.
Yaseen Shaikh …. పకోడీ పరాక్రమార్కుడు!
వాల్కనో లోంచి ప్రవహిస్తున్నలావాలో లోటా ముంచి దాన్ని స్టౌ మీద పెట్టాడు పరాక్రమ్ రాథోడ్. కాసేపాగి అందులో చాయ్ పత్తా, చక్కెరా కలిపాడు.
లావా ఇంకాస్త పొంగగానే, బుడబుడమంటున్నఆ డికాక్షన్‌ను దించాడు. దించి… ఆ పక్కనే పాడుబడ్డ ఇంటి కిటికీకి ఉన్న ఐరన్ మెష్‌ను ఒక్కపెట్టున లాగాడు. ఆ మెష్‌తో వడబోసి టీ తాగసాగాడు.
‘జాగ్రత్త అల్లుడూ… నోరు కాలుద్ది’ హెచ్చరించాడు పక్కనే ఉన్న లాఫానందం.
Ads
‘‘హా హా హా…’’ లెక్క చేయనట్టుగా, ఇది మనకో లెక్కా అన్నట్టుగా నవ్వాడు రాథోడ్.
‘‘కనీసం… ఊదుకుని తాగు’’ మరో సలహా ఇచ్చాడు లాఫానందం.
పర్వాలేదన్నట్టుగా కనుబొమలెగరేసి, టీ పూర్తయిన వెంటనే సిగరెట్ తీసి పెదవుల మధ్య పెట్టుకుని అగ్నిపర్వతం బొక్కకు దగ్గరిగా వెళ్లాడు. నాజిల్‌లోంచి వచ్చినట్టుగా బుస్ మంటూ ఒక కాలమ్ (పిల్లర్) లాగా పైకెగసింది మంట.
ఆ ఎగసిపడుతున్న మంటలో సిగరెట్ కాల్చుకుని ఒక్క దమ్ము లాగాడు పరాక్రమ్ రాథోడ్…
అలా సిగరెట్ దమ్ము లాగుతుండగా…
* * * * *
రాస్తూ రాస్తూ ఇక్కడ పాజ్ ఇచ్చాడు రాంబాబు.
మా..ఆ..ఆం..ఛి రసపట్టుతో సినిమా కథ రాయడంలో మునిగిపోయాడు.
రాంబాబుది ఒక్కట్టే కోరిక. హీరోకు అద్భుతమైన ఎలివేషన్లు ఇస్తూ ఓ కథ రాయాలి. అందులో హీరోకు రాజమౌళి, ప్రశాంత్‌నీల్‌ల కంటే ఎలివేషన్‌లు ఓ పిసరంత ఎక్కువే ఉండాలి.
ఇంట్రడక్షన్ సీన్ ముగియగానే… వెంటనే ఫైట్ సీన్ రాయసాగాడు.
ఇందాక ముగిసిన చోటునుంచి మళ్లీ మొదలుపెట్టాడు.
* * * * *
అలా సిగరెట్ దమ్ములాగుతుండగా…
పరాక్రమ్ రాథోడ్‌ను రౌడీలు చుట్టుముట్టారు. అందరూ ఆయుధాలతో… మనవాడు ఒక్కడే ఒట్టిచేతుల్తో.
ఫైటింగ్ కాస్తా బహు టఫ్ గా మారింది. హీరోకూ ఓ ఆయుధం అవసరమయ్యింది.
దూరంగా… లావాలో ఇరుక్కుపోయి కనిపించిది ఓ కరెంటు స్తంభం. మొత్తం లావాలో ఇరుక్కుపోయి ఉందది. అచ్చం డాంబరు (తారు)లో మునిగి బిగుసుకుపోయింది. లావా దాని చుట్టూ పేరుకుపోయి ఆవరించి ఉంది.
ఒక్కపెట్టున దాన్ని లాగాడు పరాక్రమ్.
‘‘ఛ…’ స్తంభం కాస్త పొడుగైపోవడంతో మనసులో విసుక్కున్నాడు. ఆ వెంటనే మోకాల్ని పైకిలేపి తొడ మీద స్తంభాన్ని పెట్టి బాణాకర్రను విరిచినట్టుగా ‘ఠపేల్’మంటూ అనువైన సైజుకు విరిచాడు.
ఆ వెంటనే కర్రసాము చేస్తున్నట్టుగా ఆ స్తంభాన్ని తిప్పడం మొదలుపెట్టాడు. అసలే లావాలో ఇరుక్కున్న స్తంభం. దాని చుట్టూ ఉన్న లావా కణికెలు నిప్పురవ్వల్లా చెల్లాచెదురుగా నలుదిక్కులకూ విసిరేసినట్టు రాలడం మొదలయ్యాయి.
హాహాకారాలు చేస్తూ నేలరాలిపోయారు విలన్ సేన.
కొందరు ఫైటర్లు నడుములోతు లావాలో కూరుకుపోతూ బుదరలో ఇరుక్కున్నట్టుగా నడవలేక నడుస్తూ పరుగెట్టి పారిపోతున్నారు. మరికొందరు మూకుమ్మడిగా లావాలో తలకిందులుగా నడుం లోతుకు ఇరుక్కుపోయారు.
చిన్న స్మైల్ ఇచ్చి కొనగోటితో మీసం దువ్వుకుంటూ విక్క్‌డ్‌గా నవ్వాడు పరాక్రమ్.
‘‘కింగ్ కోబ్రా ఒక్కటేరా స్నేకుల్లో రాజు! మిగతావనీ బురదపాములేరా’’ లాస్ట్ స్లామ్ ఇస్తూ ఈ ఫినిషింగ్ డైలాగ్‌తో ఫైట్ ముగించాడు పరాక్రమ్.
