.
Prasen Bellamkonda ….. ఈ సంవత్సరపు మాటగా Rage bait ను ఆక్స్‌ఫర్డ్ ఖరారు చేసింది. Aura farming, bio hack అనే మాటలు (పదబంధాలు) కూడాదీనితో పాటు ఫైనల్ కు చేరితే ఆక్స్ఫర్డ్ సంస్థ వాటిని ప్రజాభిప్రాయానికి పంపితే మూడింట్లో rage bait గెలిచింది.
సోషల్ మీడియా సంస్కృతిలో కొత్త పదాలు పుట్టి, పాపులర్ అవడం కొత్త విషయం కాదు.
ఈ ఏడాది
rage bait,
aura farming,
bio-hack
అనే మూడు పదాల మధ్య జరిగిన ప్రజాభిప్రాయ పోటీలో చివరకు rage bait ఆక్స్‌ఫర్డ్ మాటగా ఎంపిక కావడం మన సోషల్ మీడియా స్వభావానికి అద్దం పడుతోంది.
Ads
రేజ్ అంటే కోపం.
బెయిట్ అంటే ఎర.
కోపాన్ని ఎరగా వేసి, కోపం తెప్పించడాన్ని ఎర గా వేసి, ఇతరులను ఆకర్షించడం అన్నమాట.
rage bait అంటే ఉద్దేశపూర్వకంగా పెట్టే, కోపాన్ని రెచ్చగొట్టే కంటెంట్, వివాదాస్పద శీర్షికలు, ఆగ్రహం రేపే పోస్టులు, కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు పుట్టించే పోస్టుల లాంటివనమాట. దీని ప్రధాన లక్ష్యం ఒకటే. కృత్రిమ భావోద్వేగ ప్రతిస్పందన ద్వారా పెద్ద ఎత్తున లైక్ లు, కామెంట్లు సంపాదించడం. ఇది రాజకీయాల నుంచి సినిమా చర్చల వరకు విస్తరించి, ప్రతి వేదికలో వైరల్ సంస్కృతికి ప్రధాన ఇంధనంగా మారింది.
టీచర్లు జీతం తీసుకోకుండా పనిచేయాలనే వాదన వినిపిస్తోంది. మీరేమంటారు? అనడం
ఎక్కడో వేరే దేశంలోని అందమైన వీధుల ఫోటో పోస్ట్ చేసి… ఎవరన్నారు మన ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని. ఇది చూడండి! అనడం
మీకు ఇష్టమైన ఇడ్లీ అనే అల్పాహారాన్ని ప్రభుత్వం నిషేధించబోతోంది తెలుసా! అనడం
లాంటివి రేజ్ బెయిట్ కిందకు వస్తాయి.
దీని వెంట aura farming అనే పదం సోషల్ మీడియాలో ఇమేజ్ మేకింగ్‌కి ప్రత్యామ్నాయం గా మారింది. ఆధ్యాత్మికత, మంచితనం, ‘పాజిటివ్ వైబ్స్’ అని పిలిచే కృత్రిమ నైతిక ప్రకటనల ద్వారా ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ఇమేజ్ పెంచుకోవడం. నిజమైన అనుభవం కంటే ప్రదర్శనకు విలువ పెరిగినప్పుడు ఈ పదం విస్తరించింది. ఇలాంటి పోస్టులలో అన్నీ అబద్దాలే ఉంటాయిట.
ఆరా అంటే దేవుళ్ళ బొమ్మల చుట్టూ తల వెనుక ఒక మెరుపుల చక్రం గిరాగిరా తిరుగుతుంటుందే అదీ. ఫార్మింగ్ అంటే పంట కదా. ఆ మెరుపుల చక్రాలను మన నెత్తి వెనుక మనమే పెట్టేసుకోవడం అనమాట.
ఒక కవి నా గురించి అందరూ మరిచిపోతున్నారు. నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని పోస్ట్ పెట్టి, తద్వారా నిన్నెవరు మరువగలరు నువు తోపు తోపేష్ తోపున్నర, అసలు నిన్ను మించిన వారే లేరు, నువు పుట్టక ముందే మహాకవివి, నువు శ్రీశ్రీ ప్లస్ తిలక్ ఇంటూ శివారెడ్డి అనే కామెంట్లను రాబట్టడం
గత రెండ్రోజులుగా నేను నీషే ని మరోసారి చదువుతున్నాను అని బుక్ ఫోటో పెట్టడం,
లేదూ ఎక్కడిదో ఒక ప్రశాంతమైన గది ఫోటో, ఒక కాఫీ కప్పు ఫోటో పోస్ట్ చేసి నాకు జనం కన్నా ఏకాంతం ఇష్టం అని నటించడం
ఒక అడవి ఫోటో పెట్టి నేను మట్టి మనిషిని ప్రపంచంతో నాకు పనిలేదు అని ఫేకడం
హిడ్మా మరణానికి కొన్ని వేల టియంసి ల మొసలి కన్నీళ్లు పారించడం
తెల్లవారు జామున జిమ్ చేస్తూ విజేతలు ముందే మేలుకుంటారు అని కొటేషన్ కొట్టడం.. లాంటివి. ఇవి కూడా చాలా అబద్దాలే.
bio hack మాత్రం వ్యక్తిగత శారీరక మానసిక పనితీరును మెరుగుపర్చడానికి జీవశాస్త్ర పద్ధతులు, గాడ్జెట్లు, డైట్లు ఉపయోగించే ప్రయత్నాలను సూచిస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని డిజైన్ చేసుకోవడం పట్ల ఆకర్షణ పెరగడంతో ఈ పదం ప్రచారంలోకి వచ్చింది.
నా ఓటయితే ఆరా ఫార్మింగ్ కే అయుండేది.
అన్నట్టు నా ఈ పోస్ట్ కూడా ఆరా ఫార్మింగ్ లోకే వస్తదా?
Share this Article