.
నిజానికి జుబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు… హైదరాబాద్‌లో గత ఎన్నికల్లో మంచి ఆధిపత్యం ప్రదర్శించింది… పైగా సానుభూతి వోటు కూడా పనిచేసి ఉండాలి… సాధన సంపత్తి విస్తృతంగా ప్రయోగించారు… మీడియా, సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు…
పైగా ఏ ఉపఎన్నిక జరిగినా కేసీయార్ ఛాంపియన్… గతంలో కాంగ్రెస్ పదే పదే కేసీయార్ చాణక్యం ఎదుట చేతులెత్తేసేది… కానీ మరిప్పుడు ఏం జరిగింది…? ఎందుకు బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది..? తప్పకుండా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఓ చర్చనీయాంశం… ఎందుకంటే..? ఈ ఎన్నికకు ఓ విశేష ప్రాధాన్యం ఉంది కాబట్టి..!
Ads
- రేవంత్ కాంగ్రెస్ వేరు, గతంలోని బేల కాంగ్రెస్ వేరు… ఓ కొత్త కాంగ్రెస్ కనిపించింది ఈసారి… ఈ గెలుపు కూడా అక్షరాలా రేవంత్ రెడ్డిదే… ఎలాగంటే..?
1) వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ అనే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపడం, తను పక్కా లోకల్… అందరికీ అందుబాటులో ఉంటాడు, విద్యావంతుడు… ఓడినా, గెలిచినా అక్కడే ఉంటాడు… కానీ బేసిక్‌గా మాగంటి సునీత రాజకీయ నాయకురాలు కాదు… బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు అగ్రవర్ణాలు… అసలే ఇప్పుడు తెలంగాణలో బీసీ మూవ్‌మెంట్ కనిపిస్తోంది… ఇక్కడ బీసీ వోట్లు కూడా ఎక్కువే…
2) సెటిలర్ల వోట్లు ఇక్కడ ప్రధానం… ఎన్టీయార్ విగ్రహం, కమ్మ సంఘాలతో మీటింగులు, హామీలతో ఆ వోటును చీల్చాడు… చంద్రబాబు సైలెంటుగా ఉండటం అంటే బీఆర్ఎస్ వైపు ఇక మనం ఉండాల్సిన పనిలేదు అని అన్యాపదేశంగా కమ్మలకు చెప్పడం… జనసేన మద్దతు అంటే కాపు వోట్లు వచ్చాయి…

3) మజ్లిస్ మద్దతు ప్రకటించినా సరే, అది తాము పోటీచేసే స్థానాల్లోనే కష్టపడుతుంది… అందుకని వాళ్లను నమ్మలేక వ్యూహాత్మకంగా అజరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నాడు… ఓ ఖబరిస్థాన్ ప్రకటించాడు… బీఆర్ఎస్ మైనారిటీ వోటు బ్యాంకు అడ్డంగా చీల్చాడు…
4) సీనియర్లు, జూనియర్లు… మంత్రులందరికీ కొన్ని ప్రాంతాల బాధ్యతలు… జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయడం… దాంతో అందరూ క్షేత్రంలో దిగాల్సి వచ్చింది… పోల్ మేనేజ్‌మెంట్ దాకా…

5) సానుభూతిని బ్రేక్ చేయడానికి… ఇదే బీఆర్ఎస్ ‘మరణించిన ఎమ్మెల్యేల కుటుంబసభ్యుల్ని ఏకగ్రీవం చేయడం’ అనే పాత సంప్రదాయాన్ని ఎలా బొందపెట్టిందో రేవంత్ ప్రసంగాల్లో చెప్పుకొచ్చాడు… ప్రత్యేకించి ఈ సీటులో గతంలో ప్రభావవంతుడైన నాయకుడు పీజేఆర్ కుటుంబానికి కేసీయార్ ఎలా ద్రోహం చేశాడో చెప్పాడు… స్ట్రాటజీ… ట్రిపుల్ అటాక్, 1) పీజేఆర్ పేరు వాడుకోవడం 2) మాగంటి సానుభూతికి గండి కొట్టడం 3) కేసీయార్ అవకాశవాదాన్ని ఎండగట్టడం…
6) ఇక్కడ సినీ కార్మికుల వోట్లు ఎక్కువ… అందుకే వాళ్లతో మీటింగు పెట్టాడు… 10 కోట్లు ఇస్తానన్నాడు… మీకు టికెట్ రేట్ల పెంపు అదనపు ఆదాయంలో 20 శాతం వాటా ఇస్తేనే ఇకపై టికెట్ రేట్లను పెంచుతాను అన్నాడు… వాళ్లకు కనెక్ట్ కావడం…

