.
అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? పంజాబ్ బీజేపీయేతర పార్టీలు బీజేపీ మీద గెలుపు సాధించినట్టు ఎందుకు సంతోషపడుతున్నయ్..? నిజంగానే నాడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసుకుని, జాతికి క్షమాపణ చెప్పినట్టు చండీగఢ్ పంచాయితీపైనా తప్పు చేశాడా మోడీ..?
ఒకసారి వివరాల్లోకి వెళ్దాం… చండీగఢ్‌ను పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన… దానికోసం రాజ్యాంగసవరణకూ సిద్దపడింది… కానీ ఆలోచన, ప్రతిపాదన దశలోనే ఉంది… బిల్లు లేదు, చట్టం లేదు… పార్లమెంటులో పెట్టిందీ లేదు…
Ads
చండీగఢ్ పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని… దీని పాలన పంజాబ్ గవర్నర్ చూస్తాడు… తను చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఈ నగరానికి… అంటే, గవర్నర్ పాలిస్తున్నాడు అంటేనే కేంద్రం పాలిస్తున్నట్టు కదా… మళ్లీ కేంద్ర పాలిత ప్రాంతం అన్నట్టే కదా… కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం దేనికి..? ఇది కదా ప్రశ్న..?
కాస్త వివరాల్లోకి వెళ్లాలి… మన దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్, నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ, లడఖ్, లక్షద్వీప్… వీటికితోడు పుదుచ్చేరి, ఢిల్లీ… పలురకాలు ఇవి…
– ఢిల్లీ (NCT), పుదుచ్చేరి, జమ్ము-కాశ్మీర్‌లకు పాక్షిక రాష్ట్ర హోదా… పరిమిత అధికారాలున్న కేబినెట్ ఉంటుంది… కానీ శాంతిభద్రతలు సహా కీలకాధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్లవే… చండీగఢ్ పాలనకు పంజాబ్ గవర్నర్… లడఖ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూలపై కేంద్ర ప్రత్యక్ష పాలన…
(ఇంతకుముందు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా మారినవి హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర… మొన్నామధ్య ఆర్టికల్ 370 రద్దు చేశాక దీనికి రివర్స్… జమ్ము-కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు…)
చండీగఢ్ పాలనలో తేడాలు
ప్రస్తుతం చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతమే అయినప్పటికీ, ఇటీవల జరిగిన చర్చంతా ఉద్యోగుల నియామకం, పాలనా విధానంలో మార్పులు తీసుకురావడం గురించే…
చండీగఢ్ పాలన యంత్రాంగంలో పనిచేసే సివిల్ సర్వెంట్లు (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, పోలీసులు మొదలైనవారు) సాధారణంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి Pro-rata basis తీసుకున్నవారు లేదా పంజాబ్ కేడర్‌కు చెందినవారు ఎక్కువగా ఉండేవారు… ఇది ఆయా రాష్ట్రాలకు ఈ ప్రాంతంపై పరోక్ష నియంత్రణ ఉండేలా చేసేది…
కేంద్ర ప్రభుత్వం చండీగఢ్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం కేంద్ర సివిల్ సర్వీస్ (Central Civil Service) నియమాలను వర్తింపజేయాలని నిర్ణయించింది… అదీ అసలు వివాదం…
దీనివల్ల కేంద్రం ప్రత్యక్ష నియంత్రణ పెరుగుతుంది… ఉద్యోగులు పంజాబ్ లేదా హర్యానా కాకుండా, పూర్తిగా కేంద్ర సర్వీసుల నియంత్రణలోకి వస్తారు… అంటే, వారి సర్వీసు నిబంధనలు, పదవీ విరమణ వయస్సు, ప్రమోషన్లు వంటివన్నీ నేరుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది…
చండీగఢ్ పరిపాలనపై పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఇప్పటివరకు ఉన్న పరోక్ష ప్రభావం (తమ రాష్ట్రాల ఉద్యోగుల ద్వారా) తగ్గిపోతుంది… వారు ఇకపై చండీగఢ్ పరిపాలనలో తమ సిబ్బందిని డిప్యుటేషన్‌పై పంపే పద్ధతి దాదాపుగా తగ్గిపోతుంది…
పాలనకు ఓ లెఫ్టినెంట్ గవర్నర్ వస్తాడు… చండీగఢ్ తమకే కావాలని పంజాబ్ ఏనాటి నుంచో పోరాడుతోంది కాబట్టి సహజంగా పంజాబ్ ప్రధాన పార్టీలు అకాలీదళ్, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ వ్యతిరేకించాయి… బీజేపీ ఏం చేసినా వ్యతిరేకించాల్సిందే అనే ధోరణిలో ఉండే కాంగ్రెస్ శృతికలిపింది… అసలే ఖలిస్థాన్‌వాదం మళ్లీ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ కొత్త పంచాయితీ ఎందుకులే అనుకుని కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది… అదీ కథ…
నిజానికి చాన్నాళ్లుగా ఓ చర్చ ఉంది… సారాంశం ఏమిటంటే..?
ఢిల్లీ రాష్ట్రాన్ని రద్దు చేసి, రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలి… ఆప్ వంటి జాతి వ్యతిరేక ధోరణులు కలిగిన పార్టీ గుప్పిట్లో దేశ రాజధాని ఉండటం ఎప్పటికైనా ప్రమాదకరం… అసలే దేశానికి ఉగ్రవాదం, జాతి వ్యతిరేకవాదం ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి కాబట్టి…
ప్రపంచంలోని చాలా దేశాల రాజధాని నగరాలు (ఉదాహరణకు, అమెరికాలోని వాషింగ్టన్ D.C. లేదా ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా) కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి… స్థానిక ప్రభుత్వం ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక నియంత్రణ ఉంటుంది…
మొన్నటి పహెల్‌గామ్ దుర్మార్గం తరువాత అసలు జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ, రాష్ట్ర హోదాల్ని కూడా రద్దు చేసి, పూర్తిగా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని అనేది మరో వాదన… ఇది దేశ రక్షణ, అంతర్గత భద్రతకు ముఖ్యం… కానీ బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ రాష్ట్ర హోదా ఇస్తానని గతంలో కమిటైంది…
లక్షద్వీప్, అండమాన్, నికోబార్ రాను రాను దేశరక్షణకు కీలకం అవుతున్నాయి… వాటిని సమీపంలోని రాష్ట్రాల్లో విలీనం చేయడం బెటరనే పాత వాదనలు ఇప్పుడు వినిపించడం లేదు… డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను సమీప రాష్ట్రాల్లో కలిపేయడం బెటర్… చండీగఢ్ లొల్లి, ఇదుగో ఇదంతా మళ్లీ తెర మీదకు తీసుకొస్తోంది..!!
Share this Article