.
బాబోయ్… భాషా వివక్షను, గేలిని, అపహాస్యాన్ని ఏళ్లుగా, దశాబ్దాలుగా ఎదుర్కుని… చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా సరే… ఎప్పటిలాగే తెలంగాణ భాషను, యాసను ఇంకా ఖూనీ చేస్తూనే ఉన్నారు తెలుగు సినిమాల్లో…
కొన్ని తెలంగాణ సినిమాల్లో తెలంగాణ యాస సహజంగా ఉంటుండగా… ఇంకొన్ని సినిమాల్లో తెలంగాణ యాసను ఖండఖండాలుగా నరుకుతున్నారు… ఉదాహరణ… అల్లరి నరేష్ నటించిన 12 ఏ రైల్వే కాలనీ సినిమా…
Ads
తెలంగాణ యాసను అల్లరి నరేష్‌తో పలికించడం ఏదో ప్లస్ పాయింట్ అనుకున్నట్టున్నారు పాపం నిర్మాత, దర్శకుడు… కానీ సదరు హీరో గారు ఏమాత్రం సాధన చేయలేదు, అంతా కృతకంగా పలికింది తన యాస… తెలంగాణ భాషాప్రేమికులకు ఏమాత్రం నచ్చలేదు… పైగా కోపం కూడా వస్తుంది…
ఈ యాస పలకడం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఎవరో పరిశోధకుడితో నాలుగు రోజులు వర్క్ షాపు నిర్వహించినట్టు కూడా నరేష్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు… మరి ఏమైపోయింది ఆ సాధన..?
అదే ఇంటర్వ్యూలో తనకు పుష్పకవిమానం సినిమాలో మాటల్లేని కమలహాసన్ పాత్ర చేయాలని ఉందనీ చెప్పాడు… అదేదో ఇదే సినిమాలో చేసేస్తే పోయేది, ఈ భాష ఖూనీని తెలంగాణ ప్రేమికులు భరించే బాధ తప్పేది…!!
హాయిగా తనకు మామూలు సినిమా భాషనే పెట్టొచ్చు కదా… ఇక్కడ ఓ క్లారిటీ… టిపికల్ హైదరాబాదీ స్లాంగ్‌ను జొన్నలగడ్డ సిద్దూ బాగా పలికిస్తాడు… ఆమధ్య చిత్తూరు యాసను ఏదో సినిమాలో నాని బాగా పలికాడు… తెలంగాణ యాసే కాదు… ఉత్తర కోస్తా, రాయలసీమ, టిపికల్ చిత్తూరు యాసల్ని ఎవరు ఖూనీ చేసినా తప్పే… చేతకానప్పుడు ఆ యాసల జోలికి పోవద్దు… అదీ ఇక్కడ చెప్పదలిచింది…
పోనీ, దానికేమైనా ప్రాముఖ్యం ఉందా..? అదీ లేదు..! కమెడియన్‌గా ఇక స్కోప్ లేదని, సీరియస్ పాత్రలకు మళ్లాడు… గుడ్… కానీ మరీ ఇలాంటి సినిమాలు ఏం చూసి ఒప్పుకుంటున్నట్టు..?! కుందన్ బాగ్ హౌజులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఓ కథ రాసుకున్నారు… కానీ ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేకపోయారు…
పొలిమేర రచయిత అందించిన కథ కాబట్టి ఏదో సస్పెన్స్ గట్రా గట్టిగానే ఉంటుందని ఆశిస్తే అదీ లేదు… పేరుకు ఈ జానర్ థ్రిల్లర్ కానీ అంత సీనేమీ లేదు… ఏదో అనుకోని మర్డర్… దాన్ని ఛేదించాలని చూసే ఓ పోలీస్ ఆఫీసర్… తను చివరకు ఏం కనుక్కున్నాడు అనేది కథ…
ఒకటీరెండు ట్విస్టులు ఉన్నా సరే… పెద్దగా ఎగ్జయిట్ చేయగల సీన్లు ఏమీ లేవు… కాస్త బెటర్‌గా ఉన్న క్లైమాక్సు తప్ప..! మరీ ఫస్టాఫ్ బోరింగ్‌గా ఉంది… కథలో మంచి పాయింట్ ఉన్నా, దాన్ని ప్రేక్షకుడికి కన్విన్సింగ్‌గా చెప్పడంలో స్క్రీన్‌ప్లే పూర్తిగా ఫెయిల్ అయింది… పైగా సీక్వెల్ ఉంటుందనే ఓ హింట్, అదీ అసలు హారర్ పాయింట్…
సరే, నరేష్ ఏదో ఆ పాత్రకు న్యాయం చేయడానికి బాగానే ప్రయత్నించినా… అసలు పాత్ర కేరక్టరైజేషనే గందరగోళంగా ఉంటే తనేం చేయగలడు..? పైగా ఆ యాస సమస్య ఉండనే ఉంది… మిగతా నటులు జస్ట్ వోకే… మెరిట్ ఉన్న కమెడియన్లు సద్దాం, గెటప్ శ్రీను, హైపర్ ఆది, వైవా హర్ష ఉన్నా జోకులు ఏమీ పేలలేదు…
చివరకు బీజీఎం కూడా సోసో… పాటలూ అంతే… ఇంతకు మించి చెప్పటానికి కూడా థ్రిల్లూ లేదు, ఏమీ లేదు ఈ సినిమాలో…
Share this Article