.
సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును మొద్దుబారుస్తోందని ఈమధ్య అనేక అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి.
మనం తప్పు టైప్ చేసినా ఆటోమేటిగ్గా సరిచేసేది- ఆటో కరెక్ట్. మనం టైపు చేయబోయే మాటలను దానికదిగా అందించేది- ప్రిడిక్టివ్ టెక్స్ట్. మనం టైపు చేసిన వాక్యంలో వ్యాకరణ దోషాలను సరిచేసేది- గ్రామర్లి. ఈ యాపులు కాక ఆడియో చెబితే టెక్స్ట్ ఇచ్చేవి, పి డి ఎఫ్ పెడితే టెక్స్ట్ ఇచ్చేవి, రియల్ టైములో ఒక భాష నుండి ఇంకో భాషలోకి అనువదించే ఆడియో, టెక్స్ట్ ఇలా ఇప్పుడు లెక్కలేనన్ని భాషా సాధనాలు అందుబాటులో ఉన్నాయి.
Ads
లాభం:- భాషా యాప్ ల వల్ల ప్రత్యేకించి ఇంగ్లీషులో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా రాయడం నేర్చుకుంటున్నారు. ఒకమాటను ఎలా పలకాలో అన్న శబ్దోచ్చారణ కూడా తెలుసుకుంటున్నారు. గూగుల్ చాట్ బోట్ లాంటి వాటి సహాయంతో సృజనాత్మక రచనలు కూడా వస్తున్నాయి.
నష్టం:- కృత్రిమ మేధ- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే భాషా యాప్ లు మనిషి మెదడును మొద్దుబారుస్తున్నాయి. యాంత్రికంగా మారుస్తున్నాయి. స్పెల్లింగులు, వాక్య నిర్మాణం, ఉచ్చారణ ఎలా ఉన్నా యాప్ లు సవరిస్తాయన్న ధీమాతో ప్రాథమికమయిన భాషా పరిజ్ఞానం కూడా లేకుండా పోతోంది. కొన్నాళ్లకు యాప్ లు, సాఫ్ట్ వేర్లు, కృత్రిమ మేధలు మాత్రమే భాషాధికారాన్ని నిర్ణయించే పరిస్థితి రావచ్చు.
దేవులపల్లికంటే గొప్పగా చాట్ బోట్ భావకవిత్వం రాయచ్చుగాక. యంత్రం యంత్రమే. ఎక్కడో ఒకచోట దానికి పరిమితి ఉంటుంది. అందులో ఫీడ్ అయిన సమాచారం ఆధారంగానే అది కవిత అల్లగలుగుతుంది.
మెదడుందా?
ఇదివరకు “మెదడుందా?” అన్నది తిట్టు. ఇకపై మెదడుందా? అన్నది ప్రశ్నే కాకపోవచ్చు. “కృత్రిమ మేధ యాప్ లు ఉండగా మెదడెందుకు దండగ?” అన్నది అంగీకారం కావచ్చు.
కృత్రిమ మేధమీద ఎక్కువగా ఆధారపడకుండా మెదడును ఉపయోగించడం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం అవసరమని సాక్షాత్తు గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ సలహా ఇస్తున్నారు. అలాగే ఏఐ చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మద్దని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
వివిధ సామాజిక మాధ్యమాల్లో, నెట్లో అందుబాటులో ఉన్న అపారమైన డేటాను విశ్లేషించి ఏ ఐ వెంటనే సమాధానం చెబుతున్నంతమాత్రాన అదంతా నూటికి నూరుపాళ్ళు సరైనదేనని అనుకోరాదని ఆయన అనేక ఉదాహరణలతో వివరిస్తున్నారు. ఎంత గొప్పగా రూపొందించినా ఏ ఐ వ్యవస్థలు కూడా తప్పులు చేస్తున్నాయని సాంకేతికంగా విశ్లేషించి చెప్పారు.
ప్రపంచమంతా ఏఐ రంగంలోకి పెట్టుబడుల వరద పారుతున్నా…ఏ ఐ తప్పు చేస్తే? ఏఐ కూలిపోతే? ఏఐ గాలిబుడగ పేలిపోతే? అన్న ఎరుకతో ప్రత్యామ్నాయాలు ఇప్పటినుండే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఏఐ నామస్మరణతో ఊగిపోతున్న ప్రపంచం చెవికి సుందర్ పిచాయ్ హెచ్చరికలు వినపడతాయా! అంతకు ముందు పనిచేసినా…పనిచేయకపోయినా కనీసం మెదడు మోకాల్లోనో, అరికాల్లోనో ఒక అవయవంగా ఉనికి అయినా ఉండేది. ఆధునిక యుగంలో “ఏఐ ఉండగా మెదడెందుకు దండగ?” అని ఉపయోగించడం మానేయడంతో చాలాసార్లు అత్యంత అధునాతన ఎంఆర్ఐ స్కానర్లకు కూడా మెదడు కనపడ్డం కష్టంగా ఉంది!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article