.
మీరు వాయిఖ్ అని ముందే ఇకారం ఫీల్ కావద్దు… “ఇచ్చట మంచి మలం అమ్మబడును” అనే బోర్డు కనిపించిందీ అనుకొండి… వెంటనే మీ మొహం ఏవగింపుగా పెడతారు, అవును కదా…
పోనీ, ఇలాంటి వివరణలు కనిపిస్తే..?
Ads
1. పేగుల ‘పనిమనుషులు’ (Gut Workers)…: కోట్లాది మంచి బ్యాక్టీరియాను మీ గట్‌లోకి బదిలీ చేసే వినూత్న థెరపీ…
2. టాయిలెట్ టు ట్రాన్స్‌ప్లాంట్ (Toilet to Transplant)…: కడుపు నొప్పిని, డయేరియాను ఇట్టే పోగొట్టే ‘స్టూల్ బ్యాంక్’ రహస్యం…
3. స్టూల్ బ్యాంక్ – నమ్మండి, నిజం!….: రక్తం, వీర్యం లాగే… ఇప్పుడు మలం కూడా దానం చేయబడుతోంది! స్వీకరించబడుతోంది!
4. ఫేకల్ ఫైటర్స్ (Fecal Fighters)…: ‘క్లోస్ట్రిడియం డిఫిసిల్’ వంటి మొండి బ్యాక్టీరియాతో పోరాడటానికి దొరికిన అద్భుత ఆయుధం…
5. అనారోగ్యంతో ఉన్న పేగులకి కొత్త జీవితాన్ని ఇచ్చే ‘మల సంజీవని’ కేంద్రం…
- అవును… ఆరోగ్యవంతుడైన మనిషి మలాన్ని సేకరించి, నిల్వ చేసి… అనారోగ్యంతో బాధపడుతున్న రోగి పేగుల్లోకి ఎక్కించడం… దీన్నే ఫేకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT) అని పిలుస్తారు…
ఓ మిత్రుడు ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఇంటర్వ్యూ బిట్ ఒకటి పంపించాడు… అందులో కొన్ని దేశాల ప్రజలు 100 ఏళ్లు జీవించడానికి ఉపయోగపడుతున్న డిఫరెంట్ డైట్‌పై ఇక్కడా ప్రయోగాలు చేస్తున్న తీరును చెబుతూనే… ఈ స్టూల్ మార్పిడి గురించీ కొంతమేరకు వివరించాడు…
ఆసక్తికరం… వైద్యంలో ఏదీ తప్పు కాదు… అది పనికొస్తుందా లేదానేదే ముఖ్యం… సరే, ఈ స్టూల్ థెరపీ ఏమిటో చూద్దాం ఓసారి…
గత దశాబ్దంలో వైద్య రంగంలో సంచలనం సృష్టించిన ఒక వినూత్న చికిత్సా విధానం ఇది… ఇది కేవలం పాత చికిత్స కాదు, సైన్స్ కొత్తగా కనుగొన్న ఒక అద్భుతం…
చికిత్స వెనుక సైన్స్ (The Science Behind the Therapy)
మన గట్‌లో (పేగుల్లో) ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ నివసిస్తాయి. ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే గట్ మైక్రోబయోటా లేదా మైక్రోబయోమ్ అంటారు… ఇది ఆహారం జీర్ణం కావడంలో, పోషకాలను గ్రహించడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది…
కొన్ని రకాల అనారోగ్యాలు, ముఖ్యంగా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం వలన, మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోయి, హానికరమైన బ్యాక్టీరియా (ఉదాహరణకు, క్లోస్ట్రిడియం డిఫిసిల్ – Clostridioides difficile) అదుపు లేకుండా పెరిగిపోతుంది… దీని ఫలితంగా తరచుగా డయేరియా (విరేచనాలు) పేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయి…
FMT చికిత్సలో, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన మలాన్ని (స్టూల్‌ను), పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగి పేగుల్లోకి బదిలీ చేస్తారు… తద్వారా చెడు బ్యాక్టీరియా తొలగిపోయి, మంచి బ్యాక్టీరియా స్థిరపడుతుంది…
స్టూల్ బ్యాంకులు (Stool Banks)
- ఈ FMT చికిత్సకు అవసరమైన మలాన్ని సేకరించి, ప్రాసెస్ చేసి, భద్రపరచడానికి కొన్ని దేశాల్లో స్టూల్ బ్యాంకులు (Stool Banks) కూడా ఉన్నాయి… ఇవి రక్త నిధి (Blood Bank), వీర్యనిధి (Sperm Bank), అండనిధి (Egg Bank) లాంటివే… ఇక్కడ దాతల నుంచి మలాన్ని సేకరిస్తారు… దాతలను అత్యంత కఠినమైన పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు… వారి మలంలో ఎలాంటి అంటువ్యాధులు లేదా హానికరమైన బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్న తర్వాతే సేకరిస్తారు…
నిల్వ…: సేకరించిన మలాన్ని శుద్ధి చేసి, గడ్డకట్టే స్థితిలో (Freezing) భద్రపరుస్తారు… అవసరమైనప్పుడు వీటిని FMT చికిత్సకు ఉపయోగిస్తారు… ప్రస్తుతం, ప్రపంచంలోనే అతిపెద్ద స్టూల్ బ్యాంక్‌లలో ఒకటి అయిన ఓపెన్ బయోమ్ (OpenBiome) అమెరికాలో ఉంది…
చికిత్సా విధానం ఎలా ఉంటుంది?
FMT చికిత్సను ప్రధానంగా కింది మార్గాలలో చేస్తారు…
కొలొనోస్కోపీ (Colonoscopy) ద్వారా…: మలాన్ని ద్రవ రూపంలో తయారు చేసి, కొలొనోస్కోప్ సహాయంతో రోగి పెద్దపేగుల్లోకి పంపుతారు….
ఎనిమా (Enema) ద్వారా…: పేగుల్లోకి నేరుగా మల ద్రవాన్ని ఎక్కించడం…
క్యాప్సూల్స్ (Capsules) రూపంలో…: అత్యంత ఆధునిక పద్ధతిలో, మలాన్ని చిన్న గుళికల (మాత్రల) రూపంలోకి మార్చి, రోగికి నోటి ద్వారా ఇస్తారు… వీటిని “మల మాత్రలు (Fecal Pills)” అని కూడా అంటారు…
…. రికరెంట్ క్లోస్ట్రిడియం డిఫిసిల్ ఇన్ఫెక్షన్ (Recurrent Clostridioides difficile Infection – rCDI): ఇది తీవ్రమైన, తరచుగా తిరగబడే విరేచనాల ఇన్ఫెక్షన్… యాంటీబయాటిక్స్‌తో నయం కాని ఈ ఇన్ఫెక్షన్‌కు FMT ఒక నిర్దిష్టమైన, త్వరగా ఫలితం ఇచ్చే పరిష్కారంగా నిరూపించబడింది…
FMT చికిత్సను భవిష్యత్తులో ఈ క్రింది వ్యాధులకు కూడా ఉపయోగించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి… ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD), ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), ఊబకాయం (Obesity), పార్కిన్సన్స్ వ్యాధి, ఆటిజం…
స్టూల్ బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి?
- ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, కెనడా, ఐరోపా దేశాలలో స్టూల్ బ్యాంకులు ఉన్నాయి… ఓపెన్ బయోమ్ (OpenBiome) అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న ఒక లాభాపేక్ష లేని సంస్థ…. త్రీసీ-డి (The Three C-D) బ్యాంక్ కూడా ఒక ప్రముఖ స్టూల్ బ్యాంక్…
మరి మన దేశంలో..?
భారతదేశంలో FMT అనేది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది… అయినప్పటికీ, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు, పరిశోధకులు ఈ వినూత్న చికిత్సను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు…
దేశంలో 2014లోనే తొలి విజయవంతమైన FMT చికిత్స జరిగింది… అప్పటి నుండి, పూణే, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లోని కొన్ని పెద్ద ఆసుపత్రులు ఈ చికిత్సను అందిస్తున్నాయని సమాచారం… పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో జరిపిన ఒక అధ్యయనం 70% కంటే ఎక్కువ విజయవంతమైన రేటును చూపింది ఈ థెరపీ…
FMT చికిత్సకు సంబంధించి భారతదేశంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుండి ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు లేదా నిబంధనలు రాలేదు… ఈ నియంత్రణలు అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా స్టూల్ బ్యాంకులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందేమో… అప్పుడు ‘ఇచ్చట హెల్దీ మలం దొరుకును’ అని ఓ బోర్డు కనిపిస్తే మీరూ ఆశ్చర్యపోరు కదా..!!
- ఇంకా సరళంగా చెప్పాలంటే… పెరుగు, చద్దన్నం, పులిసిన ఫుడ్ ద్వారా ప్రొబయోటిక్స్, హెల్దీ బ్యాక్టీరియా లభిస్తుంది… మాత్రలూ దొరుకుతున్నాయి… మరి పేగుల్లో మంచి బ్యాక్టీరియా కావాలంటే..? అదే పైన చెప్పిన కథన సారాంశం…
(ఈ కథనం పూర్తిగా అవగాహన, అధ్యయనం కోసం మాత్రమే)
Share this Article