ఆరోజే మోహన్ని రమ్మని పిలిచారు ఎన్టీయార్.
డిసెంబర్ చలి.
దేశమంతా పార్లమెంటు ఎన్నికల వేడి.
Ads
రాజీవ్ గాంధీ గాలి.
తెలుగుదేశమంతటా ఎన్టీఆర్ వడగాలి.
ఉదయం పత్రిక ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది.
ఆ క్షణం కోసం ఏడాదిగా చాలామంది ఎదురుచూస్తున్నారు.
పదేళ్ళుగా వస్తున్న ‘ఈనాడు’ ఎన్టీఆర్ కి ఎన్నికల ప్రచారం చేయడం, తర్వాత ఆగష్టు సంక్షోభంలో ఉద్యమ పత్రికగా రావడం, ఆ తర్వాత గూడా అధికార పత్రికలాగే తయారయింది. దాసరి సారథిగా, ఎబికె ఎడిటర్ గా ఉదయం వస్తోందని ఆంధ్రదేశంలో ఎదురుచూసిన ఏడు కోట్ల జతల కళ్ళకి పద్నాలుగు కోట్ల కాయలు కాసినా ఇంకా పేపరు రాదే… వెంటబడి వచ్చిన ఏజెంట్లు బండబూతులు తిడుతున్నారు… ఎబికె గారు తొందర తొందరగా మమ్మల్నందరినీ ఏడాదికి ముందే జేర్చేశారు. ఇందిరాగాంధీ హత్య జరిగినా… ఇంకోచోట పెళ్ళి జరిగినా మాకు పేపర్ లేదు.
మధ్యలో షూటింగ్ కాన్సిల్! పేకప్ అని దాసరి లొకేషన్ మార్చేస్తాడు గురూ అని పుకార్లు.
సబ్ ఎడిటర్ ట్రైనీలూ, రిపోర్టర్లూ, ఎలాగోలా బతుకుదామని ఏదో ఒక చిన్న ఉజ్జోగంలో చేరిన జనం… ఎవడి గోల వాడిది. అంతా గందరగోళం, మందలమేళం.
ఆరోజు పేపరు ప్రారంభోత్సవ సభకి గవర్నర్ ని, ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఎన్నికల ఫలితాలు వరసగా వచ్చి పడుతున్నాయి. రాజీవ్ గాంధీ టూ థర్డ్ మెజారిటీ వేపు ఈదేస్తున్నాడు. ఆంధ్ర ఫలితాలింకా రాలేదు. గవర్నర్ పత్రికని ఆవిష్కరించాలి. మొదటి కాపీని దాసరి నారాయణరావు, ఎన్టీ రామారావుకి స్టేజి మీద అమ్ముతారు. ఎన్టీఆర్ రెండు రూపాయలిచ్చి కొంటారు (ఇద్దరూ పాపులిస్టులే కదా! అందుకే ఇలాంటి ఐడియాలు)
ఆవిష్కరణకి ముందు అచ్చయిన ఎడిషన్ లో కార్టూన్ వేశా. కాంగ్రెస్ హస్తం గుర్తులో ఒక అదృష్టరేఖ బైటికెళ్ళి మెట్లుగా మారి అధికార పీఠం వేపు వెళ్తూంటే రాజీవ్ ఆ మెట్ల మీద ఠీవిగా నడుస్తుంటాడు. హస్తంలోని కింది గీత దరిద్రరేఖగా మారి కిందికి జారిపోతుంది. పేదవాడొకడు ఆ రేఖని పట్టుకు వేలాడుతుంటాడు. కానీ, ఆవిష్కరణ సభలో మొదటి పేజీలో ఈ కార్టూన్ వస్తే అందులో న్యూస్ ఏముంటుంది. అందుకని కొత్త ఎడిషన్ కి కార్టూన్ మార్చా. భక్తుడైన గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ ఆమధ్యనే తిరుపతిలో గుండు చేయించుకున్నారు. రాయలసీమ టూర్ లో పెద్ద యాక్సిడెంట్ జరిగి తలపై గాయమయిన ఎన్టీఆర్ కూడా గుండు చేసుకోవాల్సి వచ్చింది. విలేజ్ లెవెల్ ఆఫీసర్లకి సంబంధించి ముఖ్యమంత్రి పంపిన ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకుండా గవర్నర్ టలాయిస్తున్నారు. అది తాజా లోకల్ రాజకీయ సమస్య. కనుక కార్టూన్ నిండా ఇద్దరు గుండు వాళ్లని క్లోజుల్లో వేసి మధ్య వి.ఎల్.ఓ.లు నలిగి పడిపోతున్నట్టు వేశా.
