Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్టింగ్ ఆపరేషన్ పేరుతో హనీట్రాప్… మలయాళీ చానల్ అత్యుత్సాహం…

December 4, 2025 by M S R

.

Bhavanarayana Thota …. స్టింగ్ ఆపరేషన్ పేరుతో హనీ ట్రాప్: మలయాళీ చానల్ అత్యుత్సాహం

కొన్ని టీవీ చానల్స్ పాపులర్ కావటానికీ, రేటింగ్స్ సంపాదించు కోవటానికీ అడ్డదారులు తొక్కుతాయన్నది చాలామంది అభిప్రాయం. అలాంటి అభిప్రాయం కలగటానికి కారణం అడపాదడపా చూస్తున్న సంఘటనలే.

Ads

కొద్ది రోజులకిందట బైటపడ్డ రేటింగ్స్ స్కామ్ గురించి చెప్పుకుంటున్నప్పుడే ఆ స్కామ్ బైటపడ్డ కేరళలో జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా గుర్తొచ్చింది. అది కూడా పెద్ద ఎత్తున దుమారం రేపటం ఒక వంతయితే, అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగటం మరోవంతు. అందుకే ఇప్పుడు ఆ సంచలనాన్ని గుర్తు చేస్తున్నా.

*****
రీజినల్ న్యూస్ చానల్స్ బాగా పెరిగిపోతున్న సమయమది. మలయాళంలో అప్పటికే ఏషియానెట్, కైరాలి, మనోరమ, జైహింద్, రాజ్ న్యూస్ మలయాళం, రిపోర్టర్, మాతృభూమి న్యూస్, మీడియా వన్ టీవీ, జనం టీవీ, న్యూస్ 18 కేరళ పేర్లతో పది ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ చానల్స్ నడుస్తున్నాయి…

అయినా సరే, కొత్తగా మరో 24 గంటల శాటిలైట్ న్యూస్ చానల్ తీసుకురావటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. కేరళ లాంటి చిన్న రాష్ట్రంలో ఇంకో న్యూస్ చానల్ కు చోటుందా అనే చర్చ మొదలైంది.

ఆర్ అజిత్ కుమార్ అనే జర్నలిస్ట్ మాత్రం “తొలగి తోవెవడిచ్చు తోసుకొనిపోవలయు” నన్న కాళోజీ మాటలను తన చానల్ ప్రయత్నాలకు అన్వయించుకున్నాడేమోగాని స్వయంగా రంగంలోకి దూకాడు. ఎండీ అండ్ సీఈవోగా ‘మంగళం’ పేరుతో ఒక న్యూస్ చానల్ పెట్టటానికి సిద్ధమయ్యాడు. ఆయన లెక్కలు ఆయనవని అందరూ సర్దిచెప్పుకొని ఆ చానల్ రాకకోసం ఎదురుచూశారు.

2017 మార్చి 26 రానే వచ్చింది. స్వయానా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ముఖ్య అతిథిగా ఆ చానల్ ప్రారంభించారు. ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ముగిసిన వెంటనే రెగ్యులర్ చానల్ ప్రసారాలు మొదలయ్యాయి. నలుగురు సభ్యులున్న ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉద్వేగం, ఉత్సాహం నింపుకొని ఆ క్షణాల కోసం ఎదురుచూస్తోంది.

యాంకర్, ఇద్దరు విశ్లేషకులతోబాటు అదే చానల్ లో పనిచేసే మహిళా జర్నలిస్టును కూడా పానల్ లో కూర్చోబెట్టారు. మహిళల పట్ల అధికార హోదాలో ఉన్నవాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో చెబుతూ, సరిగ్గా 11.15 కు ఒక ఆడియో క్లిప్ ప్రసారం చేశారు.

ఒక పని కోసం సాయం కోరుతూ వెళ్ళిన సాధారణ గృహిణితో కేరళ రవాణా శాఖామంత్రి శశీంద్రన్ మాట్లాడినట్టు యాంకర్ పరిచయం చేశారు. నిజానిజాల సంగతి పక్కనబెడితే ఆ బూతు మాటలు అలా ప్రసారం చేయకూడదన్న ఇంగితజ్ఞానం కూడా చానల్ పెద్దలకు లేకపోవటం ఆ తరువాత పెద్ద చర్చకు దారితీసింది.

