Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాల్పనిక కథను మించి..! జీవితాన్ని మించిన మెలోడ్రామా ఏముంటుంది..?

November 23, 2025 by M S R

.

తెలుగు సినిమా సీన్ వన్… ఆ సినిమా పేరు మీరే గుర్తుతెచ్చుకొండి…. హీరో తల మీద దెబ్బ తగిలింది ఏదో ఫైట్ సీన్‌లో… అంతే, తనెవరో మరిచిపోయాడు, ఎడ్డిమొహం వేశాడు… తరువాత విలన్ నుంచి మరో దెబ్బ పడింది… ఆ దెబ్బకు మళ్లీ తనెవరో గుర్తొచ్చింది… ఇక విలన్‌ను బాదడం మొదలుపెట్టాడు…

.

Ads

మరో సీన్… ఆ సినిమా పేరూ మీరే గుర్తుతెచ్చుకొండి… హీరోకు ప్రమాదం, తలకు దెబ్బ.,. గతం మరిచిపోయాడు… కథ మొత్తం మారిపోయింది… పాత హీరోయిన్ ఏడుపు… కొత్తగా మరో హీరోయిన్ వచ్చి జతకలిసింది… తరువాత మరో ప్రమాదం, మళ్లీ తలకు దెబ్బ… పరుగెత్తి పాత హీరోయిన్ ఒళ్లో పడ్డాడు… సెకండ్ హీరోయిన్ దిగంతాల వైపు వెళ్లిపోతుంది… త్యాగమయి…

.

మూడో సీన్, నాలుగో సీన్… ఇలా ఇండియన్ సినిమా తెర మీద ఈ కథలు బోలెడు చూశాం, హిట్ చేశాం… కానీ లాజిక్కులు వెతకలేదు… ఇది రచయిత బ్లండరా, వండరా అని కూడా హాశ్చర్యపోలేదు… కానీ అది వండరే… ఆ వండర్ ఇప్పుడు నిజంగానే చోటుచేసుకుంది మన ఇండియాలోనే… అందరూ ఇదేం వండర్ అని ఆశ్చర్యపోతున్నారు…

వివరాల్లోకి వెళ్దాం… ఇది సినిమా కథకన్నా ఆసక్తికరంగా ఉంది…

మొదటి దెబ్బ: జ్ఞాపకాలు మాయం

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మా జిల్లా, నది గ్రామానికి చెందిన రిఖి రామ్ 1980లో తన 16వ ఏట ఉపాధి కోసం హరియాణాలోని యమునా నగర్‌కు వెళ్లి ఒక హోటల్లో పనికి కుదిరాడు… ఓ రోజు అంబాలాకు వెళ్తుండగా అతను భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు… తలకు బలంగా గాయం కావడంతో, తన పేరును, గ్రామాన్ని, కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు…

ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యాలు లేకపోవడంతో, అతని కుటుంబం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది… తమ రిఖి రామ్ చనిపోయాడని భావించి, కన్నీళ్లతో ఇక మరిచిపోయారు… తన జ్ఞాపకాల్ని వదిలేశారు… అతని తల్లిదండ్రులు కూడా కొన్నేళ్ల తర్వాత తమ కొడుకు బతికే ఉన్నాడని తెలియకుండానే చనిపోయారు…

కొత్త జీవితం: రవి చౌదరి

ప్రమాదం తర్వాత, రిఖి రామ్‌ తన గతాన్ని మరిచిపోయాక… వేరే చోటికి వెళ్లిపోయాడు… అక్కడ తనతోపాటు పనిచేసే స్నేహితులు అతని అసలు గుర్తింపు తెలియక, అతనికి రవి చౌదరి అని కొత్త పేరు పెట్టారు… గతం ఏదీ గుర్తులేని రవి, ముంబైకి, ఆపై మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లి అక్కడ ఒక కాలేజీలో ఉద్యోగం సంపాదించాడు…

  • వివాహం…: 1994లో సంతోషి అనే యువతిని పెళ్లాడాడు.

  • కుటుంబం…: వారికి ముగ్గురు పిల్లలు – ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు…

హిమాచల్‌లో తానొక కుటుంబాన్ని వదిలి వచ్చాననే ఒక్క చిన్నపాటి ఫ్లాష్‌బ్యాక్ కూడా లేకుండా, రవి చౌదరి నాందేడ్‌లో ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకున్నాడు….

రెండవ దెబ్బ: గతం ప్రత్యక్షం

కొన్ని నెలల క్రితం, అతని జీవితంలో మరో అనూహ్య సంఘటన జరిగింది… రవి చౌదరి తలకు మరోసారి చిన్నపాటి దెబ్బ తగిలింది... ఈ దెబ్బ తీవ్రమైనది కానప్పటికీ, ఇది అద్భుతాన్ని సృష్టించింది… ఒకప్పుడు మాయమైన గతం మెరుపులా అతనికి గుర్తుకు రావడం ప్రారంభమైంది….

