.
Nàgaràju Munnuru ….. == తెలంగాణ ఇక క్యూర్, ప్యూర్, రేర్… ==
భారతదేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తయ్యే 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమితో అభివృద్ధి చెందిన దేశంగా మారాలని కేంద్రంలోని మోదీ సర్కార్ “వికసిత్ భారత్ 2047” అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
Ads
ఈ లక్ష్యాన్ని సాధించాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేయడం ముఖ్యమని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు అనుగుణంగా యావత్ తెలంగాణ రాష్ట్ర భూభాగాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రధాన భాగాలుగా విభజిస్తూ ఒక విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తుంది.
ఈ మూడు ప్రణాళికలను క్రోడీకరిస్తూ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను ఈ నెల 8, 9 తేదీలలో ఫ్యూచర్ సిటీలో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నారు. ఏమిటీ క్యూర్, ప్యూర్, రేర్?

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)
హైదరాబాదు నగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు (ORR). ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, GHMC.. ఇలా నాలుగు రకాలుగా సాగుతున్న పరిపాలనను సమన్వయం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను GHMC లో విలీనం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాదు నగర పరిధిలో మెట్రో రైలు విస్తరణ, మూసి పునర్జీవనం, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి పనులతో పాటు చెరువులు, కుంటలు, నాలాల ప్రక్షాళన, నగరంలో అనేక రకాల కాలుష్యాలకు కారణం అవుతున్న పరిశ్రమలను ORR అవతలకు తరలించి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా పట్టణ జీవనానికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు.

పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)
హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల రీజినల్ రింగు రోడ్డు కూడా రాబోతుంది. ఓఆర్ఆర్ 162 కిలోమీటర్లు ఉంటే రీజినల్ రింగు రోడ్డు సుమారు 360 కిలోమీటర్లతో తెలంగాణకు మరో మణిహారం కాబోతుంది.
ఓఆర్ఆర్ మరియు ఆర్ఆర్ఆర్ పరిధి మధ్యలో గల ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంగా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు, మాన్యుఫాక్చరింగ్ జోన్ గా ఉంటుంది.
రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)
రీజినల్ రింగు రోడ్డుకు అవతల నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల వారిని భాగస్వాములు చేయడమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం, పండ్లు కూరగాయల సాగు, విత్తనోత్పత్తి, పాడి పరిశ్రమ, అగ్రికల్చర్ పార్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం కల్పిస్తారు.
ఈ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. – నాగరాజు మున్నూరు
Share this Article