.
ప్రకృతికి ప్రాణం పోసిన ‘చెట్ల వరుస’ తిమ్మక్క
“చెట్టునురా -చెలిమినిరా
తరువునురా – తల్లినిరా
నరికివేయబోకురా
కరువు కోరుకోకురా
అమ్మనురా అమ్మకురా
కొడుకువురా కొట్టకురా…”
Ads
సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు. ఆయన రాసిన ప్రబోధ గీతమిది. చెట్టు పాడే ఈ పాట సినిమా పాట కాదు . సినిమాల్లో వాడలేదు .అయినా, సినిమా ఇంత వాస్తవికతను, సందేశాన్ని సహించదు. సహించాలని కోరుకోకూడదు. దాని మర్యాదలు దానివి.
“కొట్టు కొట్టు చెట్టే కొట్టు…
చెట్టు చెట్టు పట్టే కొట్టు…” లాంటి వీర ప్రాసల పాకులాటలకే సినిమా ఊగిపోతుంది. దాని బలం, బలహీనత అది. ఆ చర్చ మనకనవసరం. ఇది సుద్దాల ప్రైవేట్ సాంగ్. అక్కడక్కడా ప్రకృతి ప్రేమికులయిన భాషా ప్రేమికుల నోళ్ళలో మాత్రమే నానుతున్న పాట. ఇంకా బాగా ప్రచారం కావాల్సిన పాట. సరళమయినభాషలో అందరికీ అర్థమయ్యేలా రాశారు కాబట్టి నిజానికి విశ్లేషణ అనవసరం.
చెట్టును, చెలిమిని, తల్లిని. మీరు నా పిల్లలు. నన్ను కొట్టకండి. కొట్టి…కట్టెలుగా అమ్మకండి. నేలతల్లి గుండెలో నుండి విత్తనం గొంతుకతో ప్రకృతి సుప్రభాతగీతం పాడుతూ పసిపెదవులతో నేను మోసులెత్తుతాను. కొమ్మలు రెమ్మలు ఊపుతూ నేను పాడే పచ్చనాకు సంగీతం మీకు నచ్చలేదా? రాళ్లతో నన్ను కొట్టినా నా పిల్లలే కదా అనుకుని పళ్ళను ఇస్తున్నాను.
పనికి రాని గాలి పీల్చి మీకేమో ప్రాణవాయువునిస్తున్నాను. కాలుష్యాన్ని తగ్గిస్తూ మా పుట్టుకను మీకోసమే త్యాగం చేశాను. ఎండవేడిని తిని, పత్రహరితాన్ని తయారు చేసుకుని, వేరునీరు తాగి మీకు ఫలాలను ఇస్తున్నాను. నేనేమో మీ కడుపు నింపితే, మీరేమో నా కడుపు కోస్తారు . చనిపోయిన వారి చితికి, బతికి ఉన్న మమ్మల్ను చంపే నాగరికత మీది. మీచావు మా చావుకొచ్చినా భరించే త్యాగం మాది. ఒకవేళ మా శరీరాలను తుంచాలనుకుంటే కనీసం వేళ్లనయినా అలా వదిలేయండి. మళ్ళీ మీకోసమే చిగురిస్తాం. ఒక చెట్టును కొట్టాలంటే ముందు పది చెట్లను పెంచండి.
రుద్రంలో “వృక్షేభ్యో – హరికేశేభ్యో” అని స్పష్టంగా ఒక మాట ఉంది. చెట్టు, చెట్టు కొమ్మల్లో ఆకుల పత్రహరితం – అంతా శివమయం. ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి స్థానం. ఒకే చెట్టులో శివ కేశవులు ఇద్దరూ కొలువయినవి ఉన్నాయి.
చెట్టు లేక పొతే తిండి లేదు, గాలి లేనే లేదు .
మనకేమో చెట్టూ పుట్ట లేకుండా ఫ్రెష్ కూరలు, పళ్లు, ఆకులు, ఫ్రెష్ గాలి కావాలి.
ఎలా వస్తాయో? ఎక్కడినుండి వస్తాయో?
నరికేసిన చెట్టుపాడే ఈ పాటను అడగండి – సమాధానం ఇస్తుందేమో ?
“చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక్క వసంతమయినా మిగిలేది- మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాను”
అన్నాడు గుంటూరు శేషేంద్ర.
చెట్టంత ఎదిగిన మన నాగరికతలో చెట్టు చుట్టూ అల్లుకున్న యుగయుగాల కథలు కొమ్మలు రెమ్మలుగా చేతులు చాచాయి. పూలు పూచాయి. కాయలు కాచాయి. పండ్లయ్యాయి. చెట్టు లేకపోతే మన బతుకు లేదు. తిండి లేదు. గాలి లేదు.
