.
ఐబొమ్మ రవి… పట్టుబడ్డాడు, జైలులో పడ్డాడు… తను చేసిన దందా మొత్తం చట్టవ్యతిరేకమే… కానీ అందులో సినిమాల్ని చూడటానికి అలవాటుపడ్డ జనం ఇక హఠాత్తుగా థియేటర్లకు పరుగులు తీసి, నిలువు దోపిడీలు ఇచ్చుకుంటారా..? నెవ్వర్..! అది ఇండస్ట్రీ భ్రమ…
సరే, ఆ కోణాల్ని వదిలేస్తే… తన పైరసీ దందాకు ఎంచుకున్న దేశం ఆసక్తికరం… ఆ దేశమే ఎందుకు అనేదీ ఆసక్తికరం… ఆ దేశం పేరు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్… కరీబియన్ దీవుల్లోని ఈ దేశం మొత్తం జనాభా ఎంతో తెలుసా..? 55,000… అవును, మీరు చదివింది నిజమే… అక్షరాలా యాభై అయిదు వేలు మాత్రమే… వీరిలో 2 శాతం వరకూ ఇండియన్ హిందువులు…
Ads
కానీ అక్కడే ఎందుకు..? దానికి సమాధానం సులభం… అక్కడ పౌరసత్వం చాలా సులభం… కాకపోతే కాస్త ఖరీదెక్కువ… ఈ దేశం “సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్” (Citizenship by Investment – CBI) కార్యక్రమాన్ని 1984 లో ప్రారంభించింది…
సాధారణంగా పౌరసత్వం పొందాలంటే ఆ దేశంలో నివసించాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఈ పద్ధతిలో కింది సౌలభ్యాలు ఉన్నాయి…:
-
నివాసం అవసరం లేదు…: పౌరసత్వం పొందడానికి మీరు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో నివసించాల్సిన లేదా అక్కడికి రావాల్సిన అవసరం లేదు…
-
వేగవంతమైన ప్రక్రియ…: సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ 3 నుండి 6 నెలల్లో పూర్తవుతుంది…
-
పరీక్షలు లేవు…: భాషా పరీక్షలు (Language Tests) లేదా ఇంటర్వ్యూలు సాధారణంగా అవసరం లేదు…
-
ద్వంద్వ పౌరసత్వం…: ఈ దేశంలో ద్వంద్వ పౌరసత్వానికి (Dual Citizenship) అనుమతి ఉంది….
పౌరసత్వం పొందడానికి మీరు దేశ అభివృద్ధికి గణనీయమైన ఆర్థిక సహకారం అందించాలి… ముఖ్యంగా రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి:
-
Sustainable Island State Contribution (SISC) కి విరాళం….:
-
ఒక దరఖాస్తుదారు కనీసం $250,000 USD (నాన్-రిఫండబుల్ విరాళం) చెల్లించాలి….
-
-
రియల్ ఎస్టేట్ కొనుగోలు….:
-
ప్రభుత్వ ఆమోదం పొందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో కనీసం $400,000 USD లేదా $325,000 USD విలువైన ఆస్తిని కొనుగోలు చేసి, నిర్దిష్ట సంవత్సరాల పాటు (సాధారణంగా 7 సంవత్సరాలు) దానిని కలిగి ఉండాలి…
-
ఈ కనీస పెట్టుబడి మొత్తాలతో పాటు, అదనంగా డ్యూ డిలిజెన్స్ ఫీజులు (Due Diligence Fees), దరఖాస్తు ఫీజులు, ఇతర ప్రభుత్వ ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది… అంటే రెండున్నర కోట్లు… పైరసీ దందాలో మస్తు సంపాదించిన ఇమ్మడి రవికి అది పెద్ద మొత్తం కాదు…

పైరసీ మాస్టర్‌మైండ్ వంటి వ్యక్తులు ఈ పౌరసత్వాన్ని పొందడానికి ప్రధాన కారణం దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు:
-
వీసా-రహిత ప్రయాణం…: సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాస్‌పోర్ట్ ద్వారా 140 కి పైగా దేశాలకు (UK, యూరోప్‌లోని షెంజెన్ ఏరియా దేశాలతో సహా) వీసా లేకుండా ప్రయాణించవచ్చు…. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించేవారికి చాలా కీలకం….
-
పన్ను ప్రయోజనాలు…: ఈ దేశంలో ఆదాయ పన్ను, వారసత్వ పన్ను లేదా సంపద పన్ను వంటివి ఉండకపోవడం కూడా ధనవంతులు ఇక్కడ పౌరసత్వం పొందడానికి ఒక కారణం….
రవి తను ఇండియన్ జూరిస్‌డిక్షన్ నుంచి తప్పించుకోవడానికి విదేశీ పౌరసత్వం తీసుకున్నాడు… అక్కడే సర్వర్లు ఏర్పాటు చేసుకున్నాడు… తద్వారా యూరప్ వంటి అనేక దేశాలకు వీసా లేకుండా ప్రయాణించి, విదేశాల్లోని బెట్టింగ్, గేమింగ్ ఆపరేటర్‌లతో నేరుగా సహకరించడానికి వీలు కలిగింది…
భారతీయ Law Enforcement Agencies తన వెబ్‌సైట్‌లను సులభంగా బ్లాక్ చేయకుండా ఉండటానికి, అతను నెదర్లాండ్స్ (ఆమ్‌స్టర్‌డామ్), స్విట్జర్లాండ్‌లో సర్వర్‌లను కొనుగోలు చేసి, అక్కడి నుంచి iBomma/Bappam వెబ్‌సైట్‌లను నడిపాడు…
- సర్వర్ల వివరాలను దాచడానికి, ట్రాకింగ్‌ను నిరోధించడానికి Cloudflare సేవలను ఉపయోగించాడు… డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం Porkbun వంటి సంస్థలను ఉపయోగించి, 110కు పైగా డొమైన్‌లను రిజిస్టర్ చేశాడు…

