.
“ఒక రోజు అర్ధరాత్రి హర్మన్ (హర్మన్‌ప్రీత్ కౌర్), స్మృతి (స్మృతి మంధానా) నా గదికి వచ్చారు, ‘మీరు వచ్చే ప్రపంచ కప్‌కు మాకోసం వస్తారో లేదో మాకు తెలియదు, కానీ ఈ ప్రపంచ కప్‌ను ఈసారే మేం మీకోసమే గెలుస్తాం’ అని చెప్పారు… చివరకు వారు ఆ పని చేసి చూపించారు…”
సీన్ కట్ చేస్తే… ఆ హామీని వారు నిలబెట్టుకున్నారు… భారత్ తమ మొట్టమొదటి మహిళల ప్రపంచకప్‌ను గెలిచింది… ఆ తర్వాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా వంటి క్రీడాకారులు ఆమెను మైదానంలోకి ఆహ్వానించి… ఆ ట్రోఫీని ఆమె చేతుల్లో పెట్టారు…
Ads
ఆ విజేతలు, తన జూనియర్ క్రీడాకారులు ఇచ్చిన ఈ గౌరవం, చూపించిన అభిమానం పట్ల ఆనందంతో ఆమె కళ్ళ నుండి నీళ్ళు ధారగా కారాయి… ఎన్నో సంవత్సరాల కలలు, కష్టాలు, పోరాటాల భారం ఆ క్షణంలో ఓ ఉద్విగ్న ఆనందంగా మారిపోయాయి… ఆమె ప్రారంభించిన ఒక కలను నేటి తరం క్రీడాకారులు పూర్తి చేశారు… ఆ కల ఇంటికి వచ్చింది!
ఆమె పేరు తెలుసా… ఝులన్ గోస్వామి… భారతీయ మహిళా క్రికెట్ నిర్మాణంలో ఓ పునాది శిల ఆమె… మనం అందరి గురించీ మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం… ఈ విజయోత్సవపు క్షణాల్ని పంచుకున్నాం… కానీ ఈమె గురించి మరిచిపోయాం… నిజానికి ఆమె గురించే మొదట చెప్పుకోవాలి, మిగతా వాళ్లందరూ ఆమె తరువాతే…
భారత మహిళా క్రికెట్ జట్టుకు తన బౌలింగ్‌తో, నాయకత్వంతో, అంకితభావంతో పునాది వేసిన గొప్ప క్రీడాకారిణి ఝులన్ గోస్వామి... ఆమె కేవలం ఒక పేస్ బౌలర్ మాత్రమే కాదు, ఒకటీరెండు తరాల యువతులకు ప్రేరణగా నిలిచిన ఒక శక్తి.,, 2022లో ఆమె రిటైర్ అయినప్పటికీ, ఆమె కల సాకారం కావాలని ఆశించిన భారత జట్టు, ఇటీవల దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి, తమ మొట్టమొదటి మహిళల ప్రపంచకప్‌ను గెలిచి, ఆ కలను నిజం చేసింది….
రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు గుండె చప్పుడులా నిలిచిన ఆమె, ఎన్నో రికార్డులు సృష్టించింది, కానీ జట్టుకు ప్రపంచ కప్ అందించలేకపోయింది… ఈ కల ఆమెకు ఎంత ముఖ్యమో ఆమె సహచర క్రీడాకారులకు తెలుసు… అందుకే ఆ ట్రోఫీని ఆమె చేతుల్లో పెట్టారు, వినయంగా, గౌరవంగా, అభిమానపూర్వకంగా… ఆత్మీయంగా.,. ఆ ఫోటో చూస్తారా..?

ఆమె వివరాలు ఇవీ…
పేరు ఝులన్ నిషిత్ గోస్వామి, 1982… పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా, చక్దాహ్ ఊరు… 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు… ఆమె నిక్ నేమ్స్ బాబుల్, చక్దా ఎక్స్‌ప్రెస్… కుడిచేతి మీడియం పేస్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాటర్… 2002లో ఇంగ్లండ్‌తో కెరీర్ స్టార్ట్…
చిన్న పట్టణం… మధ్యతరగతి కుటుంబం.,.. 1992 క్రికెట్ ప్రపంచ కప్‌ను టీవీలో చూసినప్పుడు ఈ ఆటపై మోజు పెరిగింది… కోల్‌కతాలో శిక్షణ కోసం ఆమె ప్రతిరోజూ తన ఇంటి నుండి గంటల తరబడి ప్రయాణించేది…
కెరీర్ హైలైట్స్ & రికార్డులు
- 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్…: 2002 నుండి 2022 వరకు భారత జట్టుకు సేవ….
- అత్యధిక ODI వికెట్లు…: మహిళల ODI చరిత్రలో అత్యధిక వికెట్లు (255 వికెట్లు) తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు….
- 300+ అంతర్జాతీయ వికెట్లు…: మొత్తం 284 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 311 వికెట్లు (టెస్ట్: 44, ODI: 255, T20I: 56) పడగొట్టింది…
- 250 ODI వికెట్లు…: ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా బౌలర్…
- ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు…: మహిళల ప్రపంచ కప్‌ల చరిత్రలో అత్యధికంగా 43 వికెట్లు…
- ఆల్‌రౌండర్ ఘనత…: ODIలలో 1000 పరుగులు, 100 వికెట్లు, 50 క్యాచ్‌లు సాధించిన ఏకైక భారతీయ మహిళా క్రికెటర్…
2010లోనే అర్జున అవార్డు… 2012లో పద్మశ్రీ… నిజంగా ఈమెది ఓ స్పూర్తిదాయక కథ… ఆమె మహిళా జట్టుకు ఓ కపిల్ దేవ్…!! ఆయన ప్రపంచకప్ ఎత్తాడు, ఈమెకు ఆ ట్రోఫీ దక్కలేదు… అంతే తేడా..!! ఒక మిథాలీ రాజ్… ఒక ఝులన్ గోస్వామి… దశాబ్దాల తరబడీ ఆడీ ఆడీ… అందుకే ఈ ట్రోఫీని పట్టుకుని కన్నీటిపర్యంతం అయ్యారు…!!
Share this Article