.
మిత్రుడు Mohammed Rafee పోస్టు ఒకటి ఆలోచనాత్మకం… ఆసక్తికరం… తను రాసింది దుశ్శల ఏకపాత్రాభినయం గురించి… నిజానికి పలు పౌరాణిక పాత్రల ఏకపాత్రాభినయాలు ఉంటాయి… కానీ దుశ్శలది పూర్తిగా భిన్నం, ఇంట్రస్టింగు…
పౌరాణిక పాత్రల్లోనూ పురుష పాత్రల ఏకపాత్రాభినయాలే ఎక్కువ కదా… బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించింది… 80 నిముషాలు పాటు నాన్ స్టాప్ హావభావ అభినయ హిందీ వాచకంతో ఆమె విశేషంగా ఆకట్టుకుంది…
Ads
ఒకసారి దుశ్శల పాత్ర గురించి అవలోకిద్దాం… మహాభారతంలో నూరుగురు కౌరవులకు ఏకైక సోదరి ఆమె… సైంధవుడి భార్య… సురథ తల్లి… ఆమె జీవితానికి అనేక షేడ్స్… నిజంగా ద్రౌపది, గాంధారి, కుంతి తదితరులకు దీటైన పాత్ర… కానీ ఆ పాత్ర పెద్దగా చర్చల్లోకి, తెర మీదకు రాదు… రాలేదు…
అన్ సంగ్ హీరోయిన్… ఆమె పట్ల విధి నిర్లక్ష్యాన్నే చూపింది… కరుకుగానే వ్యవహరించింది… పుట్టినప్పటి నుంచీ ఆమెపై అందరికీ నిర్లక్ష్యమే… కౌరవులకు ఇచ్చిన ప్రాధాన్యంలో ఆమెకు వీసమెత్తు కూడా దక్కలేదు… పోయి పోయి ఓ విలన్ సైంధవుడితో పెళ్లి… కుమారుడు సురథను కాపాడుకోవడానికి ఆమె అర్జునుడితో యుద్ధం వద్దని వేడుకుంటుంది కూడా…
దుశ్శల – కౌరవ-పాండవ వారసత్వ వారధి
కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది… కౌరవ వంశం సర్వనాశనం అయ్యింది… ధృతరాష్ట్రుడు, గాంధారి శోకసముద్రంలో మునిగిపోయారు… దుశ్శల భర్త, సింధు రాజ్యపు రాజు జయద్రథుడు, అర్జునుడి చేతిలో మరణించాడు… ఆమె కుమారుడు, సురథుడు, తండ్రి మరణ వార్త విని తీవ్ర దుఃఖంతో మరణించాడు…
దుశ్శల దుఃఖం
కురుక్షేత్రం తరువాత, మిగిలిన కౌరవులందరిలాగే, దుశ్శల కూడా అంతులేని దుఃఖంలో ఉంది… ఆమె తన వందమంది సోదరులను, తన భర్తను, తన కొడుకును కోల్పోయింది… మిగిలి ఉన్న ఆమె ప్రపంచం తన తల్లిదండ్రులు, ఆమె మనుమడు వృషసేనుడు మాత్రమే… తన సోదరుల పట్ల పాండవుల పగను ఆమె అర్థం చేసుకోగలిగినా, వ్యక్తిగతంగా ఆమె పడిన నష్టం చాలా పెద్దది…
యుద్ధం ముగిసిన తర్వాత, పాండవులు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నారు… వారి విజయం పట్ల దుశ్శలకు అసూయ ఉన్నా, ఆమె ప్రేమపూర్వకమైన నిజ వ్యక్తిత్వం ఎప్పుడూ నశించలేదు… ఒకసారి, పాండవులు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో, యాగాశ్వం సింధు దేశానికి చేరుకుంది… అశ్వాన్ని పట్టుకోవడం అంటే, పాండవులకు యుద్ధం ప్రకటించినట్లే… ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించేది దుశ్శల మనవడు, వృషసేనుడు…
అర్జునుడు, దుశ్శల భావోద్వేగ ఘట్టం
అశ్వాన్ని వృషసేనుడు బంధించడంతో, అర్జునుడు సింధు దేశానికి వచ్చాడు… అర్జునుడికి కోపం వచ్చింది… జయద్రథుడి మరణానికి ప్రతీకారంగా తన మనవడు యుద్ధానికి సిద్ధపడ్డాడని దుశ్శల భయపడింది… పాండవుల చేతిలో మరో యుద్ధం జరిగితే, తన రాజ్యమే నాశనం అవుతుందని ఆమెకు తెలుసు…
ఈ సమయంలో, దుశ్శల తన చిన్న మనవడిని తీసుకొని, అర్జునుడి కాళ్లపై పడింది…
“అర్జునా! నా సోదరా! మా వందమంది సోదరులను, నా భర్తను కోల్పోయాను. నీ చేతుల్లో మా రాజ్యమంతా ధ్వంసమైంది. మిగిలి ఉన్న ఈ ఒక్క బిడ్డ మా వంశంలో ఆఖరి దీపం. దయచేసి, నువ్వు మరోసారి యుద్ధం చేసి, నా ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టవద్దు… కౌరవులకైనా, పాండవులకైనా ఇలా మిగిలిపోయిన ఏకైక సోదరిని నేనే కదా…’’
దుశ్శల కన్నీళ్లు, ఆమె ఆక్రందన అర్జునుడి హృదయాన్ని కదిలించాయి… ఆమె దుఃఖం, ఆమె పడ్డ వేదన చూసి అర్జునుడు వెంటనే దుశ్శలను లేపి, “అక్కా! దుశ్శలా! నువ్వు నా సోదరివి… నాకు ప్రాణానికి ప్రాణమైన దానవు… నేను నీతో ఎప్పుడూ యుద్ధం చేయను… నీ మనవడు ఈ రాజ్యాన్ని సంతోషంగా పాలించనివ్వు… వాడు నాకు కొడుకుతో సమానం…” అని అభయమిచ్చాడు… దుశ్శల, కేవలం దుఃఖంతో నిండిన పాత్ర కాదు; ఆమె పాండవ-కౌరవ బంధానికి చివరి వారధిగా నిలిచింది…
Share this Article