.
రష్యాతో ఎవరైనా వ్యాపారం చేసినా, ఆ చమురు కొన్నా 500 శాతం పెనాల్టీ సుంకం తప్పదని విశ్వవిఖ్యాత వాచాలుడు ట్రంపుడు ఉరిమాడు కదా… చిన్న పారడాక్స్ ముచ్చట చెప్పుకుందాం…
.
Ads
వార్త తేదీ: నవంబర్ 17, 2025
ఓడలో ఉన్న సరుకు: దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల (Metric Tons) జెట్ ఫ్యూయల్ (Jet Fuel).
గమ్యస్థానం: లాస్ ఏంజిల్స్ (US West Coast).
ఓడ పేరు: హాఫ్నియా కలంగ్ (Hafnia Kallang) అనే పనామాక్స్ (Panamax) ట్యాంకర్.
సరుకు ఎక్కించిన ప్రదేశం: జామ్‌నగర్ పోర్ట్ (గుజరాత్, భారతదేశం). ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) రిఫైనరీ నుండి వచ్చింది.
సరుకు ఎవరి కోసం: ఇంధన దిగ్గజ సంస్థ అయిన చెవ్రోన్ (Chevron) కోసం.
చేరుకునే అంచనా సమయం: డిసెంబర్ మొదటి భాగంలో లాస్ ఏంజిల్స్ చేరుకోవచ్చు.
ముఖ్య కారణం: కాలిఫోర్నియాలోని చెవ్రోన్ యొక్క ఎల్ సెగుండో (El Segundo) రిఫైనరీలో ఆపరేషనల్ సమస్య కారణంగా జెట్ ఫ్యూయల్ సరఫరాలో ఏర్పడిన కొరతను తాత్కాలికంగా తీర్చడం కోసం ఈ ఓడ వెళ్తుంది. చమురు ప్రపంచ మార్కెట్‌లో ఇదో విశేషం…
ఏ అమెరికా మనల్ని బెదిరిస్తున్నదో అదే అమెరికా చమురు మార్కెట్‌లోకి ఇండియా తొలిసారిగా ప్రవేశిస్తోంది… ఆ సరుకు ఎక్కడిదో తెలుసా..? రష్యా నుంచి కొన్నది…
రష్యా నుంచి కొంటే తాటతీస్తాం అని అమెరికా బెదిరిస్తే… అదే రష్యా చమురు ప్రాసెస్ చేసి, అదే అమెరికాకు అమ్మడం ఈ వార్తలో విశేషం…
సాధారణంగా కెనడా నుంచో మధ్యప్రాచ్యం నుంచో రావాలి ఈ జెట్ ఫ్యుయల్… కానీ ఈసారి సుదూరంగా ఉన్న ఇండియా నుంచి వస్తోంది… ఇదేదో సాదాసీదా డీల్ కాదు… జియోపొలిటిక్స్‌లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి…
ఉక్రెయిన్ యుద్దం మొదలయ్యాక అమెరికా పదే పదే ఏమంటోంది..? ‘‘రష్యా ఆయిల్ వద్దు, ఎవరూ కొనొద్దు, అది కొనడం అంటే పుతిన్‌కు మద్దతు ఇవ్వడమే… కొనే దేశాలకు భారీగా పెనాల్టీ సుంకాలు వేస్తాం…’’ మరీ ఇండియాను అయితే రకరకాలుగా బెదిరిస్తున్నాడు ట్రంపు…
దెబ్బకు చమురు కొనడం ఆపేసిందని బోలెడు వార్తలు కూడా కనిపిస్తున్నాయి… కానీ ఏదో ఓ మార్గంలో… రష్యా చమురు వస్తూనే ఉంది… ఆ వివరాలు గోప్యం… ‘‘మా జాతీయ ప్రయోజనాలు మాకు ముఖ్యం… ఎక్కడ చవకగా దొరికితే అక్కడే కొనుగోలు చేస్తాం…” అనేది ఇండియా స్టాండ్…
అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరేదాకా ఇలాగే ట్రంపు బెదిరిస్తాడు, ఒక్కసారి ఆ డీల్ కుదిరితే ఇక మన జోలికి రాడు, పైగా రకరకాల సరుకులపై విధించిన భారీ సుంకాలను కూడా కనీస స్థాయికి తగ్గించేస్తాడు అని తాజా వార్తలు చెబుతున్నాయి… సరే, జెట్ ఫ్యుయల్ సంగతికొద్దాం…