అదలా ఉంచితే.. ఈ మాటలు విన్న మహిళా జర్నలిస్ట్ ‘అల్ నిమా అష్రఫ్’ కు ఏదో అర్థమైంది. పానెల్ నుంచి వెళ్లిపోతానని సైగ చేసింది. కాసేపు ఆగమని యాంకర్ అడిగినా, అలా అసహనంతో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆమెకు ముళ్లమీద కూర్చున్నట్టుంది.

ఏమైతేనేం కట్టలు తెంచుకుంటున్న ఆమె కోపానికి సూచనగా మైక్ తీసి విసిరి పారేసి విసవిసా స్టూడియో నుంచి బైటికి నడిచింది. వెంటనే తన ఫేస్ బుక్ ఖాతాలో అసలు విషయం రాసి చానల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.

“మంగళం చానల్ ప్రారంభానికి చాలాకాలం ముందే రిక్రూట్ చేసుకున్నవాళ్ళలో నేనూ ఉన్నాను. మాలో ఐదుగురితో ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. కానీ అది నిజమైన ఇన్వెస్టిగేషన్ కాదనిపించి అభ్యంతరం చెప్పాను. నన్ను ఆ టీం నుంచి తప్పించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు.

తీరా ఈరోజు మహిళల మీద వేధింపుల గురించి డిబేట్ అని నన్ను కూర్చోబెట్టి ఒక ఆడియో క్లిప్ వేశారు. మంత్రి శశీంద్రన్ మాటలు రికార్డయిన ఆ ఆడియోలో మంత్రితో మాట్లాడింది ఎవరో గుర్తు తెలియని గృహిణి కాదు. ఇన్వెస్టిగేషన్ టీం లో భాగస్వామి అయిన మా రిపోర్టరే. ఆమె అలా దిగజారి ఈ హనీ ట్రాప్ లో పాల్గొనటం, మేనేజ్ మెంట్ ఆమెనలా ఒప్పించటం చాలా దారుణం. ఇలాంటి అనైతికమైన చానల్ లో నేను కొనసాగలేక తప్పుకుంటున్నాను”

అప్పటికే ఈ ఆడియో క్లిప్ జనంలోకి వెళ్ళింది. 71 ఏళ్ల వయసున్న మంత్రి ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడారన్న వార్త క్షణాల్లో వ్యాపించింది. గంట కిందట తాను ప్రారంభించిన చానల్ లోనే తన మంత్రివర్గ సహచరుడి మీద తీవ్రమైన అభియోగాలు రావటంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సీఎం ఆదేశం మేరకు మంత్రి శశీంద్రన్ రాజీనామా చేశారు.

ఈలోపు మంగళం సబ్ ఎడిటర్ అల్ నిమా అష్రఫ్ ఫేస్బుక్ పోస్ట్ కూడా పెను సంచలనంగా మారింది. మంత్రి వెంటనే మీడియాతో మాట్లాడుతూ తాను నిర్దోషినని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జ్ తో విచారణకు ఆదేశించింది.

జర్నలిస్టులు ఈ ఆడియో ప్రసారం మీద తీవ్రంగా స్పందించారు. నిజంగా బాధితురాలు ఉంటే ఫిర్యాదు చేశారా? ఇద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణ వార్త అవుతుందా? బాధితురాలు అంటున్న ఆ మహిళ మాటలు ఎడిట్ చేసి అతి తక్కువగా మాత్రమే ప్రసారం చేయటం నిజం కాదా? ఎంతో కాలంగా సాగుతున్న సంభాషణల్లో కొన్ని భాగాలు ఎడిట్ చేసి ఎలా ప్రసారం చేశారు? అంటూ జర్నలిస్టు సంఘాలు ప్రశ్నించటం మొదలుపెట్టాయి.

అభ్యంతరకరమైన మాటలు ప్రసారం చేసే ముందు కనీసం ఒక హెచ్చరిక చేయాలన్న ఇంగితం కూడా లేదా అని అడిగిన వాళ్ళు ఇంకొంతమంది. మొత్తం జర్నలిజానికే మాయని మచ్చగా మిగిలిందంటూ ఈ ఘటన మీద చానల్స్ లో డిబేట్స్ పెట్టారు. ఇద్దరు వ్యక్తుల సంభాషణను రహస్యంగా ఎలా రికార్డు చేస్తారంటూ మహిళా సంఘాలు ప్రశ్నించాయి.

పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీఈవో తోబాటు ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సాయంత్రం అరెస్ట్ ప్రకటించారు. మొదట్లో బుకాయించినా, సీఈవో అజిత్ కుమార్ అది స్టింగ్ ఆపరేషన్ లో భాగమని, తమ ఉద్యోగి చేతనే మాట్లాడించామని, కావాల్సిన విధంగా ఎడిట్ చేశామని ఒప్పుకోకతప్పలేదు.

అయితే, ఆ ఉద్యోగి ప్రైవేసీ కాపాడటానికి పేరు వెల్లడించటం లేదన్నాడు. కనీసం ఈ విషయంలోనైనా నైతికత చూపాడని మిగతా జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. జర్నలిస్టు సంఘాలకు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాడు.

అరెస్ట్ అయిన నెల రోజుల తరువాత రెండో ప్రయత్నంలో వీళ్ళకు బెయిల్ వచ్చింది. మొదటి రోజే సంచలనం సృష్టించి జనం నోళ్లలో నానాలనుకున్న అజిత్ కుమార్ ఆలోచన అలా వికటించి బెడిసి కొట్టింది.
తన అనైతిక ప్రవర్తనకు క్షమాపణ చెప్పి ప్రసారాలకు ‘మంగళం’ పాడిన మంగళం యాజమాన్యం 3 ఏళ్ళ తరువాత 2020 జులైలో మళ్ళీ చానల్ ప్రసారాలు మొదలుపెట్టింది.

కానీ ఆర్థిక సమస్యలతో 2022 చివర్లో శాశ్వతంగా మూసేసింది. నెలరోజుల్లోపే సౌతిండియన్ బాంక్ ఆ చానల్ ఆస్తుల్ని జప్తు చేసింది. ఈలోపు శశీంద్రన్ ఈ కేసులో నిర్దోషిగా బైటపడి మళ్ళీ రవాణా మంత్రి పదవి చేపట్టారు.
*****

ఇలాంటి ‘ఆపరేషన్’ తెలుగులోనూ జరిగింది. చానల్ యజమాని జర్నలిస్ట్. ఒక మాజీ ఎమ్మెల్యే (ఇప్పుడు మాజీ మంత్రి) ఆడియో సంభాషణ ఇలాగే ప్రసారమైంది. ఇక్కడ కూడా ఫోన్ సంభాషణ జరిపింది చానల్ ఉద్యోగే.

కాకపోతే.. ఎవరూ చానల్ ను తప్పుబట్టలేదు. ఇందులో ఇరుక్కున్న ఆ నాయకుణ్ణి ఇప్పటికీ ఆ సంభాషణ గుర్తు చేసి వేధిస్తూనే ఉన్నారు…. – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాలు విగ్రహవివాదం..! అనేక ప్రశ్నలు- జవాబులు దొరకని నిశ్శబ్దం..!!
  • స్టింగ్ ఆపరేషన్ పేరుతో హనీట్రాప్… మలయాళీ చానల్ అత్యుత్సాహం…
  • ఎవరీ 19 ఏళ్ళ మహేష్ రేఖే..? 200 ఏళ్ల రికార్డు ఎలా బద్దలు కొట్టాడు..?
  • 100 % గరం మసాలా సినిమాలో జయమాలినికి సంసారి పాత్ర..!!
  • పాపం టీబీజేపీ… కక్కలేక, మింగలేక… వంకర దారులు, వక్ర బాష్యాలు…
  • హై-స్పీడ్ రాకెట్-స్లెడ్… పైలట్ల ప్రాణాలకు భరోసా..! ఇదేమిటంటే..?
  • ఫ్రీ లైఫ్… నో మ్యారేజీ… ఎంజాయ్…. జయమ్మ పేరెంట్స్ అలా అనుకోలేదు…
  • ఒక పార్లమెంటు… ఒక రేణుకా చౌదరి… ఒక శునకోపాఖ్యానం…
  • తేరే ఇష్క్ మే …! తమిళం మార్క్ ఓవర్ డోస్ హింస ప్రేమ…!
  • ఒక యువ ప్రేమ… ఒక ప్రౌఢ ప్రేమ… ఓ పాత ప్రేమ… వెరసి సంసారం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions