.
Bhavanarayana Thota ….. సొంత మంత్రి మీద ఎన్టీఆర్ స్టింగ్ ఆపరేషన్….
కేరళలో మంగళం అనే న్యూస్ చానల్ తొలిరోజునే జనంలోకి వెళ్లాలని మోసపూరితమైన స్టింగ్ ఆపరేషన్ చేసి దొరికిపోయి సీఈవో జైలుకెళ్లటం, చానల్ మూతపడటం గురించి గుర్తు చేశాను కదా మొన్న… అయితే, ఈ స్టింగ్ ఆపరేషన్స్ పూర్వాపరాలు సమగ్రంగా కాకపోయినా కొన్ని ఉదాహరణలతో చెప్పటానికే ఈ వ్యాసం…
*****
అవినీతి, అక్రమాలు బైటపెట్టటానికి కొంతకాలం టీవీ చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ మీద ఆధారపడ్డాయి. మరేవిధంగానూ ఆధారాలు సంపాదించటం కుదరనప్పుడు ఇది ఆఖరి అస్త్రం కావాలి. ఈ మధ్య అందరూ తెలివి మీరిపోవటంతో ఈ మంత్రం పనిచేయటం లేదు.
Ads
స్టింగ్ ఆపరేషన్ కూ హద్దులుండాలని అమెరికాలో ఏబీసీ చానల్ కేసు చాటి చెప్పింది. భారతదేశంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు లక్ష రూపాయలు తీసుకుంటూ తెహెల్కా సీక్రెట్ కెమెరాకు దొరికినప్పుడు దేశం ఉలిక్కిపడింది.
-
రివర్స్ స్టింగ్… ఒక పేరు మోసిన కంపెనీ మీద ఈ దేశపు తొలి ప్రైవేట్ శాటిలైట్ చానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి బెదిరిస్తే, బేరం మాట్లాడటానికి వచ్చిన వాళ్ళ మాటలు రికార్డు చేసి ‘రివర్స్ స్టింగ్’ చేసింది ఆ కంపెనీ. ఒక గవర్నర్ గారు సాక్షాత్తూ రాజ్ భవన్ లోనే జరిపిన రాసలీలల్ని ఆయన బాధితులు రికార్డు చేసి ఒక చానల్ కి ఇవ్వటం ఇంకో రకం స్టింగ్ ఆపరేషన్.
శవాల అమ్మకం… ఇంకో తెలుగు చానల్ ఉస్మానియా ఆస్పత్రిలో శవాలు అమ్ముతున్నారంటూ నిరూపించే ప్రయత్నంలో తడబడింది. అయితే 40 ఏళ్ల కిందటే ఒక ముఖ్యమంత్రి తన మంత్రి మీదనే ఎలా స్టింగ్ ఆపరేషన్ చేయించారో గుర్తుందా?
*****
ఏబీసీ నిర్వాకం… అమెరికాలో పేరుమోసిన ఫుడ్ లయన్ అనే సూపర్ మార్కెట్లో కుళ్లిన మాంసం అమ్ముతున్నారని, అపరిశుభ్ర వాతావరణంలో ప్యాకింగ్ చేస్తున్నారని నిరూపించాలని ఏబీసీ అనే చానల్ నిర్ణయించుకుంది. అయితే, కిచెన్ లోకి వెళ్ళటం కుదరలేదు. అందుకే లైన్ డెల్, సుసన్ బారెట్ అనే ఇద్దరు రిపోర్టర్లు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగులుగా చేరారు. సీక్రెట్ కెమెరాలతో లోపలికెళ్ళి అక్కడి పరిస్థితులన్నీ రహస్యంగా షూట్ చేశారు.
తిరిగొచ్చాక ప్రైమ్ టైమ్ న్యూస్ మేగజైన్ స్టోరీగా టెలికాస్ట్ చేశారు. ఇది 1992 నాటి సంగతి. అందులో ఫుడ్ లయన్ మాజీ ఉద్యోగుల అభిప్రాయాలు కూడా చేర్చారు. మొత్తానికి ఈ కథనం అమెరికాలో పెను కలకలం రేపింది. అయితే, ఎబీసీ చానల్ మీద ఫుడ్ లయన్ సంస్థ కోర్టుకెక్కింది.
- చట్టవ్యతిరేకమే… ఇన్వెస్టిగేటివ్ వార్తాకథానాలలో చట్ట సంబంధమైన ఉల్లంఘనల మీద దేశమంతటా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక ఆక్రమాన్ని వెలుగులోకి తీసుకురావటానికైనా చట్టవ్యతిరేక మార్గాలు సరికాదని కోర్టు తేల్చింది. ఏబీసీ కి 10 లక్షల డాలర్ల జరిమానా పడింది. ఇప్పటికీ స్టింగ్ ఆపరేషన్ల గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఘటనను ప్రస్తావించుకోవటం తప్పదు.
