.
అందెశ్రీ… అలియాస్ అందె ఎల్లయ్య… ప్రజా కవి… సహజ కవి… చదువు లేదు… 1961లో పుట్టాడు… అనాథగా పెరిగాడు… గొడ్ల కాపరిగా, రోజు కూలీగా బతికాడు… ప్రకృతి కవి… తన పాట ప్రకృతి నుంచి సహజంగా పుట్టిందే…
తన కవిత్వం, తన గేయం, తన ఆలాపన… స్వయంభూ… తను సిసలైన తెలంగాణవాది… మానవతావాది… దళితుడు… రేబర్తి అని ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న ఊళ్లో పుట్టాడు… (ఈ వ్యాస రచయిత జన్మస్థలానికి రేబర్తి ఐదారు కిలోమీటర్ల దూరం)…
Ads
ఏ బలమైన బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా… ప్రోత్సాహం లేకపోయినా… ఓ స్పూర్తిదాయక కవిగా ఎదిగాడు… మాయమైపోతున్నడమ్మో మనిషిన్నవాడు… ఏనాటికైనా మరిచిపోయే వాక్యాలా అవి…? ఆశుకవిత్వం చెప్పడంలో దిట్ట… (ఈ గేయం ఏపీ యూనివర్శిటీ సిలబస్‌లో చేర్చబడింది)…
మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటను అస్త్రంగా మలిచిన కీలకపాత్ర… తెలంగాణ ధూంధాం రూపశిల్పి… ‘పల్లెనీకు వందనములమ్మో… కొమ్మ చెక్కితే బొమ్మరా… వంటి పాటలు తనేమిటో చెబుతాయి…
కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్… 2006లో నంది పురస్కారం (గంగ సినిమా కోసం)… దాశరథి సాహితీ పురస్కారం వంటి అనేక అవార్డులు…
ప్రధానంగా చెప్పుకోవాల్సింది తను రాసిన జయజయహే తెలంగాణ గీతం… ఉద్యమ సమయంలో మారుమోగిన పాట… తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటానికి, తెలంగాణను జాగృతం చేసిన స్పూర్తిగీతం అది… కానీ కేసీయార్ గద్దెనెక్కాక అది తెలంగాణ అధికారిక జాతిగీతం కాలేకపోయింది… అందెశ్రీ దొరతనానికి కొమ్ముకాయలేదు, భజన చేయలేదు… ఆ గొంతు, ఆ కలం సాగిలబడలేదు…
(ఇక్కడ గూడ అంజయ్య గురించీ చెప్పాలి… పుడితె ఒక్కటి, చస్తే రెండు… అయ్యోనివా నువ్వు అవ్వోనివా… ఊరు మనదిరా, వాడ మనదిరా వంటి పాటల ప్రజారచయిత పట్ల కేసీయార్ నిర్లక్ష్యం… కేసీయార్‌ను ఒక్కసారి చూడాలని హాస్పిటల్‌లో ఉండి అడిగినా ఖాతరు చేయని వైనం అప్పట్లో విమర్శలకు గురైంది…)
పాటలోని చరణాలు, నిడివి ఎట్సెట్రా ఎన్నో సాకులు, ఏవో కొర్రీలు… అందెశ్రీ మీద కోపంతో ఆ పాటనే పట్టించుకోలేదు కేసీయార్… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక… దాన్ని రాష్ట్రగీతంగా గుర్తించడమే కాదు, సంగీత దర్శకుడు కీరవాణితో స్వరరచన కూడా చేయించింది… ఆ పాటకు తండ్రి అందెశ్రీకే ఆ బాధ్యతను, స్వేచ్ఛను ఇచ్చింది…
కేసీయార్ ఇగ్నోర్ చేసినా సరే… తన హయాంలో ప్రతిచోటా ఆ గీతం ముక్కోటి గొంతుకలుగా వినిపిస్తూనే ఉంది… పాడని పల్లె లేదు, గల్లీ లేదు… అది తెలంగాణ మట్టి పాట… ఆ పాటలోని విశేషం అది… ఇక ఇప్పుడైతే అది అధికారికంగానే రాష్ట్రగీతం… ఆ గొంతు మూగబోయింది… ఆ కలం ప్రయాణం ఆగిపోయింది… సాహితీలోకాన్ని సంతాపంలో ముంచి… మాయమైపోయాడు… కాలం చేశాడు… ఎల్లన్నా నీకు నివాళి…!!
(అందెశ్రీ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాజీవితంలో ఉన్న ప్రముఖులు, సాహితీ ప్రముఖులు, కేసీయార్ సంతాపం ప్రకటించారు… అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం ఆదేశాలు)
Share this Article