అమెరికా వెస్ట్ కోస్ట్, ముఖ్యంగా కాలిఫోర్నియా, ఉన్నట్టుండి జెట్ ఫ్యూయల్ కొరతను ఎదుర్కొంది… అక్టోబర్‌లో షెవ్రాన్ సంస్థకు చెందిన కీలకమైన ‘ఎల్ సెగుండో’ రిఫైనరీలో అగ్ని ప్రమాదం జరగడం, ఇతర రిఫైనరీల నిర్వహణ పనులు (Maintenance Outages) వల్ల ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది…
కఠినమైన పర్యావరణ నిబంధనలు, పాత రిఫైనరీల కారణంగా తమ అవసరాలను తామే తీర్చుకోలేని స్థితిలో అమెరికా పడింది… ఆకస్మికంగా పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి అమెరికా గ్లోబల్ మార్కెట్‌లో వెతకడం మొదలుపెట్టింది. సాధారణంగా తమకు సరఫరా చేసే దేశాలు కూడా ఈ భారీ డిమాండ్‌ను తీర్చలేకపోయాయి. అత్యవసరంలో ఉన్న అమెరికా… భారత్ వైపు చూడక తప్పలేదు…
జియోపాలిటికల్ ట్విస్ట్…
అమెరికా ఏ రష్యన్ చమురును కొనవద్దని భారత్‌పై ఒత్తిడి తెచ్చిందో, ఇప్పుడు అదే రష్యన్ క్రూడ్‌ను ప్రాసెస్ చేసిన జెట్ ఫ్యూయల్‌ను భారత్ నుంచి కొనుగోలు చేసింది…
“మీరు కొనవద్దు అన్నదే, మేము కొని, రిఫైన్ చేసి, స్టాక్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు అత్యవసరం వచ్చింది కాబట్టి, మా వద్ద నుంచే కొనుగోలు చేసుకుంటున్నారు. ఇదే లెక్క!” – అన్నట్టుగా ఈ డీల్ ప్రపంచానికి ఒక గట్టి సందేశం ఇచ్చింది…
భారత్‌కు డబుల్ ధమాకా
ఈ ఒక్క డీల్ ద్వారా భారత్‌కు అంచనా వేయలేని లాభం వచ్చింది… భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ రిఫైనింగ్ సామర్థ్యం గల దేశంగా మరింత బలంగా నిలబడింది. రష్యా ఆయిల్ కొనుగోలుపై వచ్చిన విమర్శలన్నీ ఒక్కసారిగా చల్లబడ్డాయి…
ఏ దేశ ఒత్తిడికి లొంగకుండా, తన ప్రయోజనాలను కాపాడుకుంటూ, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికాకు ఆపత్కాలంలో సాయం చేసిన ‘స్వింగ్ సప్లయర్’గా భారత్ నిలిచింది. వాషింగ్టన్-న్యూఢిల్లీ ద్వైపాక్షిక సంబంధాలకు ఇది మరింత బలాన్ని ఇచ్చింది… గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరంగా ఉండాలంటే భారత్ తప్పనిసరి… ఇండో-పసిఫిక్ స్ట్రాటజీలో భారత్ కేవలం సైనిక భాగస్వామి మాత్రమే కాదు, ఒక కీలకమైన ఎనర్జీ పవర్ కూడా!
అవసరాలు అహంకారాన్ని దింపుతాయి
ఈ జెట్ ఫ్యూయల్ డీల్ ద్వారా ప్రపంచానికి వెళ్లిన బలమైన సందేశం ఒక్కటే… భారత్ ఇప్పుడు కేవలం ఎనర్జీ కస్టమర్ కాదు, ఎనర్జీ పవర్… జియోపాలిటిక్స్‌లో భారత్‌ను ఎవరూ కమాండ్ చేయలేరు, ఇగ్నోర్ చేయలేరు… వద్దు అన్నది అమెరికానే, మళ్లీ కావాలి అని తీసుకున్నది కూడా వారే. ఎస్, అవసరాలు దేశాలను తమ పట్టుదల, అహంకారం నుండి దిగేలా చేస్తాయి. ఈ ఒక్క డీల్ ఆ వాస్తవాన్ని బలంగా నిరూపించింది… అంతర్జాతీయ వేదికపై భారత్ తన ఆట తాను ఆడుతోంది…! ( Inputs From Upadrashta pardha saradhi )
Share this Article