.
#సూపర్‌నోవా_ఆఫ్_ఏ_సూపర్‌స్టార్!
కృష్ణ ఓ స్టార్!
సూపర్‌స్టార్!!
సినీఫీల్డులో ఎంతో మంది ఆర్టిస్టులుంటారు. ప్లానెట్స్‌లా.
సినీవినీలాకాశంలో మెర్క్యురీ, వీనస్‌లలా వాళ్లూ కాస్త కాస్త మెరుస్తుంటారు.
కాకపోతే… స్వయంప్రకాశం కొద్దిమందికే.
సినిమానంతటినీ మోసి, హిట్ చేసేవారే స్టార్స్.
అలాంటి స్టార్లకు స్టార్…
సూపర్‌స్టార్ కృష్ణ!
******
‘సినీ’లాకాశపు స్టార్స్ కంటే ముందర..
అసల్సిసల్ సునీలాకాశపు నిజమైన ఓ స్టార్ గురించి కాస్త మాట్లాడుకుందాం.
బీటల్‌జ్యూస్ అనే సూపర్ ‘సూపర్ స్టార్’ ఒకటుంది.
Ads
అల్ల ఎక్కడో సుదూర ఓరియన్ నక్షత్రమండలంలో…
భూమి నుంచి చాలా దూరంలో.
ఎంత దూరమంటే… కాంతి సెకనుకు 3,00,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ వస్తూ… వస్తూ… వస్తూ ఉంటే… అక్కడ్నుంచి మనకు చేరడానికి తక్కువలో తక్కువ 600 ఏళ్లూ… ఎక్కువలో ఎక్కువ 650 ఏళ్లు పడుతుందిట.
******
మన సూర్యుడూ ఓ చక్కనిచుక్క. సూర్యుడెంతటి పెద్ద నక్షత్రమంటే మొత్తం సౌరమండలంలోని సరుకంతా ఒక్క సూర్యుడిలోనే ఉంది.
లెక్క చెప్పాలంటే… లెక్కల్లో చూపాలంటే 99.84 శాతమంతా ఒక్క సూర్యుడిలోనే ఉంటే… మిగతా గ్రహాలూ, ఉపగ్రహాలూ, తోకచుక్కలూ, చంద్రవంకలూ, ఉల్కమెరుపులూ, మెరుపులుల్కలూ కలిపినా జస్ట్… 0.16 శాతమే.
ఇంకా సూర్యుడెంత పెద్దంటే… ఆ ఒక్క భానుడిలో పదమూడు లక్షల భూములు ఫిట్టవుతాయి. ఆ ఒక్క ఆదిత్యుడిలో భూమికి 1300 రెట్లుండే గురుగ్రహాలు వెయ్యికిపైగా ఫిక్సవుతాయి.
మళ్లీ బీటల్‌జ్యూస్ దగ్గరికి వద్దాం. అబ్బ… రంగురంగుల వెలుగుల్తో ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో తెల్సా…? డ్యూయెట్‌లో ఎప్పటికప్పుడు మారిపోయే కృష్ణ కాస్ట్యుములంత. దాని ఓరియన్ నక్షత్రమండలపు వేటగాడి డాలు ఒంపు ఎలా ఉంటుందో తెలుసా? ఒంపుసొంపుల హీరోయిన్ ఎదపై హీరో కృష్ణ వాలిపోయినప్పటి ఒంపంత.
కాస్త ఎలాగోలా ప్రయత్నించి బీటల్‌జ్యూస్‌ను సూర్యుడన్న చోట నిలబెడదాం. అప్పుడు దాని ఆవలి అంచు ఎక్కడివరకొస్తుందో తెలుసా? మెర్క్యురీ, వీనస్, భూమి, అంగారక గ్రహాలన్నీ దాటేసి….ఆవల గురుగ్రహం అవతలి కక్ష్య వరకూ బీటల్‌జ్యూస్ బయటి అంచు అవతలికి దాటిపోతుంది.
