.
ముందుగా చాలాకాలం నవ్వించిన పోస్టు, పెన్షనర్ల పట్ల మన బ్యాంకుల పనితీరుపై మంచి సెటైరికల్ పోస్టు చెప్పుకుందాం…
యాదగిరికి మహా చికాకుగా ఉంది… తను బతికేదే పెన్షన్ మీద… బ్యాంకు సర్వీస్ నుంచి రిటైరయ్యాడు… ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ గడ్డి తినలేదు… పెన్షన్ రాకపోతే నెల గడవదు… అదే బ్యాంకు నుంచి ఓ లేఖ అందింది… అదేమంటున్నదంటే…
Ads
- ‘‘అయ్యా… మీరు ఇంకా బతికే ఉన్నట్టుగా ఈ సంవత్సరపు లైఫ్ సర్టిఫికెట్టు పంపించారు… ధన్యవాదాలు… కానీ గత ఏడాది మీరు బతికే ఉన్నట్టుగా పంపించిన లైఫ్ సర్టిఫికెట్ మా రికార్డుల్లో కనిపించడం లేదు…
- ఎవరైనా ఆడిటింగ్‌లో పట్టుకుంటే మాకు కష్టం… అందుకని దానికి సంబంధించిన కాపీ మీ దగ్గర ఉంటే మాకు ఒక సర్టిఫైడ్ కాపీ పంపించగలరు… అలాగే గత ఏడాది కూడా మీరు బతికే ఉన్నట్టుగా ఒక డిక్లరేషన్ కూడా దానికి జతచేయండి…’’
ఇదీ ఆ లేఖ సారాంశం… ఇదీ యాదగిరి కోపానికి కారణం… ఒరే ఎదవా, ఇప్పుడు బతికి ఉన్నట్టు సర్టిఫికెట్టు పంపించానంటే గత ఏడాది బతికే ఉన్నట్టు కదరా… కామన్ సెన్స్ కూడా ఉపయోగించకపోతే ఎలా..? అని ధుమధుమలాడుతున్నాడు… కానీ అదసలే ప్రభుత్వరంగపు బ్యాంకు…
సర్వీస్ మన్నూమశానం వాళ్లకు అక్కర్లేదు… లైఫ్ సర్టిఫికెట్ లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే లెక్కిస్తారు… పెద్ద పెద్ద కార్పొరేట్ కస్టమర్లకు, కంపెనీలకు, నాయకులకు, పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు ఇచ్చి, తప్పుడు తనఖా డాక్యుమెంట్లకూ తలూపి… అవి మాఫీ చేయడానికి, ఎగ్గొట్టడానికి సాయపడటం తప్ప వాటికి మామూలు కస్టమర్లు ఎప్పుడూ పట్టరు కదా… (హబ్బా, ఎస్‌బీఐ గురించి మాత్రమే కాదు చెప్పేది…)
మామూలు కస్టమర్ అంటే మస్తు రూల్స్ ఉంటయ్… రూల్స్‌కు కామన్ సెన్స్, సెన్స్ ఎట్సెట్రా అస్సలు వర్తించవుగా… అందుకే యాదగిరికి చిటచిటలాడుతోంది… ఇలా రిప్లయ్ ఇచ్చాడు…
- ‘‘డియర్ ఆఫీసర్, ఈ ఏడాదికి సంబంధించిన నా లైఫ్ సర్టిఫికెట్ మీకు అందినట్టు చెప్పారు, సంతోషం… గత ఏడాది లైఫ్ సర్టిఫికెట్‌కు సంబంధించిన కాపీ నా దగ్గర కూడా లేదు… ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వాలని అనుకున్నా సరే అదీ కష్టమే… గత ఏడాది నేను బతికే ఉన్నానో లేదో నాకు చస్తే గుర్తుకురావడం లేదు… దయచేసి క్షమించగలరు…’’
‘‘ఇదేరా మీకు సరైన జవాబు’’ అనుకుంటూ అది పంపించేసి, తాపీగా టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్నాడు… హఠాత్తుగా మెదడులో ఏదో జ్ఞాపకం… మూడేళ్ల క్రితమో, నాలుగేళ్ల క్రితమో బాగా వయస్సు మళ్లిన ఓ పెద్దమనిషి తన దగ్గరకు వచ్చాడు… అదే బ్యాంకు, అదే సమస్య…
తనే అక్కడ పెన్షన్ల కాగితాలు చూసే ఉద్యోగి… ఆయన పట్ల విసురుగా, పరుషంగా మాట్లాడాడు… ఆ పెద్దాయన మొహం మాడ్చుకుని నీరసంగా వెళ్లిపోయాడు… అప్పటికే నాలుగు రోజులుగా తిరుగుతున్నాడుట…
ఈ కథకు ముగింపు ఉండదు… ఇది అనంతం… బ్యాంకులు, ఇతర ఆఫీసుల్లోనూ రూల్స్ అంటేనే అలా… వాటికి కామన్ సెన్స్ వర్తించదు… హ్యూమన్ సెన్స్, కస్టమర్ సెన్స్ గురించి మాట్లాడితే మర్యాద దక్కదు…

అయిపోయిందిగా, చదివారు కదా… ఇప్పడిది ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ షేర్ చేసుకున్న ఓ పోస్టు హఠాత్తుగా మళ్లీ ఫేస్‌బుక్‌లో కనిపించింది… సరే, అదీ ఓసారి చెప్పుకుందాం…
.
