.
ఈరోజే కదా మనం చెప్పుకున్నది… పౌరాణిక పాత్రలు, మంత్ర శక్తులు వర్సెస్ దైవిక శక్తులు అనే జానర్ ఇండియన్ సినిమాను ఎలా ఊపేస్తున్నదో… ఈ నేపథ్యంలోనే మరో సినిమా గురించి తప్పక చెప్పుకోవాలి ఓసారి…
గ్రాఫిక్స్, లీలలు, యాక్షన్, మహత్తు… ఇవే కదా… కానీ పూర్తి భిన్నంగా… దేవుడు మనిషిని పశ్చాత్తాపం వైపు, ఆత్మమథనం వైపు ఎలా ఆలోచింపచేస్తాడో హత్తుకునేలా చెప్పిన ఈ సినిమా గురించి చెప్పుకోవాలి… ఇందులో దేవుడి లీలలు ఉండవు… మనిషిని సరైన బాటలోకి మళ్లిస్తాడు… కష్టాల దశ దాటాక, ప్రశాంత జీవనం ఎంత మేలో చూపిస్తాడు…
మరో రెండు అద్భుతమైన విశేషాలున్నాయి ఈ సినిమాకు సంబంధించి… సినిమా పేరు లాలో, కృష్ణ సదా సహాయతే… గుజరాతీ సినిమా… అసలు ఆ భాషలో వచ్చే సినిమాలే చాలా తక్కువ… చిన్న బడ్జెట్లు, తక్కువ ప్రేక్షకులు… కానీ ఇది అపూర్వమైన విజయం పొందిన సినిమా…
Ads
శంకరాభరణం వంటి సినిమాలు మొదట్లో ఎవరూ చూడక, ఇక థియేటర్లలో నుంచి తీసేసే టైమ్‌కు, మంచి మౌత్ టాక్‌తో ఎంతటి ఘనవిజయాల్ని నమోదు చేసుకున్నాయో మనం చదువుకున్నాం కదా… ఇది అంతకుమించి… జస్ట్, ఒక వండర్…
- ఏ 300 కోట్లో పెట్టి, ప్రభుత్వాల కాళ్లు పట్టుకుని, టికెట్ రేట్లు పెంచుకుని, ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టి ఏ ఆరేడు వందల కోట్లో వసూళ్లు చూపిస్తే… మహా అయితే పెట్టిన పెట్టుబడికి జస్ట్, రెట్టింపు… అంతేకదా…
- కానీ ఈ గుజరాతీ – పక్కా ప్రాంతీయ సినిమా జస్ట్ 50 లక్షల పెట్టుబడితో… ఏకంగా 100 కోట్లు సంపాదించబోతోంది… ఆల్రెడీ 75 కోట్లు వచ్చేశాయి… అంటే 20 వేల శాతం లాభం… బహుశా ఈ రికార్డు ఏ సినిమాకూ లేదేమో..!!
కథ జనాన్ని ఎలా బలంగా కనెక్ట్ కావాలో ఒక సుకుమార్, ఒక రాజమౌళి, ఒక బోయపాటి ఎట్సెట్రా ఈ సినిమా చూసి నేర్చుకోవాలి… అతిశయోక్తులు, అట్టహాసాలు, స్మగ్మర్లను గ్లోరిఫై చేయడం, దిక్కుమాలిన స్టెప్పులు, మానవాతీత యాక్షన్ సీన్లు, వ్యక్తి పూజ, చరిత్రల వక్రీకరణలు, ఆరబోతలు, ఐటమ్ సాంగ్స్ కాదురా బాబూ…
మొదటి వారం ఈ సినిమా కలెక్షన్లు ఎంతో తెలుసా..? కేవలం 26 లక్షలు… అంటే రోజుకు 4 లక్షలలోపు సగటున… కానీ తరువాత వారం, ఆ మరుసటివారం కాస్త పుంజుకుంది… ఇక 4, 5 వారాల నుంచి జనం థియేటర్ల వైపు తరలిరావడం మొదలైంది… నాలుగో వారం పెరుగుదల 1800 శాతం… 50 రోజులయ్యేసరికి 75 కోట్ల వసూళ్లు… మన తెలుగు ఘనులకు 75 కోట్లు అనేది పీనట్ కావచ్చు… కానీ గుజరాతీ వంటి పరిమిత ప్రేక్షకులుండే రీజనల్ ఫిలిమ్‌కు అది చాలా చాలా ఎక్కువ…
కానీ కేవలం 50 లక్షల బడ్జెట్… ఏ వారణాసి సినిమా గ్లింప్స్ కోసమే 5 కోట్లు ఖర్చు పెట్టే ఘనత మనది… అంటే 10 సినిమాల తీయొచ్చు లాలో వంటివి… సరే, ఈ సినిమా కథేమిటో తెలుసా..? ఓ సగటు మనిషి… లాలో (కరణ్ జోషి) తన అహంతో, తన మూర్ఖత్వంతో చాలా తప్పులు చేస్తాడు… భార్యతో ఓసారి మద్యం మత్తులో గొడవపడి, ఇల్లు వదిలి వెళ్లిపోతాడు…
అలా ఓ అడవిలోని రహస్య ఇంట్లోకి వెళ్తాడు… తనొక్కడే, బయటికి దారి లేదు, తప్పించుకునే దారి లేదు, తిండి లేదు, నీళ్లు లేవు… ఒంటరితనం, భయం, ఆత్మమథనం తనను పశ్చాత్తాపం వైపు తీసుకుపోతాయి… తను ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు అనే మథనం అది…
అప్పుడొస్తాడు కృష్ణుడు… అంటే వెలుగు… అర్జునుడికి కురుక్షేత్రం మధ్యలో గీతోపదేశం చేసినట్టు… ఆ సగటు మనిషి మారిపోతాడు… ఇక్కడ దేవుడి లీలలు కావు, సగటు తెలుగు సినిమా మార్క్ యాక్షన్ ఉండదు… జస్ట్, కౌన్సిలింగ్… కౌన్సిలింగ్… అదీ ప్రశాంతంగా, అన్నీ అవగతమయ్యేట్టు… మనసులోని, మనిషిలోని అసలు చీకటిని మనిషే పారద్రోలుకునేలా మార్చడం..!!
Share this Article