Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కన్నబిడ్డలనైనా నమ్మకూడదు… రోజులస్సలు బాగాలేవు… అదే ఇది…

November 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. కన్నబిడ్డల్ని నమ్మకూడదు . 1988 డిసెంబరులో వచ్చిన ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సినిమా ఈ తీర్పు మీదే తీయబడింది. కానీ ప్రపంచంలోని కన్నబిడ్డలు అందరూ ఒకేలా ఉండరు .

శ్రవణులు లాంటి బిడ్డలు కూడా ఉంటారు . వారి వారి కర్మ/ ఖర్మ ప్రకారం బిడ్డలు దొరుకుతారు . ఇలాంటి కధాంశంతో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు . కధ ఒకటే అయినా దాన్ని చెప్పే విధానం బట్టి ఆ సినిమా జనానికి నచ్చుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది .

Ads

మనలో చాలామంది నిజ జీవితాలకు దగ్గరగా ఉండే కధ . ముఖ్యంగా మధ్య తరగతి , దిగువ మధ్య తరగతి కుటుంబాలలో చూసే కధ . బిడ్డల్ని ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడదామని తపిస్తూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు .

బిడ్డలు మాత్రం రెక్కలు వచ్చేదాకా వాళ్ళ నిజ విష స్వరూపాన్ని చూపరు . కొందరు బిడ్డలు శత్రువుల కన్నా నీచాతినీచంగా మోసం చేస్తూ ఉంటారు , అబధ్ధాలు ఆడుతూ ఉంటారు . నమ్మించి గొంతు కోస్తుంటారు . ఇదంతా బిడ్డలతో తంటా .

ఈ సినిమాకు దర్శకుడు , హీరో విసు అయితే షీరో మాత్రం శారదే . అద్భుతంగా నటించింది . తినేసింది . సినిమా అంతా తానై నడిపించింది . మగాళ్ళ అదృష్టం ఏమిటంటే మనం సున్నప్పిడతలం అయినా భార్యలు కార్యసాధకులుగా , అన్నీ భరించే భూమాతగా ఉంటారు . క్షమయా ధరిత్రీ , కరణేషు మంత్రీ , కార్యేషు దాసీ . ఈ మొత్తం వర్ణన ఈ సినిమాలో విసు , శారద పాత్రలకు ఎగ్జాక్టుగా సూటవుతాయి .

విజయవాడలో కధ నడుస్తున్నట్లు చూపబడుతుంది . గాంధీనగరం , గవర్నర్ పేట , హోటల్ కాంధారి వంటి పేర్లు తగులుతాయి సినిమాలో . హోటల్ కాంధారి అంటే ఇప్పుడు ఫార్చ్యూన్ మురళి హోటల్ . సుబ్బయ్య అనబడే ఓ దిగువ మధ్య తరగతి సున్నప్పిడతకు సీతమ్మ తల్లి వంటి సహనవతి భార్య . ఇద్దరు కొడుకులు , ఇద్దరు కూతుళ్ళు . నానా గడ్డి తిని పెద్దవాళ్ళని చేస్తారు .

రెక్కలు రాగానే , అవకాశం రాగానే పంగనామాలు పెట్టేస్తారు . ఒక్క ఆఖరి కూతురు మాత్రం అంటిపెట్టుకుని ఉంటుంది . సున్నప్పిడత భర్త ఇంటి యజమానురాలితో 90 రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తానని శపధం చేస్తాడు . అతని శపధాన్ని నెరవేర్చేందుకు సహనవతి భార్య బలిదానం చేస్తుంది . ఆమె మరణంతో సినిమా దుఃఖాంతం అవుతుంది .

కధను వ్రాసిన దొరైరాజుని , స్క్రీన్ ప్లేని నేసి దర్శకత్వం వహించిన విసుని తప్పకుండా అభినందించాలి . కధ చాలా సార్లు విన్నదే అయినా చూసిందే అయినా భిన్నంగా చూపడంలో సఫలీకృతులు అయ్యారు . సంగీత దర్శకత్వం వహించిన విజయానందుని కూడా మెచ్చుకోవాలి .

ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం . విషాద , హృద్య సన్నివేశాలలో ఎంతో అర్ధవంతమైన సంగీతాన్ని అందించారు . ఇప్పటి ఢాంఢాం గార్లు తప్పక ఓపిగ్గా చూడాలి . అలాగే ఆకెళ్ళ సంభాషణలు కూడా సూటిగా బాణాల్లాగా గుచ్చుకుంటాయి .

వీటన్నిటికీ తోడు సిరివెన్నెల వారి లిరిక్స్ చాలా బాగున్నాయి . ఇల్లు ఇల్లాలు పిల్లలనే ఈ బంధాలన్నీ కల్లలురా పాటను చాలా గొప్పగా వ్రాసారు . అంతే గొప్పగా పాడారు బాలసుబ్రమణ్యం . అలాగే నీ తోడు కడలేని విషాద గీతం కూడా . చూడు చూడు ఇల్లు కట్టి చూడు , ఎప్పుడో ఎక్కడో , మళ్ళీ రాదు మరలిన ఈరోజు పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

నటనపరంగా శారద గురించి ఎంత చెప్పినా తక్కువే . చాలామందికి ధరిత్రి వంటి తమ భార్యలు గుర్తుకు వస్తారు . విసుది సున్నప్పిడత పాత్ర . చాలా సినిమాల్లో చూసిందే . ఇతర ప్రధాన పాత్రల్లో ప్రముఖ హాస్య నటుడు నగేష్ కొడుకు ఆనంద్ బాబు , మహర్షి రాఘవ , ముచ్చెర్ల అరుణ , చంద్రమోహన్ , దేవి , పి ఆర్ వరలక్ష్మి , రమణమూర్తి , భీమేశ్వరరావు , తులసీరాం , దివ్య , మల్లిక , పౌర్ణమి , తదితరులు నటించారు .

ఈ సినిమా చూసే దిగువ మధ్య తరగతి , మధ్య మధ్య తరగతి వాళ్ళకు తమ స్వంత ఇంటి కష్టాలు గుర్తుకొస్తాయి . నీచాతినీచులను బిడ్డలుగా పొందిన వారికి తమ రాక్షస సంతానం గుర్తుకొస్తుంది . సినిమా యూట్యూబులో ఉంది . 1980s దిగువ మధ్య తరగతి త్రిశంకు జీవితాల సినిమా . అందరూ తప్పక చూడాల్సిన సినిమా .

నేను పరిచయం చేస్తున్న 1170 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పిట్టల్ని కొట్టడం కాదు… సినిమా నేర్చుకోవల్సిన పాఠం ఏమనగా…
  • కన్నబిడ్డలనైనా నమ్మకూడదు… రోజులస్సలు బాగాలేవు… అదే ఇది…
  • ఎంత పెద్ద హీరోయిన్ ఐతేనేం, మేం సారీ చెప్పము గాక చెప్పము…
  • నో నో… వారణాసి కథ కాదు ఇది… కానీ ఇదే అయితే ఎలా ఉంటుంది..?!
  • తుది దెబ్బ- హిడ్మా ఎన్‌కౌంటర్… మావోయిస్టు పోరాటానికి ముగింపు..?!
  • కలిచివేసే విషాదం..! గంటల వ్యవధిలో గాలిలో కలిసిన నాలుగు ప్రాణాలు..!!
  • 500 రూపాయలకు కిలో..! అన్నమే ఆహారం- ఔషధం…! కానీ …?
  • సేమ్ మహానటి సావిత్రిలాగే… వైభోగం నుంచి ఓ అనామక మరణం వరకూ…
  • టైటానిక్ మునిగింది… మరి బతికిన ప్రయాణికులను తీరం చేర్చిందెవరు..?
  • అన్నీ బాగానే ఉన్నా… పేలవమైన సంగీత దర్శకత్వం దెబ్బేసింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions