.
అది ఫిబ్రవరి, 2020 అనుకుంటా… అప్పుడు నేను సమ్మక్క సారలమ్మ జాతర విధి నిర్వహణలో ఉన్నాను.
నేను VIP diversion point దగ్గర కూర్చుని ఉన్నాను. ఓ పెద్దమనిషి అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడే తిరుగుతున్నాడనుకుని….
ఓ పెద్దమనిషీ! ఎందుకు అటూ ఇటూ తిరుగుతున్నావు? ఇట్రా అంటూ, నా వాకీటాకీ, క్యాప్ పెట్టి ఉన్న కుర్చీ మీద నుండి వాటిని తీసేసి కూర్చోమని అన్నాను. చాలా సంతోషం సర్, అంటూ కూర్చున్నాడు ఆ పెద్దమనిషి. ఎందుకు తిరుగుతున్నావు? దర్శనం కోసమా అని అడిగితే, అవును సార్, మీవోళ్ళు పంపట్లేదు అన్నాడు.
Ads
సరేగానీ, నేను పంపిస్తా… ఫస్ట్ మంచినీళ్లు తాగుమని చెప్పి నీళ్ల బాటిల్ ఇచ్చా. తర్వాత ఒక్కరే వచ్చారా అని అడిగా. లేదు డ్రైవర్ తో వచ్చాను అన్నాడు. చాలా సాధారణంగా మాట్లాడుతూ ఉన్నా కానీ, నాకు ఎక్కడో ఈయనను చూసా అనిపిస్తుంది. ఆయన మీ పేరేంటని అడిగారు… నా వివరాలు చెప్పి మీరెవరని ఆయనను అడిగాను. నేను అందెశ్రీని అన్నాడు. ఓహ్… మీరేనా అందెశ్రీ అన్నాను… అదే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందని అన్నాను.
ఆయనో గొప్పకవి అని గానీ, ‘జయ జయహే తెలంగాణ’ అనే గానామృతాన్ని మన జాతికి అందించాడని గానీ నా మట్టిబుర్రకు తెలియదు. (నీకు అందెశ్రీ తెలీదా అనేవారు ఉండొచ్చు. నా చిన్న ప్రపంచంలో అందెశ్రీ తెలియకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు… అలాగే నాకు ఆయన తెలియకపోతే ఆయనకు ఒరిగే నష్టం ఏమీ లేదు…)
ఆయన తొందర చూసి మా కానిస్టేబుల్ ను తోడుగా ఇచ్చి పంపించాను… మా కానిస్టేబుల్ ఆయనను గుడి దగ్గరికి పోయే దారిలో దింపి వచ్చేశాడు. అయ్యో, మొత్తం దర్శనం అయ్యేదాకా ఉండక పోయావా అని మా కానిస్టేబుల్ తో అన్నాను. తనేమీ మాట్లాడలేదు.
మళ్లీ ఓ గంట తర్వాత ఆయన దర్శనం చేసుకుని తన భుజాల మీద శాలువాలతో ఆనందంతో వచ్చాడు. నా మనసులో ఈయనకు శాలువా కప్పేంత సీన్ ఉంటే VIP పాస్ ఎందుకు తీసుకోలేదో అనుకున్నా. చాలా చాలా ధన్యవాదాలు అద్భుతమైన దర్శనం అయింది… ఎవరూ పట్టించుకోని నన్ను మీరు ఇలా పిలిచి కూర్చోబెట్టి దర్శనానికి పంపడం ఆ అమ్మ దీవెన మీ ద్వారా పంపడమే అంటూ తన భుజాల మీద వేసుకున్న శాలువా నాకు కప్పి కృతజ్ఞతలు తెలిపాడు. మీలాంటోళ్లు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి అంటూ ఆశీర్వదించారు.
నాకు ఆయన మీద నిదానంగా గౌరవం పెరుగుతూ వచ్చింది.
మాటల్లో మన సబ్జెక్ట్ ‘అద్వైతం’ మొదలైంది. విచిత్రంగా ఆయన సబ్జెక్టూ అదే. ఐతే నా దేవుడు శక్తి, ఆయన దేవుడు అమ్మ! ఏదైతేనేం మా ఇద్దరిదీ అద్వైతం. అక్కడ మరో విచిత్రమైన విషయం తెలిసింది… ఆయన చదువుకోలేదని తెలిసి ఆశ్చర్యపోయా… ఆయనకున్న జ్ఞానానికి, చదుకోలేదన్న మాటకీ పొంతన లేదు.
