.
రష్మిక… నేషనల్ క్రష్మిక… ప్రస్తుతం ఇండియన్ సినిమా వుమెన్ సూపర్ స్టార్… మొన్న ది గరల్ ఫ్రెండ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ‘పీరియడ్స్’ గురించి మాట్లాడుతూ, మహిళలు పడే బాధను, ఆ సమయంలో ఎదురయ్యే మూడ్ స్వింగ్స్‌ను వివరించింది…
“మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే గానీ, మా మహిళల బాధ ఏంటో, ఆ సమయంలో మేం ఎంత యాతన అనుభవిస్తామో అర్థం కాదు. కనీసం ఒక్కసారైనా మగాళ్లు ఆ బాధను అనుభవిస్తే, అప్పుడు మహిళల కష్టాలను అర్థం చేసుకుంటారు…”
అనే అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యానించింది… ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి, ఈ సినిమా స్త్రీవాద (Feminist) కోణాన్ని, ఆమె పాత్ర భావోద్వేగ లోతును హైలైట్ చేయడానికి ఉపయోగపడ్డాయి… కాకపోతే ఈ సినిమా కథ భిన్నం…
Ads
ఈ చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ ఇంకెక్కడో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు తీసి కోట్లు సంపాదించాను… కానీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నాకు డబ్బు కంటే ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది… మీరు మంచి రేటింగ్ ఇవ్వకుండా తప్పించుకోలేరు” అంటూ కాస్త డిఫరెంట్ ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు… రివ్యూయర్లను కూడా ఉద్దేశించి…
అంతేకాదు… ఈ సినిమా కథ, రష్మిక నటనపై ఆయనకు అపారమైన నమ్మకం ఉంది… రష్మిక నటనకు జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు… ఒక్కమాటలో చెప్పాలంటే, అల్లు అరవింద్ తన అనుభవం, గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ కంటెంట్-బేస్డ్ సినిమాకు పెద్ద అండగా నిలబడ్డాడు…
ఈ కారణాల వల్ల ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది… ప్రీమియర్లు వేసి, కొందరికి చూపిస్తున్నారు… ఎస్, రష్మిక ఈ పాత్ర అంగీకరించడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్… ఇది రొటీన్, కమర్షియల్, ఫార్ములా సినిమా కాదు… స్టార్ హీరోల పక్కన గెంతులేసే పాత్ర కాదు… తన నటనకు పరీక్ష, పదును పెట్టుకునే పాత్ర… అందుకే ఇతరత్రా భారీ తారాగణం ఎవరూ లేకపోయినా… తన కోసం తను అంగీకరించింది… బాగా చేసింది… ప్రత్యేకించి ఎమోషనల్ సీన్లలో, క్లైమాక్సులో… గుడ్… నటిగా మరో మెట్టు ఎక్కినట్టే… జాతీయ అవార్డు సంగతి మనకు తెలియదు…
మరి సినిమా.. రష్మిక మందన్నతో పాటు దీక్షిత్ శెట్టి , అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ నటించిన ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్… ఇది టాక్సిక్ లవ్ స్టోరీ, దాన్నుంచి బయటపడే ఓ మహిళ మథనం కథ…
టాక్సిక్ లవ్ స్టోరీని (Toxic Love Story) హృదయాలకు కనెక్టయ్యేలా, వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు… ఒక ప్రేమ సంబంధంలో అమ్మాయిపై అబ్బాయి పెత్తనం, నియంత్రణ (Controlling attitude) వల్ల ఎదురయ్యే సమస్యలను, ఆ తర్వాత ఆమె తనను తాను ఎలా కనుగొంటుందనే అంశాన్ని హైలైట్ చేసింది…
చివరకు ఆమె ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి వంటి విషయాల్లో అతడు పరిమితులు పెడుతూ ఉంటాడు… భూమ (రష్మిక) వ్యక్తిగత జీవితంపై విక్రమ్ (దీక్షిత్) పెత్తనం, ఆంక్షలు పెట్టినప్పుడు వాళ్ల ప్రేమ బంధం విషమయంగా కనిపిస్తూ… అదుగో అందులో నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ…
భూమ తన స్వీయ గౌరవం (Self-Respect), స్వేచ్ఛ (Freedom) స్వీయ గుర్తింపు (Self-Identity) కోసం పోరాడుతుంది… ఈ ప్రయాణంలో ఆమె విక్రమ్ నుండి దూరం కావడానికి తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులను దర్శకుడు పెద్దగా గందరగోళం లేకుండా చిత్రీకరించాడు…
ఫస్టాఫ్ అటూఇటూ ఉన్నా… సెకండాఫ్‌లో కథ వేగంగా సాగి, క్లైమాక్స్ పవర్ ఫుల్‌గా ముగించారు… సంగీత దర్శకత్వం ఇద్దరు… అబ్దుల్ వాహబ్ సంగీతం, ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్… ఢమఢమ వాయించడం కాదు, సీన్లకు తగినట్టు ఆప్ట్… సినిమాటోగ్రఫీ కూడా వోకే…
నిజానికి టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అనే కథ రొటీనే… పాతదే… కానీ దర్శకుడు దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు, చాలావరకూ సక్సెసయ్యాడు కూడా… అనవసరంగా సెన్సార్ బోర్డ్ కొన్ని రొమాంటిక్, లిప్ లాక్ సన్నివేశాల నిడివిని తగ్గించిందని అన్నారు… కానీ ఉన్నా బాగానే ఉండేదేమో…
‘ది గర్ల్ ఫ్రెండ్’ అనేది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, ఆధునిక సంబంధాలలో ఉండే సంక్లిష్టతలను, వాస్తవాలను, అమ్మాయి ఎంపికలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే భిన్నమైన చిత్రం… (ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ బేస్డ్ కథనం ఇది…)
Share this Article