.
ఓ వార్త బాధనిపించింది… మామూలుగా సవతి తల్లులు పిల్లలను పెట్టే హింస సాధారణంగా చాలాచోట్ల చూస్తుంటాం… భర్త మొదటి పెళ్లాం పిల్లలంటేనే చంపాలన్నంత కసిని చూపిస్తుంటారు కొందరు మహా తల్లులు…
మొగుళ్లు మెతకగా ఉండే కుటుంబాల్లో మరీ ఈ పిల్లల పరిస్థితి దారుణం… ఇప్పుడు చెప్పుకోబోయే వార్త భిన్నం… ఇక్కడ సవతి తల్లి కిరాతకం కాదు… సవతి తండ్రి కిరాతకం… నిజమే… వార్తలోకి వెళ్దాం…
Ads
ఇది మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణం… ఓ పిల్లాడిని సవతి తండ్రి కనికరం లేకుండా గొడ్డును బాదినట్టు బాదాడు… రామాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామానికి చెందిన ముత్యం శ్వేత, సత్యనారాయణ దంపతులు…
శ్వేత మొదటి భర్త నుంచి విడిపోయి, మేనబావ సత్యనారాయణను పెళ్లి చేసుకుంది… శ్వేతకు మొదటి భర్తతో పుట్టిన కొడుకు ఉన్నాడు… సత్యనారాయణను పెళ్లి చేసుకున్నాక ఓ కూతురు పుట్టింది… ఆమెకు మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకంటే సత్యనారాయణకు కోపం…
మేస్త్రీ పనిచేసే సత్యనారాయణ గురువారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు… భార్య. సవతి కొడుకు వంశీ (4), కూతురు ఇంట్లో పడుకొని ఉన్నారు… రాత్రి 2 గంటల టైంలో నిద్రపోతున్న వంశీని లేపాడు… గమనించిన తల్లి శ్వేత రోజులాగే టాయిలెట్’కు తీసుకెళ్తున్నాడేమో అనుకుంది…
కానీ వంశీని సత్యనారాయణ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు… షర్ట్ విప్పేశాడు… ఫోన్ చార్జింగ్ పెట్టే కేబుల్ వైర్ మెడకు చుట్టి, లాక్కుపోయి… కట్టెలు, బైండింగ్ వైర్ తో విచక్షణారహితంగా కొట్టాడు… బాలుడు ఏడుస్తున్నా వినిపించుకోకుండా రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారు జాము నాలుగు గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు బాలుడిని చిత్రహింసలు పెట్టాడు…
రోడ్డుపైకి విసిరికొట్టాడు… మనిషిలోని పిశాచి కోపం చల్లారలేదు… ఇంటి పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి విసిరేశాడు… దీంతో వంశీ ఒళ్లంతా గాయాలతో పచ్చిపుండులా మారిపోయాడు… వారించబోయిన చుట్టుపక్కల వారిని సైతం సత్యనారాయణ బెదిరించాడు…
వంశీ ఏడుపు విని తల్లి శ్వేత నిద్రలేచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే, సత్యనారాయణ ఇంటి తలుపులు మూసి, తాళం వేశాడు… దీంతో ఆమె ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోయింది… తర్వాత తలుపులు తెరిచాక ఆ తల్లి కొడుకును ఒడిలోకి తీసుకుని ఏడుస్తూ అక్కకు ఫోన్ చేసింది…
శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వంశీని మెదక్ పట్టణంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లింది… చికిత్స అందిస్తున్నారు… కానీ తన భర్త సత్యనారాయణతో తనకు, తన పిల్లలకు ప్రాణభయం ఉందని శ్వేత మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది… మెదక్ టౌన్ పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి కేసును రామాయంపేట్ పీఎస్ కు బదిలీ చేశారు…
ఇదీ వార్త… సవతి తండ్రి కిరాతకం… ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా, మొదటి భర్తతో ఆమెకు కొడుకు ఉన్నట్టు… ఆ పిల్లాడిని తనే చూసుకోవాలని..!! హఠాత్తుగా మనిషిలోని ఏదో పిశాచం నిద్రలేచి ఇలా ఆ పిల్లాడి ఉసురు పోసుకోవడం దేనికి..? ఇది చదువుతుంటే పాత వార్తలు కొన్ని గుర్తొచ్చాయి…
(అప్పట్లో ప్రత్యూష అనే పిల్లను మహా కిరాతకంగా సవతి తల్లి హింసిస్తే… ఆమె ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయటపడితే అప్పటి ముఖ్యమంత్రి కేసీయార్ ఆమెను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి, ఇంట్లో భోజనం పెట్టి, బాగోగులు చూసి… చదువు చెప్పించి… తరువాత ఆమె పెళ్లికి పట్టుబట్టలు, ఓ నెక్లెస్ పెట్టిన కథ గుర్తొచ్చింది… కోర్టు కూడా ఆ అమ్మాయి రెస్క్యూకు వచ్చింది… మరి ఇక్కడ ఎవరు ఆదుకోవాలి ఈ పిల్లాడిని…)
Share this Article