ప్రధాన డొమైన్‌లు బ్లాక్ అయిన వెంటనే, బ్యాకప్‌లు సిద్ధంగా ఉంచుకొని, కొత్త డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లకు త్వరగా మారేవాడు…
ఇదంతా సరే, ప్రేక్షకులు తన వెబ్‌సైట్లలో ఉచితంగానే సినిమాల్ని చూసేవాళ్లు కదా, మరి తనకు వచ్చే సంపాదన ఏమిటి..? పైగా ఓటీటీల నుంచి ఆల్రెడీ నిర్మాతలు డబ్బు తీసుకున్నాక, వాటిని డౌన్‌లోడ్ చేస్తే ఇండస్ట్రీకి నష్టం ఏమిటి..? ఇవీ ప్రశ్నలు…
వెబ్‌సైట్ ద్వారా వచ్చే లక్షలాది మంది వినియోగదారులను పాప్-అప్‌లు, హిడెన్ స్క్రిప్ట్‌ల ద్వారా 1win, 1xbet వంటి అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లించి అఫిలియేట్ కమిషన్లు సంపాదించాడు… పైరసీ ఫైల్స్‌లో మాల్వేర్‌ను పొందుపరిచి, వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఆర్థిక వివరాలను సేకరించి, వాటిని సైబర్ నేరగాళ్లకు విక్రయించేవాడు…
21,000 సినిమాలు: ఓ భారీ సంఖ్య
పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ఎస్‌ఎస్‌డిలలో హాలీవుడ్, బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌కు సంబంధించిన 21,000 సినిమాలున్నాయి... భారీ సంఖ్య… సో, రవి పైరసీ అనేది కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదు… తను చదివింది కేవలం బీఎస్సీ కంప్యూటర్స్…
2019లో క్రియేట్ చేసిన ఈ వెబ్‌సైట్ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా ఆదరణ పొందింది… ఒక దశలో నెలకు 50 లక్షల మంది ఈ సైట్ వీక్షించి ఉంటారని పోలీసుల అంచనా… 2022లో బప్పం వెబ్‌సైట్ ఏర్పాటు చేశాడు… తను సొంతంగా 900 వెబ్ సైట్లను క్రియేట్ చేయగల సాధనసంపత్తి, నైపుణ్యం సమకూర్చుకున్నాడు…

ఆదాయ మార్గం: బెట్టింగ్ ప్రమోషన్లు
iBOMMA వెబ్‌సైట్‌ను సందర్శించే వినియోగదారులను 2-3 సార్లు క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా 1win, 1xbet వంటి అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు దారి మళ్లించేవాడు… ఇంతా చేసి ఎంత సంపాదించాడు..? కుటుంబానికి ఏమీ ఇవ్వలేదు, పెళ్లాం విడాకులు ఇచ్చింది… 12 వేల కోట్ల నష్టం అని ఇండస్ట్రీ చెబుతోంది కదా… తప్పు… సినిమాల వసూళ్ల లెక్క వంటిదే ఇది కూడా…
అఫిలియేట్ కమీషన్ల రూపంలో ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా ₹20 కోట్లు సంపాదించినట్లు పోలీసుల అంచనా… ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో ఉన్న ₹3.5 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు… క్రిప్టో కరెన్సీలో ఎంత ఉందో తేలాల్సి ఉంది…
తన దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నవి… 3 మొబైల్ ఫోన్‌లు, 3 ల్యాప్‌టాప్‌లు, 6 సీపీయూలు, 15 హార్డ్ డిస్క్‌లు/ఎస్ఎస్‌డిలు, 10 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 34 డెబిట్/క్రెడిట్ కార్డులు… గేమింగ్/బెట్టింగ్ ఆపరేటర్‌లతో సహకరించడానికి తను నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఎస్ఏ, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, దుబాయ్ వంటి అనేక దేశాలకు తరచుగా ప్రయాణించేవాడు….
ఇంత చేసినా సరే, ఐబొమ్మ మీద, రవి మీద జనంలో ఏమీ పెద్ద వ్యతిరేకత లేదు... పైగా సానుభూతి ఉంది... దీనికి కారణం... సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మీద కోపం... అడ్డగోలుగా జనం డబ్బును దోచుకుంటున్నది నిజానికి వాళ్లే అని..!!
Share this Article