.
త్రేతాయుగపు అయోధ్యే మనకన్నా నయం …. మన మహానగరాలు వాయు, వాహన కాలుష్యాలతో, ట్రాఫిక్ జామ్ లతో నరకకూపాలై…ఊపిరితిత్తుల రోగాలకు కేరాఫ్ అడ్రస్ లు అయి… చివరకు అవకాశం ఉన్న నగరపౌరులు కొండాకోనలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న “వర్క్ ఫ్రమ్ హిల్” కథనం నిన్ననే చదివాం కదా!
https://share.google/z7VxQqUAj0yVMUOK9
Ads
దీనికి విరుగుడుగా త్రేతాయుగపు అయోధ్యా నగరం అందచందాలు, ఇళ్ళ నిర్మాణాలు, పాలనలో భాగంగా కోసల రాజ్యం అయోధ్య పౌరులకిచ్చిన వసతులు, సౌకర్యాలు తెలుసుకుంటే కనీసం పుణ్యమైనా వస్తుంది.
“చతుర్భిః సమతాః పథ్యః స్వచ్ఛమార్గాః మనోరమాః-
అయోధ్య కేవలం రాజకీయ రాజధానిగా కాకుండా ధర్మం, జ్ఞానం, ఆచారం ఆధారంగా నిర్మించిన మహానగరం.
ఆ అయోధ్య మహానగరం విశాలమైనది. సుభిక్షమైనది. సుఖసంతోషాలకు ఆలవాలమైనది.
ఆ మహిమాన్వితమైన నగరం నలభై ఎనిమిది యోజనాల పొడవుతో, తొంభై ద్వారాలుగల మహా ప్రాసాదాలతో అలరారుతున్నది.
విశాలమైన వీధులు, సమృద్ధిగా ధనం ఉన్న ప్రజలు, బంగారు గోపురాలతో అలంకరించిన గృహాలు ఉన్న శుభనగరం.
అయోధ్య భువిపై వెలిసిన స్వర్గం. ధర్మం, సౌందర్యం, సమృద్ధి కలగలిసిన నగరం”.
సరయూ నది ఒడ్డున నిర్మించిన అయోధ్య వర్ణన ఇది. రాజవీధులు, ప్రధానమైన మార్గాలు వంకర టింకరగా కాకుండా నేరుగా ఉండేలా చతురస్రాకారపు పలకల్లా నివాస ప్రాంతాలను విభజించారట. “జలయంత్ర మందిరాలు” పైకప్పు నుండి కిటికీలమీద నీళ్ళు పడేలా అమర్చిన ఏ సీ ఇళ్ళు; పెద్ద వెదురు బుట్టల్లో బహుళ అంతస్తులకు చేరుకోవడానికి వీలైన లిఫ్ట్ ఉన్న ఇళ్ళు (బహుశా బుట్టలో కూర్చోగానే తాడుతో లాగేవారేమో) ఇలా త్రేతాయుగపు అయోధ్యలో వాల్మీకి చూపు నుండి జారిపోయిన అంశం లేదు.
అ-యుద్ధ – అయోధ్య. అంటే యుద్ధంలో గెలవడానికి విలుకానిది. లేదా యుద్ధం అవసరంలేనిది. కాబట్టే దశరథుడు- రాముడు- లవకుశుల పాలనలోనే 85 వేల ఏళ్ళపాటు అయోధ్య ఒక వెలుగు వెలిగింది. మిగతా ఇక్ష్వాకు ప్రభువుల కాలాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఎన్ని లక్షల ఏళ్ళ ఏలుబడి అవుతుందో!(త్రేతాయుగపు కాల ప్రమాణాలను ఇప్పటి సంవత్సరాలతో లెక్కకట్టి కన్ఫ్యూజ్ కాకూడదు. ఆ లెక్క వేరు)
రామరాజ్యమది. ఎన్ని యుగాలు గడిచినా రాముడి పాలనే అందరికీ ఆదర్శం. అదే కొలమానం.
ఇప్పుడు వంకరలే సిగ్గుపడేంతగా తిరిగిన చేవెళ్ళ దారుల వంకర్లలో కంకర రాళ్ళలో ప్రాణాలు సమాధి అవుతున్నా దారిని విస్తరించడానికి ప్రభుత్వాలకు యుగాలు పడుతోంది. “రోడ్డుకు చెట్టు అడ్డం- చెట్టుకు రోడ్డు అడ్డం” లాంటి గ్రీన్ ట్రిబ్యునల్ చెట్ల చర్చ ముగిసేలోపు ఆవిరయ్యే ప్రాణాలెన్నో!
వెనకటికి జంధ్యాల నాటకంలో ఒక పదవీ విరమణ పొందిన బడుగు జీవి ప్రభుత్వ కార్యాలయానికి వెళతాడు. తనకు రావాల్సిన పెన్షన్ తాలూకు ఎరియర్స్ ఎప్పుడొస్తాయని అడుగుతాడు. “ఇన్నేళ్లుగా తిరుగుతూనే ఉన్నావు నువ్వు. అడిగిన అన్ని కాగితాలు ఇచ్చావు! నువ్ బతికి ఉన్నట్లు ఇంకొక్క కాగితమిస్తే…” అంటాడు ఉద్యోగి. మనవైపు తిరిగి ఆ బడుగు జీవి- “అయ్యో నేనింకా బతికే ఉన్నానా? చావలేదా?” అంటాడు. ప్రేక్షకుల కరతాళధ్వనులతో హాలు హాలంతా మారుమోగిపోయేది. (ఇదే పాయింట్ మీద మరో కథనం ‘ముచ్చట’లో .… )
ఇదివరకు సామాజిక సమస్యలమీద ఇలా పదునైన ప్రదర్శనలైనా కర్తవ్యాన్ని గుర్తు చేసేవి. ఇప్పుడు జగన్నాటకంలో ఎవరి నాటకం వారిది కావడంతో సమాజాన్ని పట్టి పీడించే సమస్యలు తెరమరుగై మన మొహాలే ముఖపుస్తకంలో, ఇన్‌స్టాలో రీళ్ళు రీళ్ళుగా తిరుగుతున్నాయి.
ప్రభుత్వ విధానాల్లో కొన్ని ఇప్పటికీ జంధ్యాల నాటకంకంటే దారుణంగా ఉంటాయి.
అన్నట్లు-
మన నగర ప్రణాళిక మరో యాభై ఏళ్లకు సరిపడా సిద్ధం;
మన ప్రజా రవాణా వ్యవస్థ మరో వందేళ్ళకు సరిపడా సిద్ధం;
మన డ్రెయినేజీ వ్యవస్థ మరో వందేళ్ళకు సరిపడా సిద్ధం- అని మీడియాలో రోజూ వార్తలు చదువుతూ ఉంటాం. వింటూ ఉంటాం. చూస్తూ ఉంటాం- “క్రూయల్ జోక్- క్రూర పరిహాసం” అన్నమాటకు రియలిస్టిక్ ఉదాహరణగా!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article