.
2004… అంటే, 21 ఏళ్ల క్రితం… చంద్రబాబు కబంధ హస్తాల నుంచి ఉమ్మడి ఆంధ్ర విముక్తి పొందిన ఎన్నికలవి… ఇంకా ఫలితాలు రాలేదు… ఈనాడు ఎన్నికల స్పెషల్ చివరి రోజున ఓ ఆర్టికల్…
ఎందుకు ఇప్పుడు చెప్పుకోవడం అంటే… ఫేస్ బుక్ ఓ మెమొరీని గుర్తుచేసింది… ఎప్పుడూ ఏ ఎన్నిక ఫలితమూ ఏదీ సరిగ్గా చెప్పదు… ఎవరికి వారు ఏదేదో అన్వయించుకుంటారు… రాబోయే జుబిలీ హిల్స్ ఎన్నిక ఫలితం కూడా ఏమీ చెప్పదు… ఎవరికి తోచిన బాష్యం వాళ్లు చెబుతారు…
Ads
అందుకే ఆ పాత ఈనాడు క్లిప్పింగ్ టెక్స్ట్ ఓసారి షేర్ చేసుకోవాలని అనిపించింది… ఎన్నికల ఫలితాల విశ్లేషణ ఎంత సంక్లిష్టమో చెప్పడమే దీని ఉద్దేశం…
రాజకీయ భేతాళం!…… పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైనున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే స్మశానం వైపు నడవసాగాడు… శవంలోని భేతాళుడు విక్రమార్కుడితో మాటలు కలిపాడు…
రాజా.,. ఏమిటీ విశేషాలు..?
ఏముందీ… రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఓటరు సృష్టమైన తీర్పు చెప్పాడుగా, తమకు మార్పు కావాలంటూ…
అదేమిటి, ఒక్క ముక్కలో తేల్చేశావు,,. స్థూలంగా పరిశీలిస్తే ఓటరు మార్పు కోరాడనేది నిజమే, కానీ నీవంటి సూక్ష్మబుద్ధులు మరింత సూక్ష్మంగా పరిశీలించి గానీ అంతిమ ప్రకటన చేయబడదు…
నువ్వనేది ఏమిటో బోధపడటం లేదే… ఓటరు నాడి ఏమిటో ఎగ్జిట్ పోల్స్ కూడా బయట పెడుతూనే ఉన్నాయి కదా!
ఓటరు నాడి ఏమిటో చానళ్లకేం తెలుసు? తెలుగు సినిమా ప్రేక్షకుడి మనసేమిటో… వన్డే క్రికెట్ పోటీలో ఎవరు గెలుస్తారో… ఎవరూ చెప్పలేదు.. ముందే తెలిస్తే ఇక ఇన్ని తిప్పలెందుకు, లేనిపోని హామీలు చేయడమేల? ప్రచారంలో ఇంతగా వ్యయ ప్రయాసలేల?
నువ్వనేది నిజమే కావచ్చు. కానీ తనకు తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు నచ్చలేదని. దాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగానే చెప్పాడు కదా ఓటరు…
సరే సరే… ఎలాగూ చర్చ వచ్చింది కదా, కొన్ని అంశాలు చెబుతా. అప్పుడు నా సందేహాలకూ సమాధానాలు ఆలోచించి మరీ చెప్పు… రాజా..
సరే కానివ్వు….
‘భువనగిరి అసెంబ్లీ స్థానంలో నరేంద్రను ప్రజలు ఓడించారు. కానీ మెదక్ పార్లమెంటు స్థానంలో గెలిపించారు. ఇంతకి నరేంద్ర నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించినట్లా? తిరస్కరించినట్టా…
నరేంద్ర కోణం నుంచి కాకుండా వేరే కోణంలో చూడాలిది.. భర్త పోయినా రాజకీయాల్లోనే ఉంటూ…. కార్యకర్తలను పట్టించుకుంటూ.. కష్టపడుతున్నందున అక్కడ ఉమామాధవరెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్లో ఎంతోకాలం ఉండి. పలు పదవులూ అనుభవించి, అకస్మాత్తుగా పార్టీ మార్చి భాజపా తరపున నిలబడిన రామచుంద్రారెడ్డిని ప్రజలు తిరస్కరించారు…
“మరి అదే నిజమైతే, మొన్నమొన్ననే నక్సలైట్లు తన భర్తను చంపేసినా… వెరవకుండా తిరిగి పోటీలో నిలబడ్డ మంత్రి మణకుమారిని ఎందుకు గెలిపించలేదు! పార్టీ ఫిరాయించినా నాగేందర్‌ను ఆసిఫ్‌నగర్‌లో ఎందుకు గెలిపించారు?
…… ,, …..
సమాధానం చిక్కడం లేదా? సరే. ఇది విను. ఎన్టీయార్ సతీమణి లక్ష్మీపార్వతికి డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ ఎన్టీయార్ కుమార్తె పురంధరేశ్వరికి మాత్రం ఘనవిజయం దక్కింది. ప్రజలు ఎన్టీయార్ పట్ల ప్రదర్శించిన భావమేమిటి?
పురంధరేశ్వరి ఎన్టీయార్ రక్తం. కానీ లక్ష్మి పార్వతి బయటి నుంచి వచ్చిన వ్యక్తి… అదీ తేడా…
“మరి ఒక అల్లుడు చంద్రబాబును గద్దె ఎందుకు దించారు? ఇంకో అల్లుడు వెంకటేశ్వర్ రావును ఎందుకు ఆదరించారు….
…… ,, …….
‘మరోటి చెబుతా విను. ఎంపీగా పోటీచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన భార్య సుజాతమ్మను గెలిపించారు… ఆమోదించారు. అదే సమయంలో అదే జిల్లాలోనే నాగిరెడ్డినీ, ఆయన భార్య శోభనూ ఓడించి తిరస్కరించారు. భార్యాభర్తలు ఇద్దరూ పోటీలో నిలబడినప్పుడు… వేర్వేరుగా ప్రజలు ఎందుకు స్పందించారు?
వాళ్లు కాంగ్రెస్ జంట. వీళ్లు తెలుగుదేశం జంట. ఒక జంటను గెలిపించారు. మరో జంటను తిరస్కరించారు… అంతే’
‘మరి అలాంటప్పుడు బొత్స సత్యనారాయణను ఎందుకు గెలిపించారు. ఆయన భార్య రూన్సీని ఎందుకు ఓడించారు? ”
…… ,, …..
జవాబు తట్టడం లేదా? ఇది విను. వెంకటరెడ్డి జైలులో ఉంటే ఆయన భార్య గౌరు చరితను గెలిపించారు. అదే పోతుల సురేష్ భార్య సునీతను ఓడించారు. ప్రజలు నేరచరితుల పట్ల ఏ విధంగా స్పందించినట్లు?
ఇదీ అలాగే… ఆమె కాంగ్రెస్ కాబట్టి గెలిపించారు. ఈమె తెలుగుదేశం కాబట్టి ఓడించారు…
మరి కాంగ్రెస్‌కు చెందిన సూర్యనారాయణరెడ్డి భార్య భానుమతిని ఎందుకు ఓడించినట్టు..?
…… ,, ……
కృష్ణా జలాలను ఇంటనగరాలకు తీసుకురావడం ఎంత కష్టమో నీకు తెలుసు. ఇది సాధించిన తెలుగుదేశాన్ని హైదరాబాద్లో ప్రజలు ఓడించారు. మెట్రోరైలును తెచ్చిన భాజపానూ ఓడించారు. ఇక అభివృద్ధి చేసే వారిని ప్రజలు ఆదరిస్తున్నట్టా..? అసలు ఆ విషయాన్నే పట్టించుకోనట్లా?
ప్రజలు ఉమ్మడిగా ఉపయోగపడే పనులకు ప్రభావితులు కారు. తమకు వ్యక్తిగతంగా ఉపయోగపడే లాభాలను, సాయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే నాయకులు ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేది.
“మరి సింగరేణిని లాభాల బాటలోకి తీసుకొచ్చి.. జీతాలు పెంచి… లాభాల్లో వాటాలు కూడా పంచిపెట్టడం వల్ల సింగరేణి కార్మికులు వ్యక్తిగతంగానూ లాభపడ్డారు కదా… అక్కడ మేడారంలో తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 56 వేల మెజారిటీతో ఎలా గెలిచినట్లు? వ్యక్తిగతంగా సాయాలు చేస్తే ఆదరిస్తారనేదే నిజమైతే… కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టి.జి. వెంకటేశ్ అంతగా మంచినీరు- డిష్ కనెక్షన్లు, ఓట్లు కానుకలు ఇచ్చినా… జనం ఎందుకు ఓడించారు? సీపీఎం అభ్యర్థి గపూర్‌ను ఎందుకు గెలిపించినట్టు?
….. ,, ……
సరే, సరే, సాక్షాత్తూ చిరంజీవి మద్దతు పలికినా అశ్వినీదత్ ఎందుకు ఓడిపోయారు…. స్వయంగా రంగంలో దిగిన రోజా ఎందుకు ఓడిపోయింది. అంత మెగాస్టార్ చెప్పినా ప్రజలు ఎందుకు వినలేదు… అంత అందాలనటి పోటీ చేసినా ప్రజలు ఎందుకు కాదన్నారు. సినీ నటులకు, వారి మాటలకు ప్రజలు ఎందుకు ఆదరణ చూపించలేదు?
సినీనటులను ఆదరించేది కేవలం వారి నటనను చూసే. సినిమాలను దాటి రాజకీయాల్లోకి వస్తే ఆదరించే రోజులు కావివి, అందుకు రజినీకాంత్ చెప్పినా తమిళనాడు ప్రజలు తన మాటను ఖాతరు చేయలేదు.
మరి ఎన్టీయార్ చిన్న మనమడు చిన్న ఎన్టీయార్ మద్దతు పలికిన కొడాలి నానిని ఎందుకు గెలిపించినట్టు?
…… ,, ……
పూర్తిగా పట్టణ ప్రాంతమైన సికింద్రాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రజలు ఓడించారు. అదే పూర్తిగా పల్లె ప్రాంతమైన స్టేషన్ ఘన్‌పూర్‌లో మంత్రి కడియం శ్రీహరిని ఓడించారు. దీంట్లో ప్రజల వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి?
ఆ కోణం సరికాదు. ఇద్దరు మంత్రులూ తెరాసను విపరీతంగా తిట్టేవారు. తెలంగాణవాదం ప్రబలంగా ఉండి, ప్రజలకు వారి ధోరణి నచ్చక ఓడించారు.
‘మరి నాగర్ కర్నూలులో మరో మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని ఎందుకు గెలిపించారు. ఆయన కూడా తెరాసను బాగానే తిట్టేవారు కదా?
….. ,, …..
ఇలా… ఎన్నో ఎన్నెన్నో. ఒక అంశంలో ఒకలాగా అనిపించే ఓటరు తీర్పు మరో అంశంలో మరోలా అనిపిస్తుంది. అందుకే ఓటరు తీర్పును ఎవరికి వారు ఏ రీతిలోనైనా అన్వయించుకోవచ్చు.
“నేనే సమాధానపడలేకపోతున్నా..”
‘ఇంగ్లీషులో పారడాక్స్ అనే ఒక పదముంది. అబద్దంలా కనిపించే నిజం… నిజంలాగే అనిపించే అబద్ధం. హేతుబద్ధంగా అనిపించే నిర్హేతుకత. నిర్హేతుకంగా కనిపించే హేతుబద్ధత… క్లిష్టంగా ఉందా అర్ధం చేసుకో వడం..? ఓటరు నాడి కూడా సూక్ష్మంగా పరిశీలిస్తే ఇలాగే ఉంటుంది.
విక్రమార్కుడు మాట్లాడకపోయేసరికి భేతాళుదు తిరిగి చెట్టెక్కాడు! – మంచాల శ్రీనివాస్ రావు
Share this Article