అంత పెద్దది బీటల్‌జ్యూస్. కృష్ణ మంచిదనమంత విస్తారమైనదది.
ఇప్పుడది కూడా మరణశయ్యపై ఉంది.
సూపర్‌స్టార్ కృష్ణలాగే.
కాదు… కాదు… బీటల్‌జ్యూస్‌లాగే హీరో కృష్ణ మరణశయ్యపై ఉన్నారు.
మృత్యుశయ్యపైన కూడా హుందాగా, ఠీవిగా, గంభీరంగా!
స్టార్‌లాగే కాంతులీనుతూ… ఇప్పటికీ… బహుశా ఎప్పటికీ!!
******
సామాన్యజనాలూ అసామాన్యంగా కథల్కథల్గా చెప్పుకునేలా
సూపర్‌స్టార్ కృష్ణ గాధాకీర్తికాంతులెలా ఉంటాయో తెలుసా?
ఎప్పుడో పాతికేళ్లనాటి ఓనాడు ఓ లైఫ్ ఇన్యూరెన్స్ ఏజెంట్ నా దగ్గరికొచ్చాడు.
తన వృత్తి అనుభవాలు చెబుతున్నాడు.
కృష్ణగారింట్లోనూ ఒకరికి తానే ఇన్సూరెన్స్ చేయించాట్ట.
రాతకోతల ఫార్మాలిటీస్ పూర్తయ్యాక కృష్ణగారు అడిగార్ట…
‘ఈ ఇన్సూరెన్స్‌తో మీకెంత కమిషన్ వస్తుందం’టూ.
‘అమౌంట్ చాలా పెద్దది సార్. దగ్గర్దగ్గర ఏడు లక్షలు’
‘మరి… అంత పెద్ద అమౌంట్‌ను ఏం చేస్తారు?’ కృష్ణగారి ప్రశ్న.
‘దీనికి మరికాస్త కలిపి ఇల్లు కొనుక్కుంటా సార్’
‘గుడ్… ఆ పని చేయండి…’ అంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చార్ట సూపర్‌స్టార్.
ఇలాంటిదే మరో సంఘటన…
మరో మీడియమ్ రేంజ్ స్టార్‌కూ తానే పాలసీ ఇచ్చాట్ట. అదీ పెద్ద మొత్తమే. అతడి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే వాళ్ల బంధువు నుంచీ అలాంటిదే ఓ ప్రశ్న.
‘ఈ ట్రాన్సాక్షన్‌తో మీకెంత వస్తుందం’టూ.
అమౌంట్ చెప్పాడా ఏజెంట్.
‘‘అంత పెద్ద మొత్తమా? మా వల్లనే మీకంత వస్తోంది. కాబట్టి ఆ అమౌంట్ మాకే’’
మారు మాట్లాడక ఇచ్చేయాల్సొచ్చింది.
అదీ మిడిల్రేంజ్ స్టార్‌గారి బంధువు కక్కుర్తి.
అదీ ఆ ఎల్లైసీ ఏజెంట్ ఆక్రోశం. మరోపక్క…
మరి అదీ మన ‘ఏజెంట్‌గోపీ’ గొప్పదనం.
సూపర్‌స్టార్‌లు ఆవిర్భవిస్తారు.
సూపర్‌స్టార్లలాగే ప్రభవిస్తారు.
ఆకాశంలోనైనా… సినీవినీలాకాశంలోనైనా.
కానీ… కొంతమంది మాత్రమే అస్తమించాకా కాంతులీనుతూనే ఉంటారు… జెయింట్స్‌లా…!
రెడ్ జెయింట్స్‌లా!!
******
ఒకనాటి నా చిన్ననాటి ముచ్చట.
కృష్ణా…? ఓ యాక్షన్ రాదూ… డాన్సూ రాదు. పాడూ రాదు.
డాన్స్ చేస్తే గుర్రమ్మీద సైకిల్ తొక్కుతున్నట్టుంటుంది.
ఫైట్ చేస్తే పుర్ర చెత్తో గిర్రను గిరగిరా తిప్పినట్టుంటుంది.
ఇగ పొగవదిలే పిస్టల్లోకి ఊదడం… పిల్లాడు పీక ఊదినట్టే.
అక్కడాయన రివాల్వర్ తిప్పుడూ… మాకిక్కడ బుర్రతిరుగుడు.
ఇలాంటి డైలాగుల్తో కృష్ణ అభిమానులతో ఫైట్ జరుగుతుండేది…
క్లాస్‌రూముల్లో… కాలేజీల్లో… క్యాంటీన్లలో.
******
మరోసారి నా ముచ్చటే.
కాకపోతే… కాస్త పెద్దయి టీనేజ్ దాటిన కొత్తరోజులనాటి ముచ్చట.
‘‘హల్లో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా…! మైకెల్ జాక్సన్‌కే మతిపోయే భంగిమ!!’’ ఎవరన్నారు సూపర్‌స్టార్‌కి డాన్స్ రాదని? నిజంగా మైకెల్జాక్సన్‌కు మతిపోయితీరాలి.
నంబర్ వన్ రిలీజైంది. ఎవర్రా అన్నదీ కృష్ణకు యాక్షన్ రాదనీ.
ఆయన్నిజంగా నిజం నంబర్ వన్.
నిక్కం… సొక్కం… నంబర్ వన్.
ఆ తర్వాత నేనూ కృష్ణాభిమానినే. కాకపోతే…
ఆ వ్యక్తిత్వానికి.
ఆ ధీరతకు.
ఆ హీరోదాత్తతకు.
ఆ పరోపకారతకు.
ఆ ఫైటింగ్ స్పిరిట్‌కు.
ఆయనో సూపర్‌స్టార్. ఓ సూపర్ స్టార్ మరణం ‘సూపర్’నోవాలా జరుగుతుందట. తన మరణ సమయమైన సూపర్‌నోవాలో… నక్షత్రం కొన్ని కోటాను కోట్ల రెట్ల కాంతులతో తటాల్న, చటాల్న, ఫటేల్మంటూ… ఒక్కసారిగా జిగ్గుమంటూ…
కొన్ని కాలాల పాటి కాంతినలా ఒక్కసారిగా జగజ్జేగీయమానంగా వెలువరుస్తూ వెలిగిపోతుందట. విలాసంగా కాంతులీనుతూ, విస్మయం, విభ్రమం కలిగిస్తూ విస్ఫోటం చెందుతుందట. అటు తర్వాత ఎన్నెన్నో యుగాలపాటు మెల్లమెల్లగానైనా కాంతిపుంజాలు ప్రసరింపజేస్తూ… క్రమక్రమంగా నిష్కమిస్తుందట. ఆ తర్వాత కూడా మరెన్నో యుగాల పాటు వెలుగులీనుతూనే ఉంటుందట…
తొలుత రెడ్‌జెయింట్‌గా!
తర్వాత వైట్ డ్వార్ఫ్ వెలుగులతో!!
మన వెండితెర సూపర్‌స్టారూ అంతే.
తన కీర్తికిరణాల ‘ఆరా’ను చరాచరసృష్టిలో
కొన్ని యుగాలపాటు ధగద్ధగాయమానంగా
వెలిగిపోయేవారే ‘స్టార్స్’…
మన సూపర్‌స్టార్స్!
తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కృష్ణ మేటి మేళ్లు ఏటికేళ్లూ ప్రకాశిస్తూనే ఉంటాయి.
ఆయన కీర్తి కథలలా ప్రస్తరిస్తూ… విస్తరిస్తూనే ఉంటాయి…
కొన్ని కాంతివత్సరాల సుదూర దూరదూరాలకు…
అంతుతెలియని గహనాంతర సీమల తీరాల వరకు.
#యాసీన్
15–11–2022
Share this Article