*****
భారతదేశంలో 2001 లో తెహెల్కా డాట్ కామ్ అనే సంస్థ ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ పేరుతో సంచాలనాత్మకమైన స్టింగ్ ఆపరేషన్ చేసింది. అప్పటి అధికార పార్టీ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్. తెహెల్కా జర్నలిస్టులు తాము లండన్ కు చెందిన ఆయుధాల కంపెనీ ప్రతినిధులుగా ఆయనకు పరిచయం చేసుకున్నారు.
తెహెల్కా సెన్సేషన్… సైనికులకు పనికొచ్చే హ్యాండ్- హెల్డ్ థర్మల్ ఇమేజర్లు సరఫరా చేస్తామని చెప్పారు. రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు సిఫార్సు చేయవలసిందిగా కోరారు. ఈ సంభాషణతో బాటు లక్ష రూపాయలు ఆయన చేతికివ్వటం కూడా కెమెరాల్లో రికార్డయింది. ఆ తరువాత ఈ వీడియోలు బైటపెట్టారు.
- దేశ రక్షణ వ్యవహారాలు ఎంత ఆషామాషీగా నడుస్తున్నాయో చెప్పటం తమ ఉద్దేశమని తెహెల్కా చెప్పుకుంది. ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. బీజీపీ జాతీయఅధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2012 లో సీబీఐ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష వేసింది.
శిక్షాకాలంలోనే అనారోగ్యం కారణంగా బెయిలు మీద ఉండగా 2014 లో ఆయన చనిపోయారు. ఒక దళితుడికి జాతీయాధ్యక్ష పదవి ఇచ్చామని చెప్పుకున్న బీజేపీ ఆయనను ఈ ఘటన తరువాత ఏకాకిని చేసింది. ఏమైనా, భారతదేశంలో టీవీ చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ చేపట్టటానికి తెహెల్కా ఉదంతం మార్గదర్శి అయింది.
*****
జిందాల్ రివర్స్ ఉచ్చు… కాంగ్రెస్ ఎంపీ జిందాల్ యాజమాన్యంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి బొగ్గు కేటాయించటంలో అవకతవకలు జరిగాయంటూ భారతదేశపు తొలి ప్రైవేట్ శాటిలైట్ చానల్ జీటీవీ ఆధ్వర్యంలోని న్యూస్ చానల్ ఒక వార్తాకథనం ప్రసారం చేసింది. మరికొన్ని కథనాలు కూడా ప్రసారం చేయబోతున్నట్టు చూచాయిగా చెప్పింది.
జిందాల్ ప్రతినిధులు వెంటనే జీ న్యూస్ సీనియర్ జర్నలిస్టులను పిలిచి మాట్లాడారు. వార్తా కథనాలు ఆపటానికి 100 కోట్లు ఇవ్వాలని జీ జర్నలిస్టులు అడిగారు. పైగా తమ యజమాని సుభాష్ చంద్రకు ఈ డిమాండ్ తెలుసని కూడా చెప్పారు. ఒక హోటల్ లో జరిగిన ఈ మొత్తం సంభాషణను జిందాల్ బృందం రహస్యంగా వీడియో తీసింది.
- జిందాల్ స్వయంగా మీడియా సమక్షంలో ఈ టేపులు ప్రదర్శించారు. ఈ రివర్స్ స్టింగ్ ఆపరేషన్ తో మీడియా మొత్తం ఉలిక్కిపడింది. ఇంకోవైపు ఆ ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. అవమానభారంతో ఉన్న జీటీవీ కూడా జిందాల్ మీద 150 కోట్లకు పరువునష్టం దావా వేసింది.
చివరికి ఇరుపక్షాలూ రాజీపడి కేసులు వెనక్కి తీసుకున్నాయి. అమాయక జనం చోద్యం చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడన్న సామెతను ఈ దెబ్బతో మీడియా మళ్ళీ గుర్తు చేసుకుంది.
*****
ఇది మంగళం కథ… చానల్ మొదలవుతూనే జనం నోళ్లలో నానాలని గట్టిగా నిర్ణయించుకున్న మలయాళ చానల్ ‘మంగళం’ 2017 మార్చిలో చావు తెలివి చూపింది. ఒక మహిళా జర్నలిస్టు చేత మంత్రితో కొద్ది రోజులపాటు మాట్లాడిస్తూ ముగ్గులోకి దింపింది. సె* -క్సీ సంభాషణ మొదలుపెట్టించి వ్యవహారం ముదిరిన తరువాత రికార్డు చేసిన మాటలు ప్రేక్షకులకు వినిపిస్తూ దానిమీద చర్చ నడిపింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ చానల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గంట సేపటికే అదే చానల్ ఆయన మంత్రివర్గ సహచరుడి మీద చర్చ మొదలుపెట్టింది. రికార్డయిన మంత్రి మాటల ఆడియో మీద చర్చ సాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి ఆదేశాల మీద శశీంద్రన్ అనే ఆ మంత్రి రాజీనామా చేశారు.