విషయం ఏమిటంటే..? అస్సాంలోని ఒక స్థానిక పత్రికలో వచ్చిన ప్రకటన సారాంశం ఇది… “నా డెత్ సర్టిఫికెట్ లమ్డింగ్ బజార్ వద్ద పోయినది. దయచేసి ఎవరికైనా దొరికితే తెలియజేయగలరు…”
పరేష్ రావల్ ఈ క్లిప్పింగ్‌ను తన X ఖాతాలో పోస్ట్ చేస్తూ, “దయచేసి అతనికి సహాయం చేయండి!” అని సరదాగా వ్యాఖ్యానించాడు… ఒక చనిపోయిన వ్యక్తి మళ్లీ ప్రకటన ఇవ్వడం అసాధ్యం కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయి, తమదైన శైలిలో కామెంట్లు కురిపించారు..: “అతను ఇంటర్నెట్ వాడుతున్నాడంటే, స్వర్గం/నరకం నుండి 4G కవరేజ్ బాగున్నట్లే!”

తీరా నేను ఆరా తీస్తే… ఇది సోషల్ మీడియాను షేక్ చేసింది 2022 సెప్టెంబర్‌లో అని తెలిసింది… కానీ ఇప్పటికీ ఆ కామెంట్లు గట్రా ఆసక్తికరం… నిజానికి ఏం జరిగింది అని కొందరు ఆరాలు తీస్తే ప్రధాన సమస్య భాషాపరమైన అనువాదం (Translation Error) అని విశ్లేషణలో తేలింది…
ఇది చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రకటన అయి ఉంటుంది… తమ ప్రాంతీయ భాష (అస్సామీ లేదా స్థానిక భాష) నుండి ప్రకటనల కోసం హిందీ లేదా ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసే క్రమంలో ‘మా నాన్న’ లేదా ‘మా బంధువు’ డెత్ సర్టిఫికెట్ అని చెప్పడానికి బదులుగా ‘నా డెత్ సర్టిఫికెట్’ అని పొరపాటున రాసి ఉండవచ్చు…
నటుడిగా, రాజకీయ వ్యంగ్యకారుడిగా పేరున్న పరేష్ రావల్ ఈ క్లిప్పింగ్‌ను పంచుకోవడం, సామాజిక అంశాలలో హాస్యాన్ని ఎంత పండించవచ్చో చూపించింది… అయితే, కొందరు నెటిజన్లు ఈ పొరపాటుపై నవ్వడం సరికాదని విమర్శించారు, విద్యా పరిజ్ఞానం లేని వారి అసౌకర్యాన్ని ఎత్తి చూపడం సరికాదని అన్నారు…
డెత్ సర్టిఫికెట్ వంటి కీలక పత్రాలు పోయినప్పుడు, దాన్ని మళ్లీ పొందడానికి *ఎఫ్‌ఐఆర్ (FIR)*తో పాటు, పత్రం పోయినట్లు స్థానిక పత్రికలో ప్రకటన ఇవ్వడం తప్పనిసరి… ఆ వ్యక్తి కేవలం ఈ చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తూనే ప్రకటన ఇచ్చి ఉండవచ్చు, కానీ పదాల ఎంపిక వల్ల అది వైరల్ వినోదంగా మారింది… ఇది చదువుతుంటే… నేను గత ఏడాది బతికి ఉన్నానో లేదో చస్తే గుర్తురావడం లేదు అని పైన కథనం గుర్తొచ్చింది, అదీ సంగతి…
Share this Article