అతని కళ్ల ముందు తన చిన్ననాటి దృశ్యాలు మెదలడం మొదలైంది…

  • తన గ్రామంలోని మామిడి చెట్టు

  • ఇరుకైన పల్లె దారులు

  • సటౌన్ అనే ప్రాంతం పేరు, ఇంట్లోని వాకిలి.

అవి కేవలం కలలు కాదని, తాను మర్చిపోయిన జ్ఞాపకాలని రవి అర్థం చేసుకున్నాడు…

rikhiram

ఇంటికి ప్రయాణం

తన జ్ఞాపకాలను నిజం చేసుకునే ఆశతో, రవి తన భార్య సంతోషితో ఈ విషయాలను పంచుకున్నాడు… తన కాలేజీలోని ఒక విద్యార్థి సహాయంతో ‘సటౌన్’, ‘నది గ్రామం’ గురించి ఆన్‌లైన్‌లో వెతికాడు… ఆ అన్వేషణలో, సటౌన్‌లోని ఒక కేఫ్‌కు సంబంధించిన ఫోన్ నంబర్ దొరికింది…

రవి ఆ నంబర్‌కు కాల్ చేయగా, గ్రామ పెద్ద అయిన రుద్ర ప్రకాష్ తో మాట్లాడగలిగాడు… ఒక్క కాల్ అనేక మందికి చేరి, చివరకు అతని కుటుంబ బంధువైన ఎం.కె. చౌబే వరకు ఈ విషయం వెళ్లింది… రవి చెప్పిన చిన్ననాటి వివరాలను బట్టి, అతను తమ రిఖి రామ్ అని వారు నిర్ధారించుకున్నారు…

భావోద్వేగ కలయిక

అలా 45 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, 61 ఏళ్ల రిఖి రామ్ తన భార్యాపిల్లలతో కలిసి నవంబర్ 15న తన సొంత గ్రామమైన నదికి తిరిగి వచ్చాడు…

  • ఆత్మీయ స్వాగతం…: రిఖి రామ్ రాకతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది… డ్రమ్ములు, పూలమాలలు, కేరింతల మధ్య రిఖిని స్వాగతించారు…

  • కుటుంబ ఆనందం…: తన సోదరులు – దుర్గా రామ్, చందర్ మోహన్, సోదరీమణులు – చంద్రమణి, కౌశల్య దేవి, కలా దేవి, సుమిత్ర దేవి – రిఖిని చూసి కన్నీళ్లతో కౌగిలించుకున్నారు… ఎప్పుడో చనిపోయాడని అనుకున్న తమ సోదరుడిని తిరిగి చూడటం తనకు ఇది రెండో జన్మ లాంటిదని గ్రామస్తులు, బంధువులు ఆనందం పంచుకున్నారు…

ఇంత సుదీర్ఘ కాలం తర్వాత జ్ఞాపకశక్తి తిరిగి రావడం అనేది చాలా విస్మయకరమైన, అరుదైన సంఘటన అని, ఇలాంటి సందర్భాలను వైద్యపరమైన సంభావ్యతను ఇప్పుడప్పుడే చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు… ఏదైతేనేం… రిఖి రామ్ జీవితం ఒక ఇండియన్ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోస్ట్ చేయడానికీ డబ్బుల్లేవ్… ఆమె తన హెయిర్ డ్రయర్ అమ్మేసింది…
  • కాల్పనిక కథను మించి..! జీవితాన్ని మించిన మెలోడ్రామా ఏముంటుంది..?
  • తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో… మంచాలిక దిగండోయ్ కొక్కొరొకో…
  • ఇవేం బంధాలు..? ఇవేం పంచాయితీలురా బిగ్‌బాస్ బాబూ…!!
  • లొట్టపీసు కేసు కాదు..! కేటీయార్ పక్కాగా ఫిక్సవుతున్న పెద్ద కేసు..!!
  • ఇదేమీ పాత్రికేయ ఘన పురస్కారం కాదు… జస్ట్, డబ్బు కక్కుర్తి యాడ్..!!
  • పరువు, పగ వికృతకోణం… కలుక్కుమనిపించే క్లైమాక్స్… ప్రేమ గెలవలేదు…
  • పవన్ కల్యాణ్, ఇదుగో ఓ సరికొత్త సనాతన ధర్మసారథి వస్తున్నాడు..!
  • బీఆర్ నాయుడు… కనీసం ఈ అపహాస్యపు శివజ్యోతినైనా శిక్షించగలడా..?
  • ఏమయ్యా నరేషూ… మరీ తెలంగాణ యాసను అంత ఖూనీ చేయాలా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions