.
ఏ చీకట్లకు ఈ వెలుగుల ప్రస్థానం?
యుగయుగాలుగా చీకట్లలో మగ్గి మగ్గి వెలుతురు కోసం బాగా అర్రులుచాచినట్లున్నాము. దాంతో విద్యుత్తు కనుక్కోగానే ఉక్కిరిబిక్కిరిగా రాత్రికి- పగటికి తేడా తెలియనట్లు బతకడం అలవాటు చేసుకున్నాం. నగరజీవితంలో నైట్ లైఫ్ దానికదిగా ఒక అనుభవించాల్సిన ఉత్సవంలా తయారయ్యింది. ప్రయివేటు కొలువుల్లో నైట్ డ్యూటీలు ఇప్పటి యుగధర్మం.
Ads
ఇళ్ళల్లో కూడా అర్ధరాత్రిదాకా టీ వీలు చూడడం, సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ పడుకోవడం…ఇలా రాత్రయినా ఇల్లంతా కళ్ళు చెదిరే వెలుతురు ఉంటోంది. లేదా కంటి ముందు స్క్రీన్ వెలుతురైనా ఉంటోంది. మనం ఆధునిక సాంకేతికతతో ఎన్ని వేషాలు వేసినా మన శరీరం పనితీరు సృష్టిలో పగలు-రాత్రికి అనుగుణంగానే అనుసంధానమై ఉంటుంది.
చీకటి పడకముందే ఎవరూ చెప్పకుండానే పక్షులు గూళ్ళకు చేరుకుంటాయి. తెల్లవారకముందే అంతులేని ఆకాశాన్ని సవాలు చేస్తూ రెక్కవిప్పి ఎగురుతూ ఉంటాయి. అది సృష్టిలో అన్ని ప్రాణులకు అమరిన జీవగడియారం- ఒక్క మనిషికి తప్ప!
ఎప్పుడు పడుకుని ఎప్పుడు లేస్తే ఏముంది? రోజులో అయిదారు గంటలు పడుకుంటే చాలుకదా? అన్నది ఆధునిక మానవుడి ప్రశ్న. పైగా ఇలా లేనివారిని ఆదిమ మానవులుగా చూసే పాడుకాలం కూడా వచ్చింది.
ఇంట్లో ఎల్ఈడి లైట్లు, ఫాల్స్ సీలింగ్ కు పాలపుంతలు సిగ్గుపడే తెలతెల్లని ఫాల్కన్ లైట్లు, వీధిలో బంగారు పోతపోసే నియాన్ లైట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లలో కళ్లుచెదిరే లైట్లు, రాత్రిళ్ళు రోడ్లమీద కంటిచూపు పోయేంత హెడ్ లైట్లు…ఇలా పగటికంటే రాత్రుళ్ళే అవసరమైనదానికంటే కాంతి ఎక్కువై మన కొంప మునుగుతోందని ఒక వైద్యశాస్త్ర అధ్యయనంలో తేలింది.
కాంతి ఎక్కువైతే కళ్ళకు మాత్రమే ప్రమాదమని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లం. కళ్ళేమో కానీ ఎక్కువైన కాంతి ఏకంగా గుండెకే దెబ్బకొడుతోందని అమెరికా హార్ట్ అసోసియేషన్ (ఏ హెచ్ ఏ) ప్రాథమిక అధ్యయనంలో రుజువయ్యింది. రాత్రిళ్ళు ఎక్కువ కాంతిలో ఉండేవారు, తిరిగేవారిలో గుండె జబ్బులు విపరీతంగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది.
ఇక్కడ వైద్యపరిభాషలో ఉన్న సంక్లిష్టమైన విషయాలు మనకనవసరం. మన భాషలో చెప్పుకోవాలంటే పగలు పగలే- రాత్రి రాత్రే అన్న స్పృహ మనకుంటే మన గుండె మిలమిల మెరుపులతో వెలుగుతూ హాయిగా దానిపాటికి అది వడిబాయక కొట్టుకుంటూ ఉంటుంది. రాత్రిని పగలుచేసి మిరుమిట్లుగొలిపే వెలుగులో ఉంటే గుండె విలవిలలాడి నైట్ ఓవర్ డ్యూటీ చేయలేక చస్తోంది.
“గుండెకు రాత్రేమిటి? పగలేమిటి? తొక్కలో గుండె…నోరుమూసుకుని…చచ్చినట్లు కొట్టుకోవాల్సిందే కదా?”
అన్నది గుండె యజమానిగా మన అహంకారమైతే…
“నాకూ మనసున్నాది…
కలతపడితే కన్నీళ్ళున్నాయి…
అలసిపోతే ఆగిపోయే దారున్నాది…”
అన్నది బహుశా గుండె సమాధానమవుతుంది.
చీకట్లు రాజ్యమేలిన రోజుల్లో కోటి కోటి దీపాలను కోటలలో, బాటలలో నాటండని దాశరథి కవితా ప్రతీకలతో పిలుపునిచ్చాడు. ఇప్పుడు డాక్టర్లు కోటలలో, బాటలలో, ఇళ్ళల్లో ఎక్కువైన కోటి కోటి దీపాలను ఆర్పండి అని అధ్యయనం నివేదికలతో మన గుండెల భద్రతకోసం పిలుపునిస్తున్నారు.
కొస బాధ:-
రాత్రిళ్ళు విద్యుత్ కాంతుల మెరుపులు కేవలం గుండెకే కాదు. ఇంకా ఎన్నెన్నో అనారోగ్యసమస్యలకు కారణమట.
“ఏ వెలుగులకీ ప్రస్తానం?”
అన్న మాటను మార్చి…
“ఏ చీకట్లకు ఈ వెలుగుల ప్రస్థానం?”
అని బాధపడాల్సిన కాంతివేగపు రోజులొచ్చాయి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article