దాసరి తన జీవితం గురించీ ఉదయం కల గురించి చాల ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ పత్రిక కాంపౌండ్ చుట్టూ వీధుల్లో తానొకనాడు సైకిలేసుకు తిరుగుతూ ఉద్యోగం దొరక్క నానా తంటాలూ పడ్డాననీ, చివరికిప్పుడు ఇక్కడే దినపత్రిక ప్రారంభించానని అనేసరికి మా ఆఫీసు బోయ్ లూ, ప్లేట్ మేకర్లూ, పాకర్లూ కళ్ళనీళ్ళ పర్యంతమయిపోయి చప్పట్లు కొట్టేశారు.
ఎన్టీఆర్ ఇక చెప్పనక్కర్లేదు. నాటకీయంగా నవరసాలొలింకించేశారు. ఉదయం పత్రికల పేకెట్ రిబ్బన్ ను గవర్నర్ కత్తిరించారు. దాసరి పత్రికను తీసుకుని ఎన్టీఆర్ కి అందించారు. ఆయన లాల్చీ రెండు జేబులూ వెదికి (బూడిద కాకుండా) రెండ్రూపాయలు తీసి దాసరి చేతిలో పెట్టారు. స్టేజీ పైనా, ఆడియన్స్ లో అందరికీ పేపర్లు అందాయి. తెలుగురాని శంకర్ దయాళ్ శర్మ మొదటి పేజీ చూసి పక్కనే ఉన్న సి నారాయణరెడ్డిని ఏదో అడుగుతున్నారు. సినారె జవాబుతో ఇద్దరూ నవ్వుకుంటున్నారు. స్టేట్జ్ పక్కనే ఉన్న నేను, సినారె దగ్గరకెళ్ళా. ‘గవర్నర్ కార్టూన్ చూసి ఏదో అంటున్నారు? ఎనీ కామెంట్స్?’.. అనడిగా. సినారె మళ్ళీ శర్మగారి పక్కకి వంగి మాట్లాడి మళ్ళీ నవ్వుతూ ఆయన మీ కార్టూన్ ని బాగా ఎంజాయ్ చేశానంటున్నారు. ఇక నో కామెంట్స్ అని చెప్పారు. ఎన్టీఆర్ ఆ కార్టూన్ని దీక్షగా చూస్తున్నారు గానీ నవ్వటం, అల్లాటివేవీ జరగలేదు.
సభ పూర్తికాకముందే మా జర్నలిస్టులూ, నైట్ డ్యూటీ పక్షులందరం తిరిగి ఎడిటోరియల్ సెక్షన్ కి పోయి ఐటమ్ లూ, రిజల్ట్సూ అంటూ హడావుడి పడుతున్నారు. ఆవిష్కరణ కోసం వేసిన కార్టూన్ టెంపరరీ గనక ఎన్నికల ఫలితాల మీదు మరో కార్టూన్ కి స్కెచ్ గీస్తున్నా. రిజల్ట్స్ పూర్తిగా రాకపోయినాసరే రాష్ట్రంలో ఎన్టీఆర్ కి చాలా సీట్లు వచ్చే ట్రెండ్ కనిపిస్తోంది. కనక దేశంలో ప్రత్యర్థులందర్నీ ఒక్కచేత్తో నరికిన పెద్ద రాజీవ్ హస్తాన్ని చిన్న ఎన్టీఆర్ నరుకుతున్నట్టు ఒక క్రూడ్ కార్టూన్ మొదలెట్టా. ఇంతలో ఫోనొచ్చింది. సి.ఎమ్. గారి సెక్రటరీ నండీ. మిమ్మల్ని బయల్దేరి అబిడ్స్ లోని ఇంటికి రమ్మంటున్నారు – అని చెప్పారు.
రాత్రి 11 అయింది.
నా కార్టూన్ అప్పుడే మొదలయింది.
పూర్తయిన తర్వాత అదే ఎడిటర్ కిస్తానని గ్యారంటీ లేదు. బాలేదనుకుంటే మళ్లీ ఇంకొకటి వెయ్యాలి. పైగా తెల్లారే పాఠకులు చూసే ‘ఉదయం’ మొదటి కార్టూన్ అదే అవుతుంది. చాల ఇబ్బందిపడుతూ, ఇంకా డ్యూటీ అవలేదని, రేపు రాగలనని చెప్పా. మళ్ళీ ఆ సెక్రెటరీ ఎన్టీఆర్ తో మాట్లాడి ఉదయమే
4 గంటలకు రాగలరా? అనడిగారు. తెల్లారే నాలుగు గంటలేంటి? ఎన్టీఆర్ టైమ్ కదా అనుకుని, తప్పకుండా అన్నా. మా ఇంటి అడ్రను చెప్పా. రాత్రి రెండు దాటినా ఆఫీసులోనే ఉండి, ఇంకా బోలెడు బొమ్మలేసి ఇంటికెళ్ళా. నిద్ర పోయినట్టు అనిపించనేలేదు. ఎన్టీఆర్ ఇంటి నుంచి కారొచ్చింది. అబిడ్స్ కెళ్ళా. హాల్లో కూచోమన్నారు. ఐదు నిముషాల్లో వేడివేడి కాఫీ వచ్చింది. చాలా బావుంది. బెజవాడ బాబాయ్ హోటల్ కాఫీ బావుంటుందా, ఇది బావుందా తేల్చుకోలేకపోయా. మరో కప్పు కావాలంటే ఏం బావుంటుంది.
కిక్కురుమనకుండా ఊరుకున్నా…
ఇంతలో కబురొచ్చింది. గదిలోకెళ్ళా.
సోఫాలో ఎన్టీఆర్ కాలు మీద కాలేసుకుని కూచున్నారు. దర్జాగా కాదు. పైకాలు మీద కాయితాలూ, పాడ్ పెట్టుకుని ఏదో రాస్తున్నారు. అటూఇటూ రెండు సోఫాలున్నాయి. ఒక దాంట్లో చంద్రబాబు నాయుడు కూచుని ఉన్నారు. ఎదురుగా ఉన్న సోఫా చూపించి, నన్నూ కూచోమని సైగ చేశారు ఎన్టీఆర్. (అలా కూచోమని అన్నా ఎవరూ కూచోరట… తర్వాత తెలిసింది) వెంటనే కూచుందును గదా మెత్తటి సోఫాలో లోపలికి దిగబడిపోయా. మోకాళ్లు గెడ్డానికి తగిలినంత పనయింది. తేరుకుని సర్దుకుని ఎదురుగా చూస్తే చంద్రబాబు నన్ను తీక్షణంగా చూస్తున్నాడు. (నిజంగా అలా చూస్తున్నాడా? లేక చూపే అంతా? లేక నేనే అలా ఊహించుకుంటున్నానా నాకర్థం కాలేదు) బాబు బొత్తిగా మాట్లాడ్డంలేదు. ఎన్టీఆర్ అడిగినదానికి ఔననో, కాదనో మోనో సిలబల్స్ అనడం, తల ఊపడం, చుట్టూ కలియజూడ్డంతో చాలాసార్లు ఇబ్బందిపడ్డా. ఎన్టీఆర్ ప్రారంభించారు.
