.
జుబ్లీహిల్స్ గెలుపు ద్వారా రేవంత్ రెడ్డి సాధించిన ప్రయోజనం మరొకటి ఉంది… హైకమాండ్‌తో తనకు బాగా గ్యాప్ వచ్చిందనే ప్రచారం నేపథ్యంలో… విజయం సాధించిన నవీన్ యాదవ్‌తో సహా వెళ్లి రాహుల్ గాాంధీని కలిసి, అదే రాహుల్ నుంచి అభినందనలు స్వీకరించాడు… తన వెంట డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కూడా ఉన్నారు…
రేవంత్ పాలనపై ఖర్గే గుర్రుగా ఉన్నాడు, తిట్టిపోస్తున్నాడు.., అసలు అపాయింట్‌మెంట్ కుదరదుపో అని వేణుగోపాల్ కసురుకున్నాడు.., ఇక రేపోమాపో రేవంత్ రెడ్డి మార్పు తథ్యం అన్నట్టుగా ప్రచారాలు చేశారు… అన్నింటికీ సమాధానం ఈ దిగువ ఫోటో…
Ads

మిగతా కథనంలోకి వెళ్లే ముందు ఒక్కమాట… బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వంటి నేతల్ని ఇగ్నోర్ చేసే సిట్యుయేషన్ ఉంటుందా..?
- ఏబీఎన్ రాధాకృష్ణ ఏమంటాడంటే….? ‘‘రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో లోతులు తెలియవు, రాజకీయం చేయడం రాదు, బీఆర్ఎస్‌కూ మాకూ 10 శాతం వోట్ల తేడా ఉంది, జుబ్లీహిల్స్ ఎన్నికలో గెలుస్తామనే భ్రమ రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది’’ అని కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేశారట… అలాంటిది ఏకంగా 51 శాతం వోటింగుతో అలా సొంతింట్లోనే వ్యతిరేక కూతల నేతల మూతులకు తాళం వేశాడు రేవంత్ రెడ్డి…
సరే, రేవంత్ రెడ్డి గెలుపు మీద… ప్రస్తుతం పార్టీ మీద, ప్రభుత్వం మీద వచ్చిన మరింత గ్రిప్ మీద అందరితోపాటు రాధాకృష్ణ కూడా విశ్లేషణ రాసుకొచ్చాడు… కానీ అటు తిప్పి ఇటు తిప్పి ఎప్పటిలాగే… ఈ ‘జుబ్లీ గెలుపు’ను కూడా తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టాడు… ఎలాగంటే..?
‘‘జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ హేళనగా మాట్లాడడాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుచేయించారు… బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే జగన్‌రెడ్డికి బలం చేకూర్చినట్టేనని ఆంధ్రా మూలాలు ఉన్న ఓటర్లలో విస్తృతంగా ప్రచారం చేయించారు…
కేసీఆర్ అండ్ కో జగన్‌రెడ్డితో అంటకాగడం వల్ల ఆంధ్రా మూలాలున్న ఓటర్లు అందరూ బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు… అయినా జగన్ రెడ్డే మాకు ముఖ్యం అని కేసీఆర్ అండ్ కో అనుకుంటున్నారు… ఇది గమనించిన రేవంత్‌రెడ్డి ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే జగన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో బలపడతారని తెలుగుదేశం ఓటర్లకు నచ్చజెప్పి తన వైపునకు తిప్పుకొన్నారు…
ఆంధ్రప్రదేశ్‌లో తాము అభిమానించే జగన్‌రెడ్డికి పట్టిన గతి చూసి కూడా కేసీఆర్ కుటుంబం తమ వైఖరి మార్చుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది…’’
…….. అంటే, కేసీయార్- జగన్ దోస్తీ కారణంగా… జగన్ మీద కోపంగా ఉన్న సెటిలర్లు అందరూ బీఆర్ఎస్‌ను వదిలేసి, కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు అని రాధాకృష్ణ కవిహృదయం..! చివరకు జుబ్లీహిల్స్‌లో ఓడిపోయింది జగన్ రెడ్డి, గెలిచింది చంద్రబాబు అని తేల్చిపారేశాడు… ఈ తీరు చూడబోతే రేప్పొద్దున మరేదో దేశంలో ఇంకేదో పార్టీ ఓడిపోతే కూడా… చూశారా, జగన్ రెడ్డి ఓడిపోయాడు అని రాసేస్తారేమో..!
ఏమాటకామాట… కేటీయార్ ఇంకా సోషల్ మీడియా భ్రమల్లోనే ఉన్నాడని రాధాకృష్ణ కూడా అంటున్నాడు… కవిత వెటకరించిన ‘కర్మ హిట్స్ బ్యాక్’ అనే ట్వీట్ మొత్తం తెలుగు జనంలో వైరల్ అయ్యింది… ఆమె ఉద్దేశం ఏమిటనేది పక్కన పెడితే… నిన్న కవిత ఎక్కడో చెబుతోంది… కేటీయార్ ఇకనైనా నేల మీదకు దిగిరావాలీ అని… సేమ్, రాధాకృష్ణ కూడా…
’’మరుగుజ్జు లాంటి నాయకులను చుట్టూ పెట్టుకుని కాబోయే ముఖ్యమంత్రిని తానేనని కేటీయార్ భ్రమల్లో బతుకుతున్నారు. చుట్టూ ఉన్నవాళ్లు హై హై నాయకా అంటూ చిడతలు కొడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వెనకేసుకున్న సొమ్ముతో యూట్యూబ్ చానళ్లు పెట్టించి, వాటిల్లో అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ అదే నిజమని కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారు.
ప్రజలకు అన్నీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి కూడా సోషల్ మీడియా వారియర్స్‌ను నమ్ముకొని పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు. కేటీఆర్ ఇదే వైఖరితో ఉంటే భవిష్యత్తులో కూడా ఫలితాలు ఇంతకు భిన్నంగా ఉంటాయని భావించలేం…’’ అని రాసుకొచ్చాడు తన ఎడిటోరియల్ వ్యాసంలో..!!
Share this Article