Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ సాత్విక పెద్ద భార్య… ఓ గయ్యాళి చిన్న భార్య… ఓ జీవన జ్యోతి…

November 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ఈ జీవనజ్యోతి ఆ పాత జీవనజ్యోతి కాదు . ఈ జీవనజ్యోతిలో ఒక మొగుడు ఇద్దరు పెళ్ళాలు ఉంటారు . అయితే ఏం ! గొప్ప సెంటిమెంట్ సినిమా . రకరకాల సెంటిమెంట్లు .

ఒకటి భార్యాభర్తల సెంటిమెంట్ . 12 ఏళ్ళయినా పిల్లలు కలగలేదని భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేస్తుంది ఓ భార్య. రెండో భార్యకు ఓ ఆడపిల్ల కలిగాక ఆ పిల్ల పెద్దమ్మకు చేరువ అవుతుందని పెద్ద భార్యని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తుంది రెండో భార్య . భార్యభర్తలుగా జయసుధ , శరత్ బాబు బాగా నటించారు . జయసుధ అదరగొట్టేసింది . ఆమే సినిమాకు షీరో .

Ads

మరో సెంటిమెంట్ చిన్నప్పుడే పనివాడుగా చేరి పెంపుడు కొడుకయిన అక్బర్ , పేరుకు యజమాని అయినా తల్లి లాగా పెంచిన జయసుధల సెంటిమెంట్ గొప్పగా చూపారు దర్శకుడు రేలంగి నరసింహారావు . కడదాకా అంటిపెట్టుకొనే ఉంటాడు అక్బర్ పాత్రధారి రాజేంద్రప్రసాద్ .

అలాంటి విశ్వాసపాత్రులు అక్కడక్కడా ఉంటారు . మావద్ద అలా నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఒక అటెండర్ ఉన్నాడు . మా బంధుమిత్రులు అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు వాడిని చూసి . వాడి పేరు పాండు .

ఇలా మస్తు సెంటిమెంటుతో తీయబడిన ఈ సినిమా1987 లో తమిళంలో వచ్చిన తాళిధనం అనే సినిమాకు రీమేక్ . తమిళంలో లక్ష్మి , జయశ్రీ , టి జి మహేంద్రన్ , రాజేష్ నటించారు . లక్ష్మి కన్నా జయసుధ బ్రహ్మాండంగా నటించింది . సినిమా కూడా మన తెలుగుదే బాగుంటుంది .

క్లైమాక్సులో శరత్ బాబు కూతురి పెళ్లి సమయానికి ఆస్తి అంతా కోల్పోయి పీటల మీద పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వస్తుంది . పెళ్లి సమాచారం తెలుసుకున్న జయసుధ నౌకరు రాజేంద్రప్రసాదుని తీసుకుని పెళ్ళికి వస్తుంది . తన భర్త కానుకగా ఇచ్చిన వజ్రాల తాళిని పెళ్ళికొడుకు తండ్రికి ఇచ్చి వివాహ కార్యక్రమం పూర్తి చేస్తుంది . భర్త చేతుల్లో ప్రాణాలను విడుస్తుంది . సినిమా అలా దుఃఖాంతం అవుతుంది .

మూల కధ తమిళం నుంచే అయినా చిక్కని స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావును మెచ్చుకోవాలి . నటినటుల నుండి కావలసిన నటనను రాబట్టుకోవటమే కాకుండా సీన్లను బాగా రక్తి కట్టించారు . ముఖ్యంగా సెంటిమెంట్ల సీన్లను .

జయసుధ తర్వాత మెచ్చుకోవలసింది రాజేంద్రప్రసాదునే . విశ్వాసపాత్రుడయిన నౌకరుగా చాలా restrained నటనను ప్రదర్శించాడు . ఆ తర్వాత శరత్ బాబు . మొదటి భార్య అంటే ఎనలేని ప్రేమ . రెండో భార్య వచ్చాక ఆ రెండో భార్య , ఆమె గయ్యాళి తల్లి పెద్దామెను రాచిరంపాన పెడుతుంటే చూడలేక ఏమీ చేయలేక నలిగిపోయే సీన్లలో బాగా నటించారు .

రెండో భార్యగా మనోచిత్ర , ఆమె గయ్యాళి తల్లిగా జయవిజయ , రాజేంద్రప్రసాద్ ప్రేయసిగా ఖుష్బూ , నవాబ్ ఆఫ్ అనకాపల్లి పాత్రలో రాళ్ళపల్లి , నిర్మలమ్మ , ఝాన్సీ , నర్రా , ప్రభృతులు నటించారు .