ఉదయంలో నువ్వేనా కార్టూనిస్టువి బాబూ (బాబూ ఏవిటి చంటిపిల్లాడి లాగా! మీ అల్లుడు బాబు వయసుంటుంది నాకు. పైగా దశాబ్దిన్నర అనుభవంగల జర్నలిస్టుని అందామనుకున్నా గానీ ఎన్టీఆర్ వయసు, అనుభవం, ఆ పర్సనాల్టీ ముందు నేనెంత). నీదేవూరు. నాన్నగారెవరు? మొదటి నుంచీ కార్టూనిస్టువేనా? నీకు దాసరి గారు జీతమిస్తారా? బొమ్మకింతని పే చేస్తారా?- లాంటి అనేక వివరాలు అడిగారాయన. ఎవడో కోన్ కిస్కా కార్టూనిస్టు గురించి అన్ని వివరాలడగడం ఆశ్చర్యమనిపించినా సమాధానాలు సుదీర్ఘంగా చెప్పాను. నాన్న ట్రేడ్ యూనియన్ లీడరనీ, విశాలాంధ్ర ప్రొడక్ట్ ననీ, చండ్ర రాజేశ్వర్రావుకి నేనంటే బోల్డు ఇష్టమనీ, అదే పార్టీ కుర్రాడిననీ, ఆంధ్రప్రభలో మీమీద చాలా కార్టూన్లు వేశాననీ చాలా చాలా చెప్పేశా.
తెల్లారింది. పేపర్లొచ్చాయి.
ఆయన బేనర్లు చూసి పక్కనపెట్టాడు.
(ముఖ్యమంత్రి కాకముందు ఆమాత్రం కూడా చూసేవాడు గాదని అందరూ చెప్తారు…)
“అసలు పనికొద్దాం. ఈనాడు, ఇతర పేపర్లకి పార్టీ ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా’ అనేది శీర్షిక. పక్కన నేను చేయి ముందుకు చాపి ఉన్న బొమ్మ తెలుసు గదా అది ఉంచి, కింద ఈ మేటర్ ను అందంగా పేర్చాలి. చదువుతా” అంటూ ఆయన క్లిష్టమైన అంత్యప్రాసల్లాంటి వాక్యాలతో అరడజను స్లోగన్స్ చదివాడు. నిజానికి ఐదింటిలో యతిగానీ, అంత్యప్రాసలు గానీ తిన్నగా లేవు. మీరనుకున్నట్టు మాత్రాబద్ధంగా లేవుగదా అనేసి, జడుసుకుని చంద్రబాబు వంక చూశా. ఆయన ఎప్పటిలాగే నావంక చూస్తున్నాడు. ఎన్టీఆర్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా, మరి వాక్యాల చివర ఈ పదాల బదులు ఏముంటే బావుంటుంది? అనడిగారు. నేను వెళ్ళి ఒక్కో వాక్యానికి చివరి రెండు మూడు పదాలు చెప్పాను. ఆయనకి సొంపుగా వినిపించిన పదాల్ని స్వయంగా కాయితం మీదే రాశారు. ఎన్టీఆర్ సెట్లో ఉంటే సొంత డైలాగులు చెప్పేస్తారని, డైరెక్టర్ నీ, రచయితనీ లెక్కచేయడని, నిరంకుశుడనీ అంటారు గదా! అలాంటిదేం కనిపించలేదు. తను రాసిన వాక్యాలు కొట్టేసి నేను చెప్పిన మాటలు రాయడానికి ఆయన క్షణంలో సగం కూడా సంకోచించలేదు. అలాగే ఆహా! ఏమిదీ అయ్యారే.. అంటూ కృతకంగా మాట్లాడతాడని కూడా అందరం అనుకుంటాం. (అనుకోడమేంటి! కొన్ని టీవీ షోల్లో ఇంటర్వ్యూల్లో ఆయన అలాగే అతి చేసేవాడుగదా!) నాతో మాట్లాడినప్పుడూ, స్లోగన్స్ చదివేటపుడు గూడా అలాటి వాసన తగల్లేదు. చాలా మామూలుగా అచ్చం మనలాగే మాట్లాడాడు.
