.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేకు ముందు బీసీసీఐ ముఖ్యులు భారత జట్టు హెడ్ (వెయిట్) కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లతో భేటీ వేస్తారట… వేసి, జట్టు సమస్యలు ఏమిటో విశ్లేషించి, మరేం చేద్దాం అని పరిష్కారా మార్గాలు అన్వేషిస్తారట…
టెస్టుల్లో వైట్ వాష్ తరువాత కలిగిన జ్ఞానోదయమేనా ఇది..? దేశమంతా క్రికెట్ ప్రేమికులు నెట్‌లో బూతులు తిడుతున్న ఫలితమా ఇది..? అసలు సమస్యే గౌతమ్ గంభీర్ కదా, తనతో వేరే సమస్యల పరిష్కారాలు ఆలోచించడం, చర్చించడం ఏమిటీ అనేది నెటిజనం వదులుతున్న ప్రశ్న…
Ads
దురదృష్టవశాత్తూ ఈ గౌతమ్ గంభీర్ ఐసీసీ జైషాకు సన్నిహితుడు… ఇక గంభీర్‌పైన గంభీరమైన యాక్షన్ ఏముంటుంది..? ఏదో మొక్కుబడి భేటీలు, సమీక్షలు కాకపోతే..,!
గంభీర్ మీద ప్రధాన ఆరోపణ… పొగబెట్టి సీనియర్లను ఇంటికి పంపించడం… కేవలం కొత్త వాళ్లతోనే ఆడించడం… నిజానికి ప్రపంచంలో ఏ జట్టయినా సీనియర్లు, జూనియర్ల నడుమ సమతూకం ఉండేలా చూసుకుంటుంది… ఎందుకంటే..?
సీనియర్ల మార్గదర్శనం కొత్తవాళ్లకు అవసరం… అదే సమయంలో వరుస విజయాలూ అవసరం కాబట్టి..! ఒక్కో సీనియర్‌ను గ్రాడ్యుయల్‌గా పంపించేస్తూ, వాళ్ల స్థానాల్లోకి మెరిట్‌ను బట్టి కొత్త వాళ్లను తీసుకురావడం జరగాలి… గ్రాడ్యుయల్ ట్రాన్సిషన్…
24 నెలల్లో 30 మంది ఆటగాళ్లను పరీక్షించిన సెలక్షన్ విధానం తీవ్రంగా విమర్శించబడుతోంది… ఇది జట్టులో స్థిరత్వం, నమ్మకం, కంటిన్యువిటీ అన్నింటినీ నాశనం చేసిందని మాజీ ప్లేయర్లు కూడా ప్రశ్నిస్తున్నారు…
ఆ సోయి లోపించింది గంభీర్‌లో..! అందుకే తన ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి… నిన్నటి మ్యాచే తీసుకొండి… ఇక వాళ్ల పని అయిపోయింది అనే ముద్రలు వేయబడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంత బలంగా ఇన్నింగ్స్ నిర్మించారో…
దక్షిణాఫ్రికా చివరి బంతి వరకూ పోరాడే ప్రొఫెషనల్ జట్టు… మనవాళ్లు 340 ప్లస్ చేస్తే, వాళ్లు 11 పరుగులకు మూడు వికెట్లు పడిపోయిన స్థితిలోనూ విశ్వాసాన్ని దిగజార్చుకోలేదు… దాదాపు లక్ష్యానికి చేరువగా వచ్చారు… అలాంటి జట్టుతో ఆడాలంటే మరి సీనియర్లు కూడా ఉండాలి కదా… నిన్నటి మ్యాచ్ తెలియజెప్పింది అదే కదా…
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్, ఆ తరువాత వన్డే ప్రపంచకప్ ఉన్నాయి… ఇప్పటి నుంచే ఓ మంచి జట్టును ట్రెయిన్ చేయాల్సి ఉంది… గంభీర్ పిచ్చి పిచ్చి ప్రయోగాలు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయి… జైషా, రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు గంభీర్ మీద యాక్షన్ తీసుకోగలదా..?
ఇప్పటికైనా గంభీర్‌లో ఆ సోయి ఉందా..? నిజానికి గంభీర్ ఎప్పటిలాగే కేకేఆర్ కోచ్‌గా మాత్రమే కొనసాగితే బెటర్… ఎవరెవరు ఏ బ్యాటింగ్ ఆర్డర్‌లో రావాలో కూడా కోచే చెబితే ఇక కెప్టెన్ దేనికి..? ఏయే ప్లేయర్ ఏ ప్లేసులో ఫీల్డింగ్ చేయాలో కూడా నువ్వే చెప్పు అనే జోక్స్ కూడా పేలుతున్నయ్ గంభీర్ మీద…
ఆమధ్య వాషింగ్టన్ సుందర్‌కు అసలు ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు… బ్యాటింగుకు పంపిస్తే, కసి తీరా సెంచరీ చేశాడు… తనతో గంభీర్ ఆడుకుంటున్నాడు… గంభీర్ కోసమే ఆడబడుతున్న ప్లేయర్ హర్షిత్ రాణా అనే విమర్శ కూడా ఉంది… ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు…
ఈ విమర్శలకు బీసీసీఐ మన జట్టు ‘మార్పు’ దశలో ఉంది, గంభీర్ మీద నో యాక్షన్ అని తేల్చిపడేస్తోంది… సో, బీసీసీఐ భేటీతో ఒరిగేదేమీ లేదు… కాకపోతే నిన్నటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చూశాక… ప్రత్యేకించి రో-కో వచ్చే వరల్డ్ కప్‌లో ఖచ్చితంగా ఆడుతారనే అనిపిస్తోంది… మాజీ క్రికెటర్లు, క్రికెట్ ప్రేమికుల మద్దతు పుష్కలంగా ఉంది వాళ్లకు ప్రస్తుతం..!!
Share this Article