మన నవనాగరికతలో చెట్లను కూకటివేళ్ళతో పెకలిస్తేగానీ అభివృద్ధికి దారులు పడవు. మన ఆరు, ఎనిమిది వరుసల వేగపు దారికి వందల ఏళ్ళనాటి చెట్లు అడ్డు వస్తుంటాయి. నిర్దయగా నరికి పారేసి వేగంగా వెళుతూ ఉంటాం. గాలి దొరక్కపోతే ఆక్సిజన్ చేంబర్లలో కూర్చుంటాం. ఇంకా ప్రాణవాయువుకు కరువొస్తే ఐ సి యూ లో ఆక్సిజన్ సిలిండర్ ఎక్కించుకుంటాం.
కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి…ఎలాంటి చదువుసంధ్యలు లేకుండా వేలిముద్రలు వేసే తిమ్మక్క(1911-2025) ప్రపంచంలో పర్యావరణ ప్రేమికులందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కర్ణాటక హులికల్- కుడుర్ మధ్య నాలుగున్నర కిలోమీటర్ల రహదారికిరువైపులా 384 మర్రి మొక్కలు నాటి… అవి మహా వృక్షాలయ్యేదాకా పిల్లల్లా పెంచి పోషించడంతో ఆమె జాతీయస్థాయిలో వార్తలకెక్కారు.
ఇక అక్కడినుండి చెట్లే ఆమె జీవితం. మొక్కలు నాటడం, మానులుగా ఎదిగేదాకా జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక్కటే ఆమె జీవితంగా మారిపోయింది. ఆమె వరుసగా నాటిన మొక్కలు, పెంచిన మొక్కలు మహా వృక్షాలయ్యాయి. కన్నడలో “సాలుమరద” అంటే “చెట్ల వరుస”. అది లోకం ఆమెకిచ్చిన బిరుదు. అదే ఇంటిపేరై సాలుమరద తిమ్మక్కగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆమె నాటిన మొక్కలకు నీళ్ళు పోస్తూ భర్త చిక్కణ్ణ కూడా సహకరించేవారు.
114 ఏళ్ళు బతికిన తిమ్మక్క నడిచిన దారంతా చెట్ల వరుసను పచ్చటి ప్రకృతి గోడగా కట్టారు. అది ఒక చెట్ల వరుస క్రమం. క్రమం తప్పకుండా జగతికి నాటిన పచ్చదనం. వరుసతప్పకుండా దారంతా ఊదిన ప్రాణవాయువు. మొలకెత్తిన చిరు సంకల్పం మానులుగా ఎదిగిన చెట్ల వరుస. ఆశయం గట్టిదైతే అడవులనే సృష్టించవచ్చని నిరూపించిన చెట్ల వరుస. ఎండిన ప్రతి నేలలో ఆశల మోసులను మోసుకురావచ్చని పాడిన పత్రహరిత గీతం. వృక్షవేదం.
సాలుమరద తిమ్మక్క పద్మశ్రీ అవార్డు అందుకున్న మరుక్షణం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తలమీద చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆయనకూడా శిరసు వంచి ఆమె ఆశీర్వచనాన్ని తన్మయత్వంతో, బాధ్యతతో అందుకున్నారు. రాష్ట్రపతి దగ్గర ప్రోటోకాల్ ప్రకారం ఇలా జరగకూడదు. కానీ…లోకానికి ఆమే చెట్ల వరుస అయినప్పుడు…ప్రోటోకాల్ వేళ్ళు ఆమె కాలికి అడ్డురావు. రాలేవు. ఆమె తనకు తానే ఒక వెతకబోయిన తీగ. మనం వెతికి పట్టుకోవాల్సిన మెరుపు తీగ. మన నరనరాల్లో స్ఫూర్తిగా నింపుకోవాల్సిన చెట్ల వరుస.
వాల్మీకి అన్నట్లు- వేళ్ళున్నందుకు రాముడు వెళ్ళినవైపు వెళ్ళలేక…అటువైపు కొమ్మల చేతులు చాచి వీడ్కోలు చెప్పిన అయోధ్యానగరం చెట్లలానే ఆమె నాటిన “చెట్ల వరుస” ఆమె వెళ్ళినవైపు కొమ్మల చేతులు చాచి వీడ్కోలు చెబుతోంది. ఆ చెట్ల వరుస వెనుక మనం కూడా వరుసగా నిలుచుని గౌరవవందనం చేయాలి- నివాళిగా.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article