చాలా గంటలున్నానేమో తెల్లగా తెల్లారింది. డిజైన్ ఈరోజే తయారుచేసి అర్జెంట్ గా ఇవ్వాలన్నారు. ఓయస్ అని చెప్పి ముందు నా జేబులోంచి ఆరోజు వచ్చిన ఉదయం కార్టూన్ ఒరిజినల్ తీసి సంతకం పెట్టమని అడిగా. ఆయన వెంటనే పెన్ తీసి, నా కార్టూన్ ఒళ్ళో పెట్టుకుని ఒక మూల ఖాళీ ఉన్న చోటు వెతికి పెన్ను మోపి… ఎందుకో ఆగారు.
“కాదు బాబూ, నా రంగుల చిత్రం గీసి తీసుకురా.
సైన్ చేస్తా”నన్నారు. అలాగే అంటూ ఆ కార్టూన్ వెనక్కి తీసుకున్నా..
డిజైన్ పూర్తి చేసి మధ్యాన్నం మళ్ళీ ఆయనింటికెళ్లా. ఆయన సెక్రటేరియట్ లో ఉన్నారు. ఫోన్ చేస్తే నన్ను ఇంట్లోనే ఉండమనీ, వెంటనే బయల్దేరి వచ్చేస్తున్నానని చెప్పారు.
ఏం చీఫ్ మినష్టరో, ఏమో!
సెక్రటేరియట్ లో సవాలక్ష పనులు గదా!
పైగా ఎన్నికల ఫలితాలు తెరలు తెరలుగా వస్తున్నాయి. ఎన్టీఆర్ పేరిట నిలబడ్డ కాకులు గూడా కావుకావుమంటూ ఎంపీలుగా ధంపింగ్ గా గెలిచిపోతున్నారు. ఆర్నెల్ల క్రితం ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన ఎన్టీఆర్ ని భారతదేశమంతా మరోసారి నివ్వెరపోయి చూస్తోంది. ఆయన పెద్దపెద్ద అంగల్లో చలాకీగా మెట్లెక్కి వచ్చాడు. ఉక్కిరిబిక్కిరయేంత పెద్ద విజయం.
ఆయన జీవితంలోనే మళ్లీ అలాటిదెప్పుడూ సాధించలేడేమోనన్నంత కిక్కులో ఉండాలి గదా… ఎన్టీఆర్ ఆ క్షణంలో అస్సలు అలా లేనేలేడు.
చాల మెల్లిగా, ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు.
నా దగ్గరకొస్తే లేచి నించున్నాను.
నా నడుం చుట్టూ చెయి వేసి ఆయన గదిలోకి కాకుండా డైనింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు. ఉదయం లోపలి పేజీల్లో గూడా ఆరోజు కార్టూన్లన్నీ చూశానని చెప్పాడు.
“నీకు మంచి రేఖ ఉంది. బాగా కృషి చెయ్యి. భగవంతుడు నీవెంట ఉన్నాడు” అని చెప్పాడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య లాంటి గొప్ప కమ్యూనిస్టు నాయకుల జీవితాలతో, చరిత్రలతో పోలిస్తే తాను చాలా చిన్నవాణ్ణనీ, ముఖ్యమంత్రినయినా, ఎన్నికల్లో ఇంత విజయం సాధించినా వారికి సాటిరాలేనని… అలా చెప్పుకుపోతున్నాడు. అదంతా పూర్తిగా గుర్తులేదు కూడా. ఆయన మాట్లాడుతున్నదానికీ, ఆనాటి అఖండ విజయానికీ బొత్తిగా సంబంధం లేదు.