రాజ్-కోటి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . జేసుదాస్ పాడే నీవేనమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి పాట చాలాబాగా పాడారు . ఈ పాటకు ఆయనకు నంది అవార్డు కూడా వచ్చిందని వికీపీడియాలో చూసా . Subject to verification .

జయసుధ , శరత్ బాబు డ్యూయెట్ సంసార జీవితం శ్రీవారికంకితం శ్రావ్యంగా ఉండటమే కాదు , చక్కగా చిత్రీకరించబడింది కూడా . ఖుష్బూ , రాజేంద్రప్రసాదుల రెండు డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి . ముద్దొచ్చే బుల్బుల్ పిట్టా , ఓ హోయ్ హోయ్ వయ్యారి నడకలదానా అంటూ సాగుతాయి ఆ రెండు డ్యూయెట్లు .

మనోచిత్ర తల్లిని అల్లరి చేస్తూ రాజేంద్రప్రసాద్ మీద చిత్రీకరించబడిన పాట గువ్వా గువ్వా జాగ్రత్త గుడ్లగూబ చూస్తుంది కూడా సరదాగా సాగుతుంది . పాటల్ని సి నారాయణరెడ్డి , వేటూరి , జొన్నవిత్తుల వ్రాయగా బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , జానకమ్మ , నాగోర్ బాబులు శ్రావ్యంగా పాడారు .

నవ భారత్ ఆర్ట్స్ మూవీస్ బేనరుపై డి ప్రతాప్ రాజు నిర్మించిన ఈ జీవనజ్యోతి సినిమా 1988 అక్టోబరులో వచ్చింది . ఈతరం మహిళలకు కూడా నచ్చుతుందని నా నమ్మకం.. జయసుధ వంటి భార్యలు దొరికితే బాగుండు అనుకునే పురుష పుంగవులకు కూడా నచ్చవచ్చు .

సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడవచ్చు . సినిమా కూడా ఎక్కడా స్లో కాదు . రేలంగి వారు బాగా లాగించారు . నేను పరిచయం చేస్తున్న 1172 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు



Vasudha B Rao…… జీవన జ్యోతి… ఈ సినిమా పేరు వినగానే 1940లో తొలి తరం హీరో హీరోయిన్లు చదలవాడ నారాయణ రావు, కృష్ణ వేణిలతో మీర్జాపురం రాజావారు నిర్మించిన సినిమా ఎవరికీ గుర్తుకు రాకపోవచ్చు గానీ…

” జూజుజు జూజూ! జూజుజు జూజు.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు!” అంటూ 1975లో రెండో మహానటి వాణిశ్రీ అద్భుతంగా నటించి, శోభన్ బాబుతో కలిసి వెలిగించిన, నేటికీ దేదీప్యమానంగా వెలుగుతున్న కె విశ్వనాధ్ జీవన జ్యోతి చప్పున గుర్తుకొస్తుంది… ఇక ఈ జీవన జ్యోతి అయితే వాణిశ్రీ తర్వాత మహానటి స్థానాన్ని ఆక్రమించిన జయసుధ, శోభన్ లాంటి అందగాడు శరత్ బాబు జంటగా నటించిన సినిమా ఇది….



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఫ్యూచర్ సిటీ’ వైపు బాటలు చూపే గ్లోబల్ సమ్మిట్… రైజింగ్ తెలంగాణ..!!
  • పవర్‌ఫుల్ చట్టం IFA-2025 … అక్రమ వలసదారులు పరుగో పరుగు…
  • ఓ సాత్విక పెద్ద భార్య… ఓ గయ్యాళి చిన్న భార్య… ఓ జీవన జ్యోతి…
  • పారడాక్స్..! చమురు మార్కెట్‌లో అమెరికాకు ఇండియా ‘లెసన్’…!!
  • బన్నీ క్రేజ్ మామూలుగా లేదు… పుష్ప-2కు ఏడోసారీ రికార్డు వీక్షణలు…
  • వెలగపండు అందుబాటులోకి..! పర్‌ఫెక్ట్ సూక్ష్మ పోషకాల పండు…!!
  • ఎట్టకేలకు రాష్ట్రపతి సర్వాధికారాల్ని సుప్రీంకోర్టు గుర్తించి వెనక్కి తగ్గింది..!!
  • కేటీయార్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్…! ఏం జరుగుతోంది..?!
  • కృత్రిమం కృత్రిమమే… ఏఐతో జర జాగ్రత్త… గుడ్డిగా నమ్మొద్దు…!!
  • ‘‘రాజమౌళిని మించి తెలుగు హీరోకు ఎలివేషన్ ఇవ్వాలి ఎప్పటికైనా…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions