.
అందరికీ తెలిసిన కథే… లక్షల కళారూపాల్లో, కోట్లసార్లు జనం విన్నదే, చూసిందే, చదివిందే… కానీ ఎప్పటికప్పుడు కొత్తదే… రామాయణం…
ఆ కథలోని ధర్మసూక్ష్మాలను ప్రవచనకారులో, స్వాములో వివరిస్తే… తెలిసిన కథనే కొత్తగా వినిపించగలడు రచయిత… తనదైన శైలితో పాపులరైన ప్రముఖ రచయిత Veerendranath Yandamoori తన రాబోయే కొత్త పుస్తకంలో రామాయణంపై ఇలా రాస్తాడు…
Ads

“రామాయణం చదవమని నీ తండ్రికి, భర్తకి, కొడుక్కి… చివరకు నీ మనవడికి కూడా చెప్పు. ఎందుకంటే…” అన్నారు చిరునవ్వుతో.
ఆయన ఏమి చెపుతారా అని అందరం ఉత్సుకంగా వింటున్నాం.
“భార్య గురించి చెడుగా విన్నా, పరీక్ష వద్దని పాఠం చెపుతుంది రామాయణం..! భార్య దూరమయినా, మరొక వివాహం ఆలోచన రాని రాముని కథ రామాయణం..! ఆత్మ గౌరవానికి అవమానం జరిగినప్పుడు తల వంచుకుని సేవ చేయటం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీత కథ స్త్రీలందరికీ ఒక పాఠం”.

“మరణం మంచం అంచున నువ్వు సొమ్మసిల్లి, ‘ఆఖరి చూపుగా నిన్నొక్కసారి చూడాలని ఉందిరా’ అని కబురు చేసినప్పుడు- తండ్రి మాట విని రాముడు సర్వం త్యజించినట్టూ- రాజభోగాలిచ్చే విదేశీ సుఖాన్నీ, అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని పక్కన పెట్టి, నిన్ను చూడటానికి వచ్చేటంత ప్రేమను పెంచుకొమ్మని నీ కొడుక్కి చెబుతుంది రామాయణo..!
నిర్హేతుకమైన కోరికల వెనుక వెళ్ళటం- బంగారు లేడి వెనుక పరుగెత్తటమ౦త ప్రమాదమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది. వనమున చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశుల చరిత్ర, చదువుకి సుఖసౌఖ్యాలు తప్పనిసరి కాదని నీ మనవలకి చెపుతుంది..! అందుకే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులూ… అందరూ చదవాలి ఆ పురాణ గ్రంధం” అన్నారు.

ఈ అద్భుతమైన ప్రవచన౦ వింటూ ఉంటే, నా ఒళ్ళు అప్రయత్నంగా జలదరించింది.
“ఎన్నో జీవిత సత్యాలు తనలో నింపుకున్నది ఆ ఇతిహాసం. అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యవద్దని చెప్పేది కైకతో వ్యవహారం..! పరాయి స్త్రీ పై వ్యామోహం వలదని చెప్పేది లంకా దహనం..! ఇక పాత్రల ప్రసక్తి వస్తే, నిస్వార్థానికి ప్రతీకలు లక్ష్మణ, భరతులు.

ప్రాణమున్నంత వరకూ నీతి వైపే నిలబడతానంటాడు విభీషణుడు. రెక్కలున్నంత వరకూ చెడుతో పోరాడమంటాడు జటాయువు..! ఉన్న౦తలో సాయం చేయమ౦టు౦ది ఉడుత..! నీలో తెలియని శక్తే ఆంజనేయ చరిత..!
ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ, వ్యాపారంలో గానీ- నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు, వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే లౌక్యమే వాలి సంహారం..! ఇలా ఎన్నో జీవిత సూత్రాలూ, నీతి పాఠాలూ ఉన్న ఇతిహాసమే రామాయణ౦…!”

ఆయన కొనసాగించారు: “దానిలో ఒకడికి బురద కనబడవచ్చు. మరొకడికి కమలం కనబడవచ్చు. అంతా నీ దృష్టి మీద ఆధారపడి ఉంటుంది…! చదివే అనుభవ౦ ఫలవంతం కావాలీ అంటే, నీరక్షీరాల్ని విడదీసే ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి” అని ఆయన చెపుతూంటే జనం కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. ప్రశ్న అడిగిన ఆమె చేతులెత్తి నమస్కారం చేసింది…. (కొత్త పుస్తకం నుంచి. జనవరి విడుదల)
Share this Article