.
రాజమౌళి దేవుడిని పెద్దగా నమ్మడట… తనే చెప్పాడు… కానీ దేవుడు కావాలి, పురాణాలు కావాలి…, ఆ పురాణాల్ని మిక్సీ చేసి, పిండి… తనదైన శైలిలో ఆర్ఆర్ఆర్, బాహుబలి తరహా సినిమా తీయాలి… దెబ్బకు కనీసం 2- 3 వేల కోట్లు రాలాలి, అంతే….. దేవుడు కావాలి… డబ్బు కోసం, వ్యాపారం కోసం…
ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఇలా అంటున్నాడు… హనుమంతుడే రాజమౌళి వెనుక ఉండి ఈ సినిమా తీయిస్తున్నాడు… భక్తజనం పోటెత్తాలి కదా, అలాగే అనాలి మరి… కానీ రాజమౌళి ఏమంటాడంటే..? టెక్నికల్ గ్లిచ్ వల్ల గ్లింప్స్ ఆలస్యమైంది…హనుమాన్ నా వెనుక ఉంటే ఇదెలా జరిగిందని నాకు మస్తు కోపం వచ్చింది…
Ads
అవును, మరి హనుమంతుడైనా… సాక్షాత్తూ ఆ సాంబశివుడైనా కలగజేసుకుని… ఆ టెక్నికల్ గ్లిచ్ సరిచేసి, సమయానికి గ్లింప్స్‌ను జనం మీదకు వదలాల్సి ఉండింది… చేయలేదు కదా, పాపం దేవుడు చెడ్డవాడు… దేవుడు లేడు.,. దేవుడనే వాడే ఉంటే రాజమౌళికి సాయంగా ఉండేవాళ్లు కదా… తను నాస్తిక చక్రవర్తయినా సరే… అప్పుడే తమ ఉనికిని చాటుకునేవాళ్లు దేవుళ్లు పాపం…
మొన్న కీరవాణిని తెలంగాణ జనం బూతులు తిట్టడమొక్కటే తక్కువ… అందెశ్రీ మరణిస్తే కనీసం వెళ్లి నివాళి లేదు, ఓ ప్రకటన లేదు, ఓ ట్వీట్ లేదు… కీరవాణి పట్ల అందెశ్రీ అపాత్రస్నేహం కనబరిచాడు… ఆ తప్పుకు పరిహారమో, పశ్చాత్తాపమో గానీ… వారణాసి సినిమా గ్లింప్స్ విడుదల బాపతు అత్యంత కట్టుదిట్టమైన ప్రి-విజయోత్సవంలో అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వినిపించారు… ఐనాసరే, అందెశ్రీ మరణం పట్టని ఎన్ని సినిమా మొహాలకు ఈ గీతాలాపన రుచించలేదో ఏమో..!!
తన సినిమా మార్కెటింగుకు, వాళ్ల సినిమా దందా ప్రమోషన్‌కు తెలంగాణ పోలీసులు వందలాదిగా ఫిలిమ్ సిటీ వద్ద మొహరించారు… చివరకు పోలీసుల పని ఇలాగైంది..!!
ఐనా… ఎస్ ఎస్ రాజమౌళి తెలివైనవాడు… ఎస్, నిజంగానే… అయితే మిగతావారు తెలివిలేనివాళ్ళు అవుతారా..? ఆయన కుటుంబంలో రెండు తరాలు దాటి మూడో తరం కూడా సినిమానే అందిపుచ్చుకుని భారతీయ సినీయవనికను శాసించడం వరకు బాగానే ఉంది…
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి మార్కెట్ కల్పించినందుకు రాజమౌళి అభినందనీయుడే… కొందరితో పోలిస్తే… ఇతరేతర దురలవాట్లు, అవలక్షణాలు లేకుండా రాత్రీపగలు సినిమాలోనే మునిగితేలడం కూడా వోకే… కుటుంబమంతా పిల్లాజెల్లాతోపాటు ఫ్యామిలీ ఈవెంట్ గా బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ మీద హిట్స్ అందించడం కూడా చిన్న విషయం కాదు… అంతమాత్రంచేత రాజమౌళి ఏది మాట్లాడినా, ఏమి చేసినా భళిభళీ అని భజన చేయడం మాత్రం బాగాలేదు… అక్కరలేదు…
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమా ఈవెంట్ లో రాజమౌళిని ఆకాశానికెత్తడానికి ఈవెంట్ ను చక్కగా డిజైన్ చేశారు… మహేష్ బాబు భజనకన్నా రాజమౌళి భజనే ఎక్కువ… సాక్షాత్తూ రాజమౌళి నమ్మని దేవుళ్లు వచ్చినా సరే, అక్కడ రాజమౌళి భజనే వినిపించేది…

ముందు విడుదల చేసిన వార్తల ప్రకారం… ఆ ఈవెంట్ డిజైన్ చేసింది కూడా రాజమౌళే అయి ఉండాలి… ఒక రాజమౌళి అనేక రాజమౌళులుగా విడిపోయి జరిగిన ఈవెంట్ లో యాంకర్ సుమ పరవశంగా చెప్పినా… నిర్మాత కె ఎల్ నారాయణ భావోద్వేగంతో కన్నీళ్ళు ఆపుకోలేక చెప్పినా అంతా రాజమౌళి స్క్రిప్ట్ ప్రకారమే జరిగి ఉంటుంది…
బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న రహస్యం దగ్గరి నుండి రాజమౌళి టీమ్ ఇదే పబ్లిసిటీ సూత్రాన్ని పట్టుకున్నట్లుంది… కథను, పాత్రలను ఒక రహస్యంగా ప్రచారం చేయడం, ఆ రహస్యమేమిటో తెలుసుకోవడానికి ప్రపంచం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూసేలా చేయడం… ఇదంతా ప్రచారవ్యూహం… ఎత్తుగడ…. మిగతావారి వ్యూహం బండగా ఉంటుంది. రాజమౌళి వ్యూహం పాలిష్డ్ గా ఉంటుంది…
వందల కోట్లకు వేల కోట్లు రాబడుతున్నాడు కాబట్టి ఇప్పట్లో రాజమౌళిని ఎవరూ అందుకోలేరు… అలాంటి ప్రాజెక్టులో భాగమైనందుకు అందరి కళ్ళల్లో ఆనందబాష్పాలు జలజలా రాలడాన్ని కూడా చెమ్మగిల్లిన కళ్ళతో అర్థం చేసుకోవచ్చు…
ఈ ఈవెంట్ ద్వారా రాజమౌళి ఏమి చెప్పదలుచుకున్నారో కానీ… ఆయన మాటలు మాత్రం ఆయన స్థాయిని ఆయనే దించుకున్నట్లున్నాయి. ఒకపక్క ఆయన తండ్రి విజయేంద్రప్రసాదేమో మావాడి గుండెలో హనుమంతుడు ఉండి సినిమా తీయించాడు అంటాడు… బీజెపి వారి కాషాయ మీటింగ్ లోలా “జై శ్రీరామ్” అంటాడు…
కొడుకేమో నేను నాస్తికుడిని అంటాడు… ఇంట్లో భక్తులున్నారు అంటాడు… దేశంలో ఎక్కడా లేని ఎల్ఈడి స్క్రీన్లు తెప్పిస్తే… వాటిలో సంవత్సరం కష్టపడి, ఇష్టపడి యావత్ టీమ్ తయారు చేసిన సినిమా పరిచయ వీడియో ప్లే చేయడం కష్టమైపోయింది… ప్రపంచం పట్టనంత సాంకేతికతను వాడుకునే రాజమౌళి సొంత ఫంక్షన్లో వీడియో ప్లే చేసుకోలేనంత బేలగా నిలబడడమా..? అంతటి శత్రుదుర్భేద్యమైన ప్రాంతంలో ఎల్ఈడి మీద టెస్ట్ వీడియో ప్లే చేస్తే డ్రోన్లతో షూట్ చేసి యూ ట్యూబుల్లో ఆ వీడియోలు పెట్టారా? ఇదంతా నమ్మేట్లు ఉందా?
అయినా కొమురం భీమ్- అల్లూరిని కూడా కలిపి కొత్త చరిత్రల్ని రాసే చరిత్రకారుడు రాజమౌళి… రాముడు కాశీని కాపాడేలా మహేష్ బాబుతో యుద్ధం చేయించకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు హిందుత్వం డిమాండు ఉన్న విషయం… భారతీయత ఉద్వేగ సన్నివేశం… పురాణాల్లో దేన్ని ఎలా వాడుకున్నా జనం బ్రహ్మరథం పడుతున్న కాలం… ఏ రుతువులో ఏ పాట పాడాలో తెలిసిన రాజమౌళి సరిగ్గా ఆ రుతువులో ఆ పాటే పాడుతున్నాడు…
రాజమౌళి నాస్తికుడు… మనం ఆస్తికులం…. ఆస్తికులకు ఆస్తికులు కథ చెబితే వింతేముంటుంది? నాస్తికుడు చెబితేనే ఆస్తికులకు ఆసక్తి….
కానివ్వండి సార్… త్వరగా కానివ్వండి… యాంకర్ సుమ చెప్పినట్లు ఈ సినిమా గురించి ఒక్క చిన్న విశేషం తెలిసినా మా జన్మలు ధన్యం…! అసలు సగటు హిందువు ఆ శివయ్య వారణాసిని చూసినా చూడకపోయినా… ఈ సినిమా వారణాసిని చూడకపోతే మాత్రం బతుకు వేస్ట్, పుట్టగతులు ఉండవ్ అన్నట్లుగా ప్రచార వాతావరణం తయారుకాకపోతే ముక్కుకు నేలకు రాసుకోండి…!…. జై వారణాసి శ్రీరామ్…!!
ష్… ఏమాటకామాట… మహేశ్ బాబు లుక్కు, గ్లింప్స్ మాత్రం అదిరిపోయాయి… తోటి స్టార్ హీరోలు కుళ్లుకునేలా..!! సరే, విశ్వం- జీవం పుట్టుక నుంచి కాశి మణికర్ణికఘాట్ దాకా రాజమౌళి అనబడే ఏమేం కొత్త చరిత్రను, కొత్త పురాణాన్ని ఎఐ గ్రాఫిక్కులతో లిఖిస్తాడో చూడాలిక..!!
Share this Article