7) ఆఫ్టరాల్ ఉపఎన్నిక అని ఇంట్లో కూర్చోలేదు… తనే అన్నిగా వ్యూహాలు వేసి, స్వయంగా గల్లీల్లో ప్రచారాలు చేశాడు… దాదాపు ప్రతి మంత్రీ ప్రచారంలో పాల్గొన్నాడు… తప్పదు… నాకేమని ఇంట్లో ఎవరు పడుకున్నా కుదరకుండా ప్లానింగ్…
8) బీఆర్ఎస్‌కు వోటేస్తే, ఆ పార్టీ గెలిస్తే… అది గనుక మళ్లీ బలం పుంజుకుంటే… కాంగ్రెస్ ఇస్తున్న ఫ్రీ కరెంటు, సన్నబియ్యం, ఫ్రీ బస్సు వంటి సంక్షేమ పథకాలన్నీ కోల్పోవాల్సి వస్తుందని స్ట్రెయిటుగా జనానికి చెప్పడం మరో ఎత్తుగడ…

9) సునీత పట్ల మహిళల ఆదరణ కనిపించకుండా… సొంత ఇంటి ఆడబిడ్డనే కేసీయార్, కేటీయార్ బయటికి పంపించారు అని కవిత ప్రస్తావన తీసుకురావడం, సొంత బిడ్డే బీఆర్ఎస్ పెద్దల్ని దొంగలు అంటోంది గమనించారా అని గుర్తుచేయడం…
10) మాగంటి తల్లి తన కొడుకు మరణంలో సునీత, కేటీయార్‌లను విలన్లను చేసి పోలీస్ కేసు పెట్టడం… మాగంటి మొదటి భార్య తెరపైకి రావడం… అసలు సునీతది లీగల్ పెళ్లే కాదు అనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడం… కూడా కాంగ్రెస్‌కు ఉపయోగపడింది…

11) కాంగ్రెస్‌లో రేవంత్ పనయిపోయింది, ఇక సీనియర్లదే హవా అని సాగుతున్న ప్రచారాన్ని బద్దలు కొట్టాలంటే ఈ ఉపఎన్నికలో గెలుపు అవసరం తనకు… ప్రభుత్వంలో పట్టు, పార్టీ మీద పట్టు పెరుగుతుంది…
12) హైకమాండ్‌కూ ఓ గట్టి సందేశం కూడా ఇవ్వడం రేవంత్ రెడ్డికి అవసరం… రేవంత్ రెడ్డే తెలంగాణ కాంగ్రెస్‌కు అవసరం అని బలంగా చెప్పడం… అందుకే ఈ కష్టం, ఈ ప్లానింగ్… ఓ అగ్ని పరీక్షలో రేవంత్ రెడ్డి పాసయ్యాడు… ఈ టీ20 మ్యాచును బీఆర్ఎస్ చేతుల్లో నుంచి అక్షరాలా లాగేశాడు..!!
(ఈ కథనం రాసే సమయానికి పది రౌండ్లకు గాను 8 రౌండ్లలో కలిసి కాంగ్రెస్ 22 వేల లీడ్‌లో ఉంది... ఒక్క రౌండ్‌లో కూడా బీఆర్ఎస్ లీడ్ సాధించలేదు... మొత్తం అంకెలు తేలాక కాంగ్రెస్ 50 శాతం వోట్లు సాధించే సూచన కనిపిస్తోంది... అదీ విశేషమే... కేటీయార్ అన్నాడు కదా, ఇది రేవంత్ పాలనకు రెఫరెండమ్ అని... నిజమే...)
Share this Article