‘‘అలసిపోయుంటావ్. కాసిని పకోడీలు తిని వెళ్లు అల్లుడూ’’ ఆఫర్ చేశాడు లాఫానందం.
‘‘టైమ్ లేదు మావా…’’ అర్జెంటు పనిమీద హడావుడిగా వెళ్లిపోయాడు పరాక్రమ్ రాథోడ్.
* * * * *
లాఫానందం ఆఫర్ చేసినా కూడా… పకోడీలు తినలేదన్న సంగతి వికాస్ రాజ్‌కు తెలిసిపోయింది.
‘‘ఎక్కడెక్కడ్నుంచో బయల్దేరి వచ్చేస్తుంటారు. పకోడీ తినడానిక్కూడా టైముండదట వీళ్లకు’’ అంటూ చిరాకుపడుతూ పరాక్రమ్ రాథోడ్ ఉన్నచోటికి బయల్దేరాడు వికాస్‌రాజ్.
ప్రజాసేవలో భాగంగా పరాక్రమ్ ఆ టైమ్‌లో కంబల్ పరేడ్‌లో ఉంటాడని తెలుసు. (కంబల్ పరేడ్ అంటే ఎవరినైనా కంబళి చుట్టేసి వేసి, ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టడం. గతంలో వాళ్ల బావ ఏజెంట్ గోపీ గారు పోలీస్ సర్వీస్‌లో ఉండటం వల్ల ఈ టెర్మినాలజీతో బాగా పరిచయం).
వీధి చివర చెరుకురసం బండి దగ్గర ఓ పెద్ద ఐసుగడ్డను కంబళిలో చుట్టి చితక్కొడుతున్నాడు పరాక్రమ్.
అతడా పనిలో ఉండగానే పొద్దున్నే పరాక్రమ్ రాథోడ్ తిన్న బ్రేక్‌ఫాస్ట్ మెన్యూ తెప్పించుకున్నాడు వికాస్‌రాజ్.
‘‘రెండు చెగోడీలూ, పధ్నాలుగు చెక్రాలూ, మూడు బోండాలూ, అరడజను నువ్వుండలు… ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్. ఏ ఐటమ్ వదలడంలో కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట’’ అంటూ మనసులో మెచ్చుకుంటూనే….
‘‘చూడు పరాక్రమ్. చెగోడీలూ, పెసరట్లూ తినేశామన్న గర్వం ఉండొద్దు.
కడుపునొప్పి లేస్తది కాబట్టి వాము లేని ఏ శెనగపిండి ఐటమ్‌నూ తినకూడదు.
పకోడీలనూ గౌరవించాలి. పకోడీలు తినలేదెందుకా అనే భయముండాలి.
ఒన్ షుడ్ హ్యావ్ ఏ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ పకోడాస్’’ అంటూ సలహా ఇచ్చాడు వికాస్‌రాజ్.
‘‘నాకు భయం లేదని ఎందుకనుకుంటున్నార్సార్.
పకోడీలు వండే ప్రతిసారీ భయపడుతుంటాను.
కోసిన ఉల్లిపాయ చుట్టూ శెనగపిండి చక్కగా అంటుకుంటుందో లేదో అని భయపడుతుంటాను.
పంటికిందికి వచ్చేట్టుగా మిరపకాయను సన్నగా సరిగ్గా తరగగలనో లేదో అని భయపడుతుంటాను.
పిండిలో ముంచిన ఉల్లిపాయను నూనెలో బుడుంగున వదిలేటప్పుడు
వేడివేడి నూనె గబుక్కున ఎక్కడ ఒంటిమీదికి ఎగ జిమ్ముతుందో అని భయపడుతుంటాను.సార్… మీరన్న ఆ కడుపునొప్పి రావచ్చూ రాకపోవచ్చు.
కానీ పకోడీలు గోల్డ్‌కలర్‌కు రాకుండా నల్లగా ఎక్కడ మాడిపోతాయో అని అనుక్షణం భయపడుతుంటాసార్.
ఈ వరసలో ఏది జరగకపోయినా ఎలారా బగమంతుడా అని భయపడుతుంటాన్సార్.
కానీ సార్… తీరా తినేప్పుడు పకోడీ నా నాలుక మీదుండాలీ… నా నోట్లో నీళ్లూరాలి.
నౌ సర్… ఈవినింగ్ పకోడీలు చేసిపెడతానని నా కూతురికి మాటిచ్చా.
మీరిప్పుడు పర్మిషనిస్తే… శెనగపిండి ప్యాక్ చేయించడానికి వెళ్లాలి సార్’’
టైట్ సెల్యూటొకటి చేసి… పట్టువదలని పరాక్రమార్కుడు చింతల్‌బస్తీ చిల్లరకొట్టు దిశగా వెళ్లిపోసాగాడు.
చెమర్చిన కళ్లతో అతడినే చూడసాగాడు వికాస్‌రాజ్.
* * * * *
ఇంతవరకు రాయగానే గబుక్కున లేచి వేగంగా వెళ్లసాగాడు రాంబాబు.
‘‘అంత హడావుడిగా ఎక్కడికి రా…’’ అంటూ కేకేసింది వాళ్ల అమ్మ.
‘రాత్రి తిన్న పకోడీలు తేడా చేసినట్టుంది’ మనసులో అనుకుంటూ గబగబ నడుస్తూ…
‘‘బాత్‌రూమ్‌కు అమ్మా!!’’ బదులిచ్చాడు రాంబాబు.
– యాసీన్
19–11–2024
ఇది ఏ సినిమాకు సంబంధించో ఊహించండి… తెలిసిందా..? మనసులోనే ఉంచుకొండి…
Share this Article