కృష్ణమూర్తి వ్రాసారు .

కాలేజి కుర్రాళ్ళు ఆడపిల్లల్ని అల్లరి చేస్తూ హుషారుగా పాడే రెండు పాటలు బాగుంటాయి . విశాఖపట్టణాన్ని దున్నేసారు . సాహసం నా పధం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా పాటను సిరివెన్నెల వారు వ్రాసారు .

మరో పాటను ప్రత్యేకంగా చెప్పుకోవాలి . సంస్కృతంలో డిస్కో డాన్స్ పాట . సంస్కృత పద్యాలు చాలా వాటిల్లో ఉంటాయి . కానీ సంస్కృతంలో పాట ! ఈ ఒక్క సినిమాలోనే ఏమో ! సంస్కృతం క్లాసు అయ్యాక కుర్రాళ్ళందరూ పాడే పాటను జొన్నవిత్తుల వ్రాసారు . ఊర్వశి గ్లౌం భా ప్రేయసి హ్రీంమా పాట . వినాల్సిందే . ఈ పాటను బాలసుబ్రమణ్యం , ఇళయరాజాలు కలిసి పాడారు . కోనలో సన్న జాజి మల్లి పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . దీనినీ జొన్నవిత్తులే వ్రాసారు .

పాటల్ని బాలసుబ్రమణ్యం , జానకమ్మ , ఇళయరాజాలు పాడారు . వంశీ సినిమా అంటే ఫొటోగ్రఫీకి ప్రత్యేక స్థానం ఉంటుంది . ఈ సినిమాలో కూడా హరి అనుమోలు ఫొటోగ్రఫీ చాలా అందంగా ఉంటుంది . Overall , it’s an off-beat love , classical movie . 1987 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ …..




ఈ పోస్టుకు వచ్చిన కామెంట్లలో Uday Kumar కామెంట్ కూడా ఓసారి చదవాలి… ఇది ఈ సినిమాకు మరో కోణం… నిజంగానే అప్పట్లో వంశీ మీద బోలెడు విమర్శలు వచ్చాయి… సైకో ప్రేమల్ని గ్లోరిఫై చేయడం మీద… ఈ కామెంట్ ఏమిటంటే..?

‘‘‘ప్రేమ సైకోలకు ప్రేమించకపోతే చంపండి లేదా చావండి అదీ కుదరకపోతే ప్రేమించిన ఆడదానికి పెళ్ళైనా సరే వెంటబడి వేధించండి, బాధించండి అని దుస్సందేశాన్నిచ్చే విషపు టానిక్ ఈ సినిమా, దీనిని ప్రేరణగా తీసుకొని చాలామంది భగ్న ప్రేమికులు సైకో ప్రేమికుల అవతారం ఎత్తారు…

ఒకప్పుడు ఎక్కడ ఉన్నా ఏమైనా నేడెవరికి వారే విడిపోయినా నీ సుఖమే నే కోరుకున్నా అనే త్యాగ పూరిత పవిత్ర ప్రేమ ఇలాంటి విషపూరిత సందేశంతో పాపిష్టి ప్రేమగా దిగజారిపోయింది, నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది గానీ ఇలాంటి రోగాన్ని కాదు, విషం కూడా రుచి తీయగానే ఉంటుంది అన్నట్లు ఈ విష ప్రేమకధలో పాటలు తియ్యగానే ఉంటాయి, ఏం ప్రయోజనం? కాలే పెనం మీద నాలుగు నీళ్ల చుక్కలుగా ఇంకిపోయాయి…

ఇంక రాఘవ అనే నటుడు ఎందరిలాగో తన పేరు ముందు ఈ సినిమాని ఓన్ చేసుకొన్నాడు, తర్వాత కాలంలో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైపోయాడు, హీరోయిన్ శాంతిప్రియగా  తర్వాత కాలంలో ఫేడౌట్..’’




 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions