.
ఇక్కడ కళలు దాల్చేరు…. ఆదిత్య బిర్లా పేరుమోసిన కంపెనీ. 150 ఏళ్ళకు పైబడి అనేక రంగాల్లో, 40కి పైగా దేశాల్లో వ్యాపారాలు చేస్తున్న పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీ నగల వ్యాపారంలోకి వచ్చినప్పుడు ఆ బ్రాండ్ కు పెట్టుకున్న పేరు “ఇంద్రియ”. మంచిదే.
అర్థంలేని చెత్త పేర్లతో పోలిస్తే ఇంద్రియ స్పృహతో భారతీయ స్పర్శతో పేరు పెట్టుకున్నందుకు సంతోషించాలి. ఆ నగల్లో బ్రైడల్, టెంపుల్ జువెలరీ కలెక్షన్ కు ప్రత్యేకంగా “అనంతారా” అని పేరు పెట్టారు. అనంతమైన నక్షత్రం అన్న అర్థం సాధించడానికి ప్రయత్నించినట్లున్నారు. మంచిదే.
Ads
ఏ భాషలో ముందు రాసి తరువాత ఏయే భాషల్లోకి అనువదించారో తెలియదు. చాట్ బోట్, గూగుల్ లాంటి యంత్రాలే ఎక్కువగా ఇలాంటివాటిని అనువదిస్తూ ఉంటాయి. అంత అందమైన బ్రైడల్ టెంపుల్ జువెలరీ కలెక్షన్ ప్రచారం తెలుగులో ఎన్నెన్ని కళలుపోయిందో!
ఎత్తుగడలోనే- “మీ కలల వధువు అవ్వండి” అని ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి అనేక వ్యాకరణ గ్రంథాలు అవసరం. అందుకే ఎవ్వరూ సాహసించరు. (మా నగలు ధరించి మీరు కలగన్న వధువు అవ్వండి; మా నగలతో వధువుగా మారండి- అని పెద్ద మనసుతో మనం అర్థం చేసుకోవాలి)

ఈరోజు దాల్చేరు;
మీ కళలను సాకారం చేసుకోండి…
(ఈ దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, పచ్చ కర్పూరం బహుశా బంగారానికి తావి అబ్బడానికి ప్రయత్నంగా విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే మీ డ్రీమ్స్ నిస్సారం కాబట్టి అవి ఒట్టి కలలు. ఈ నగలను దాల్చిన తరువాత అవి సప్తవర్ణ శోభిత “కళలు” అవుతాయి కాబట్టి…ఇక్కడ తప్పు రాసినా…ఒప్పు అర్థాన్ని బాధ్యతగా స్వీకరించాలి.
పైగా ఆ బ్రైడల్ జువెలరీ ధరిస్తే కళాత్మక కలలే వస్తాయి కాబట్టి అప్పుడది- మన కళలను సాకారం చేసుకోవడానికి వేసుకోవాల్సిన నగలే అవుతాయన్న ట్రూ స్పిరిట్లోనే తీసుకుని రాసినవాడికి రెండు మూడు వీరతాళ్ళు చుట్టచుట్టి మెడలో ఒకేసారి వేయాలి)
సాధారణంగా ఇంద్రియాల ద్వారా మెదడు ఇన్ పుట్స్ ను లోపలికి తీసుకుంటుంది. ఈ ఇంద్రియా అనేక అవుట్ పుట్స్ ను బయటికి కాంతులుగా వెదజల్లేలా ఉంది.
కలలు కనండి!
కళలు కూడా కనండి!!
కంటే పోయేదేమీ లేదు… దాల్చే రూపం తప్ప!!
ఈ దాల్చా ఏమో గానీ… మధ్యలో ఏదో కుర్మా అని కూడా కనిపించింది… జిలేబీ హారం అని కూడా..! మంచి ఫుడ్ జువెలరీ ఉన్నట్టుంది..!!
పైగా కాంతుల ప్రకాశం అట… ఏం రాశారు గురూ…!
Share this Article