స్వాతి వీక్లీలో ఏముంటుంది..? ఏమీ ఉండదు… కానీ సరసమైన కథ ఉంటుంది… ఆ వీక్లీ హిట్టయింది దాంతోనే… ఒక సమరం ప్రశ్నలు-సమాధానాలు, ఒక సరసమైన కథ… వాటిల్లో చర్చించబడేవి సరసమైన అంశాలే… చెప్పుకునేవి శృంగారానికి సంబంధించిన విషయాలే… అయితేనేం..? అవేవీ ఒక కనిపించని గీత దాటవు… అందుకే రంజింపచేస్తయ్, రక్తికట్టిస్తయ్… బోల్డ్ కంటెంట్‌పైనే బోలెడు సంగతులు చెబుతయ్… గతంలో సంభోగాల్ని, అక్రమ సంబంధాల్ని వర్ణిస్తూ పచ్చిపచ్చిగా కథల్ని పబ్లిష్ చేసిన చిన్న చిన్న పుస్తకాలు దొరికేవి మార్కెట్‌లో… సేమ్, డిటెక్టివ్ నవలల సైజులో… అద్దె కాస్త ఎక్కువ… రహస్యంగా దాచుకుని చదివేవాళ్లు… ఇప్పుడంతా నెట్‌లో విశృంఖలమే కదా… బహిరంగ మార్కెటే కదా… మరి ఆ పచ్చి కంటెంటుకూ స్వాతి సరసమైన కథకూ నడుమ తేడా ఏమిటి..? మోతాదు..! ఎలాగూ బోల్డ్ కంటెంటే కదాని వల్గారిటీని పరిచేయకపోవడం…!
నైన్టీస్‌లో కన్నడంలో కాశీనాథ్ సినిమాలు వచ్చేవి… అనుభవం, వింత శోభనం, పొగరుబోతు పెళ్లం, సుందరాంగుడు… యువత ఎగబడి మరీ చూశారు… ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ఓరకం బోల్డ్‌నెసే కదా… ప్రత్యేకించి ఆ కేటగిరీ సినిమాలు అవసరం లేకుండా పోయింది… హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే ఇక వ్యాంప్ పాత్రలు దేనికి, కొత్తగా వేరే పాటలు దేనికి..? ఇప్పుడంటే మళయాళ సినిమాలు అంటే క్రియేటివ్ ప్రాజెక్టులుగా చూస్తున్నాం గానీ, ఒకప్పుడు మళయాళ సినిమా అంటే సరసమైన సినిమాలు… తెలుగులోకి డబ్ చేసి, మార్నింగ్ షోలు వేసేవాళ్లు… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే..? ఒకేతరహా కంటెంటును వల్గర్‌గా చెప్పడం లేదా సరసమైన రీతిలో చెప్పడం… కత్తి మీద సాము ఇది…
Ads
మన తెలుగులో చాలామంది చిన్న దర్శకులు, నిర్మాతలు ఈమధ్య బోల్డ్ కంటెంటుతో సినిమాలు తీస్తున్నారు… విచ్చలవిడిగా వల్గర్ సీన్లను గుప్పిస్తున్నారు… మోతాదు మరీ మించిపోయిన వెగటు… వాటిని చూడటానికి థియేటర్లకు వస్తారని ఎదవ ఆశ… చిన్న దర్శకులు అనేముంది ఆమధ్య ఎంఎస్ రాజు అనబడే ఓ పెద్దాయన కూడా ఈ బాట పట్టినవాడే కదా… ఈ ‘జబర్దస్త్’ తరహా చీప్ టేస్టు ఎవరికీ పెద్దగా వర్కవుట్ కాలేదు… కాదు, తెలుగు ప్రేక్షకులు హర్షించరు… మరి అలాంటి కంటెంటునే ‘ఏక్ మినీ కథ’ నిర్మాత, దర్శకుడు ఎంచుకోవడం సాహసమే… రెండురకాలుగా… వల్గారిటీని ఆశ్రయించకుండా స్వాతి కథలా చెప్పడం… ఇది ఒక సాము… అసలు ఈ కంటెంటు కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందా..? ఎలాగూ థియేటర్లు లేవు, ఓటీటీలే శరణ్యం… అందుకని సాహసించినట్టున్నారు…
కంటెంటు డిమాండ్ చేస్తున్నా సరే, ఎక్కడా దారితప్పలేదు… పచ్చిపచ్చిగా సీన్లను వండి వడ్డించలేదు… సున్నితంగా సబ్జెక్టు డీల్ చేస్తూనే, దానికి కామెడీ ఫ్లేవర్ కూడా యాడ్ చేసి వదిలారు… ఒక యువకుడు తన పురుషాంగం చిన్నగా ఉందనే ఆత్మన్యూనతలో పడి, నానారకాలుగా ప్రయాస పడటమే కథ… నిజంగానే చాలామంది యువకుల్లో ఉండే సమస్యే… ‘పెద్దది’ చేసుకొండి అనే ప్రకటనలు నెట్‌లో కోకొల్లలు… ఆ యాడ్స్ టార్గెట్ ఈ యువతే… ఈ సబ్జెక్టు చుట్టూ ఓ కథ అల్లి ప్రజెంట్ చేయడం సాహసమే… ఓ ప్రయోగమే… ఆ ప్రయత్నం చేసినందుకు ఏక్ మినీ కథ బాధ్యులకు అభినందనలు… మరి భిన్నమైన కథలు ఎలా వస్తయ్… ఎంతసేపూ ఆ పెద్ద హీరోల తలతిక్క ఫార్ములా సినిమాలేనా..? ఇవీ కథలేగా, సరిగ్గా చెప్పగలిగినప్పుడు…!!
ఓ మినీ కథను ‘పెద్దది’ చేయడానికి ప్రయాస పడ్డారు, దాంతో పలుచోట్ల సాగదీత… దీనికితోడు పేలవమైన సప్తగిరి కామెడీ… పెద్దగా ఉత్కంఠను రేపే ట్విస్టులు గట్రా లేకపోవడంతో… ‘పెద్ద’ సినిమా అయిపోయింది గానీ అసలు కథ అలాగే ‘చిన్న’గా ఉండిపోయింది… అందుకని సినిమా మరీ కనెక్ట్ కాదు ఎవరికీ… ఓటీటీయే కాబట్టి (అమెజాన్ ప్రైమ్) గతంలో బూతు పుస్తకాలు, ఇప్పుడు బోల్డ్ వీడియోలు చూస్తున్నట్టుగానే దీన్ని కూడా స్మార్ట్ ఫోన్లలో చూసేయాలి నెటిజనం… థియేటర్ ఎలాగూ లేదు, హోం థియేటర్‌కు పనికిరాదు… ఎలాగూ ఎక్కువ రేటుకే అమ్మేసుకున్నారు కాబట్టి, నాలుగు డబ్బులు మిగిలాయి కాబట్టి… ఇలాంటి సరసమైన ‘పెద్ద’ కథలు మరిన్ని వస్తాయేమో… ఓటీటీలు కూడా ఇలాంటివే ఇష్టపడుతున్నాయి కదా…!! ప్రత్యేకించి సోనీ, జీ5 కంటెంటులో అధికభాగం ఇలాంటిదే..!! ఇంతకీ పురుషాంగం సైజుకూ సంభోగ సుఖానికీ సంబంధం లేదనే క్లారిటీ ఇచ్చాడా దర్శకుడు..? ఏమో, మీరే చూడండి…
Share this Article