ఆయన అనాథ అనీ, ఒక ఆధ్యాత్మిక గురువు చేతిలో పెరిగాడని తెలిసింది. ఆ గురువు గారి బోధనే అద్వైతమని, ఆ సరస్వతీ మాత కటాక్షం ఈ సాహిత్యమని చెప్పారు. మాటల్లో తానో నిర్లక్ష్యం చేయబడ్డ కవినని చెప్పుకున్నారు. మాటల నడుమ ఇద్దరమూ చాయ్ తాగేసాం. తాను వెళ్ళబోయే సమయంలో హైదరాబాద్ లో ఇంటికి రమ్మన్నాను, ఫోన్ నంబర్ తీసుకుని ఆయనను సాగనంపిన.
తర్వాత శివరాత్రికి మా ఇంటికి వచ్చారు. అపర్ణను చెల్లె! అని సంబోధించేవారు. పిల్లలు సిద్ధి, ఇశాన్ లు ఆయన పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. అపర్ణ చేసిన ఉసోడ (సాబుదానాతో చేసే ఒక మరాఠీ వంట, పోహా లాంటిది), ఫ్రూట్ సలాడ్ తిన్నారు. తన పాటలు పాడాడు. ముచ్చట్లు చెప్పుకుంటూ కొన్ని గంటల పాటు ఇంట్లో సంతోషంగా గడిపారు.
ఆయన ఎంతో హుషారు…
ఆయన గొంతు మరింత హుషారు.
ఆయన గొంతెత్తితే పరిసరాలు అదే శ్రుతిలో ప్రకంపించేవి…
ఆయన ఆశువుగా పాడే పాటలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి.
సాహిత్యం ఇంత లోతుగా ఉంటుందా అని అనిపిస్తుంది.
తర్వాత మా బంధం మరింత బలపడింది… నా “శోధన” కవితాసంపుటి ఆవిష్కరణకు ఆయనను ఆహ్వానిద్దామనుకున్నాము. కానీ, కుదరలేదు. ఆయనకు నేను రాసిన కవితలు పంపేవాడిని. మళ్లీ ఓసారి ఇంటికి వచ్చారు. తాను సంకలనం చేసిన “నిప్పుల వాగు” అనే ఉద్గ్రంథాన్ని నాకు అందించారు. నేను నా ‘శోధన’ ను ఆయనకు అందించాను. మీరు విచిత్రమైన మనిషి అన్నారు. పోలీసు కవితలు రాసుడేంది అని నవ్వేవారు.
ఆయన “జయ జయహే తెలంగాణ” మన రాష్ట్రగీతం కాబోతుందని శ్రీనన్న (వేముల శ్రీనివాస్, ఓఎస్డీ, CMO) తెలిపారు. సంతోషంతో ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసాను. నిర్లక్ష్యానికి గురైన నాకు ఈరోజు నిజమైన గౌరవం దక్కింది అని సంతోషపడ్డారు. నిజంగా అలా మన తెలంగాణ ప్రజల రుణం తీరింది. మ్యూజిక్ కాంపోజిషన్ సమయంలో శ్రీనన్న ద్వారా అందెశ్రీ గారి గురించి చాలా విషయాలు తెలుసుకునే వాడిని. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది అని సంతోషపడ్డాను.
ఆ మహానుభావుడు మాయమై పోయారు…
ఆ సంతోషాలు జ్ఞాపకాలై పోయాయి…
అందెశ్రీ సాహితీ రూపాలు మన హృదయాల్లో అందెల రవళులై మోగుతూ ఉంటాయి…
ఆ రవళుల నాదాలకు మన తనువులు ప్రతిస్పందిస్తూ ఉంటాయి…
ఆయన పోయినా ఆ నిప్పులవాగు మాత్రం సజీవమై అలా సాహితీ లోకంలో ప్రవహిస్తూనే ఉంటుంది.
ఆయనకు నివాళి…
ఆయన పాటకు ఘననివాళి…
ఆయన సాహితీ సేవకు మహానివాళి…
—– గిరిధర్ రావుల, ఐపీఎస్., 10-11-2025, (అందెశ్రీ గారు భౌతికంగా మాయమైన రోజు)
Share this Article