చాల ఫిలసాఫికల్ గా అయిపోయాడు మనిషి. నోస్టాల్జిక్ గా మాట్లాడుతున్నాడు. రాజకీయాల గురించి అందులో ఏం లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర మా ఇద్దరి పచార్లూ అయ్యాయి. ఆయన చెయ్యి నా భుజం మీద చాలా భారంగా ఉంది. ఆ పెద్ద పర్సనాలిటీకి చంకలోకొచ్చాన్నేను. అటెటో చూస్తూ మాట్లాడుతున్నాడు. తల పైకెత్తి ప్రొఫైల్ చూస్తే ఆయన దవడ, చెవి పక్కనుంచి మెడ మీద జుట్టు జారే ప్రాంతానికి మధ్య చాల దూరం ఉంది. చాల బలమైన, దృఢమైన ఏరియా. ఆయన కార్టూన్ ఇంతకాలం నుండి వేస్తున్నా ఇంత ముఖ్యమైనదాన్ని ఎలా మిస్సయ్యానా, వెధవాయిని అని తిట్టుకున్నా. తర్వాత వేసిన నా కార్టూన్లలో ఆటోమేటిక్ గా ఈ ఎగ్జాజరేషన్ చేసేవాణ్ణి. ఎన్టీఆర్ తాత్విక ప్రసంగం సాగిపోతూనే వుంది. మాట్లాడుతూనే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీని చేత్తో తిప్పి ఓ కాలు దాని మీద మోపాడు. మోకాలు మీదికి పంచె లాగాడు. అమెరికాలో చేసిన ఆపరేషన్ చార తొడ మీద కనిపిస్తోంది. నా భుజం మీద ఆయన చెయ్యి భారం ఇంకా పెరిగి పోతోంది (భూకైలాస్ సినిమాలో శివుడి ఆత్మలింగం లాగా) నేల మీద ఆయన కాలొకటి, పక్కనే నించున్న నా రెండు కాళ్లు.
ఇంతలో మెట్ల మీద కలకలం.
పార్లమెంట్ కు ఎన్నికయిన వాళ్ళు, వాళ్ల మనుషులూ సందడిగా వస్తున్నారు. వొంటినిండా గులాల్, చేతుల్లో పూలదండలు, ఎన్టీఆర్ జిందాబాద్ అనే నినాదాలతో గుంపులు గుంపులుగా తోసుకొచ్చేసి తిన్నగా ఎన్టీఆర్ ఒంటికాలి మీద సాష్టాంగపడి పోతున్నారు. పక్కనే ఉన్న నా కాళ్ళకి కూడా వాళ్ళు చేతులు తగుల్తుంటే చాల ఎంబరాసింగ్ గా ఉంది. కానీ ఈయన ఉడుంపట్టు నుంచి భుజం బెసికే సందే లేదు.
జనం వస్తూనే ఉన్నారు.
ఆయన అందర్నీ దీవిస్తున్నాడు.
కొందర్ని పేరుపేరునా పలకరిస్తున్నాడు.
ఇక ఎక్స్ క్లూజివ్ చాట్ కి వీల్లేదు.
‘డిజైన్ ఓకే గదా. నేను వెళ్తానండీ అన్నా. అలాగేనన్నాడు. గుంపు పక్కనుంచి దూరి వెళ్లిపోతున్న నన్ను మళ్ళీ మోహన్ అని పిలిచాడు. “నా రంగుల చిత్రం మరిచిపోవద్దు” అన్నాడు. తలవూపి బయటపడ్డాను.
ఆయన పిచ్చిగానీ ఎంతోమంది ఆర్టిస్టులు ఆయన పోర్త్రైట్లు వందలాదిగా గీశారు. నేనెందుకూ గియ్యడం అనుకొన్నా. అందుకే ఎప్పుడూ వేయలేదు. ఆయన్ని మళ్ళీ ఎన్నడూ కలవలేదు కూడా!
నాలుగైదు రోజులు ఆయనకి వ్యతిరేకంగా కార్టూన్లు వేయడానికి మనసొప్పలేదు. ఆయన గురించి బయట విని అనుకున్నదానికీ, వెళ్లి చేసిందానికీ అంత తేడా కనిపించేసరికి చాలా రోజులు తేరుకోలేదు.
– Mohan, Artist
Share this Article