- దొరికిపోయింది… అయితే, ఆ సంస్థలో పనిచేసే మరో మహిళా ఉద్యోగి ఆ గొంతు గుర్తుపట్టింది. చానల్ లో చెబుతున్నట్టు ఎవరో గృహిణి కాదని, చానల్ లో పనిచేసే జర్నలిస్టు గొంతేనని ఆమెకు అర్థమైంది. చర్చ మధ్యలో లేచి బైటికొచ్చి ఫేస్ బుక్ లోనే ఈ సంగతి బైటపెట్టి, చానల్ అనైతికతను ప్రశ్నిస్తూ రాజీనామా చేసింది. ఇది మరో సంచలనమైంది.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీఈవో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సాయంత్రం అరెస్ట్ ప్రకటించారు. చానల్ అనైతికత మీద మీడియా సంఘాలు మండిపడ్డాయి. క్షమాపణ చెప్పి ప్రసారాలకు ‘మంగళం’ పాడిన మంగళం యాజమాన్యం 3 ఏళ్ళకు పునఃప్రారంభించినా, 2022 లో శాశ్వతంగా మూసేసింది.
*****
గవర్నర్ గారూ దొరికారు… బాధితులు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియోలు ఒక టీవీ చానల్ కి ఇచ్చి ప్రసారం చేయించటం కూడా తెలిసిందే. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఎన్డీ తివారీ హైదరాబాద్ లో రాజ్ భవన్ లోనే రాసలీలలు జరిపి ఆయన బాధితుల స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు.
ఆ విధంగా … 84 ఏళ్ల వయసులో ఒక గవర్నర్ పదవి పోగొట్టుకోవటానికి ఆయన శృంగార లీలల స్టింగ్ ఆపరేషన్ కారణమైంది. మరో తెలుగు చానల్ ఉస్మానియా ఆస్పత్రిలో శవాల అమ్మకం రుజువు చేయటానికి మార్చురీలో ఒక శవం కొన్నది. రిక్షాలో బైటికి తీసుకొచ్చేదాకా రహస్యంగా షూట్ చేసింది. ఆ తరువాత శవాన్ని రిక్షాలో వదిలేసి వెళ్లిపోవటంతో భయపడ్డ రిక్షావాలా ఆ శవాన్ని మూసీలో పడేసి వెళ్ళిపోయాడు.
అస్తవ్యస్త ఆపరేషన్… మరుసటి రోజు పోలీసులకు తెలిసి ఆరాతీస్తే అసలు సంగతి బైటపడింది. చానల్ ప్రతినిధులు చేసింది తప్పని పోలీసులు తేల్చారు. పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నడపటమో, లేదా శవాన్ని పోలీసుల దగ్గరికి తీసుకువెళ్ళి కథంతా చెప్పటమో చేసి ఉండాల్సింది. అలా శవాన్ని వదిలేసి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారం నుంచి బైటపడటానికి ఆ చానల్ ప్రతినిధులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
*****
ఎన్టీఆర్ మార్క్ స్టింగ్… అయితే, ఇవన్నీ గత 1992 తరువాత జరిగిన ఘటనలే. కానీ అంతకు ఎనిమిదేళ్ల ముందే .. అంటే 1984 లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఒక మంత్రి బర్తరఫ్ కు కారణమైంది. అప్పటికి గ్రామపంచాయితీగా ఉన్న కూకట్ పల్లికి సర్పంచ్ గా పనిచేసిన రామచంద్రరావుకు టీడీపీ ఖైరతాబాద్ టికెట్ దక్కింది. పీజేఆర్ ను ఓడించిన రామచంద్రరావును కార్మికశాఖ మంత్రి పదవి వరించింది.
కొద్ది రోజులకే ఆయన తన కొడుకు పెళ్లి ఘనంగా చేశారు. ఎంత ఘనంగా అంటే.. అతిథిగా వెళ్ళిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయేంతగా! కానీ ఆ పెళ్లి జరిగిన తీరు ఎన్టీఆర్ ను మరోలా ప్రభావితం చేసిందని చెబుతారు. అది అసూయగా అభివర్ణించినవాళ్ళు కూడా ఉన్నారు…. (ఈ స్టింగ్ వార్త ఇండియాటుడేలో… ఇదుగో లింక్…)
మంత్రినే బుక్ చేశాడు… మొత్తానికి తన మంత్రి మీదనే స్టింగ్ ఆపరేషన్ చేయించారు. సినిమా నేపథ్యంతో.. నాటకీయత ఇష్టపడే ఎన్టీయార్ ఆదేశాల మీద ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ముందుగా ఒక వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుంటూ మంత్రి పర్సనల్ సెక్రెటరీ గఫార్ తో మాట్లాడి అతనికి వెయ్యి, మంత్రికి పదివేలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు.
ఈ ఫోన్ సంభాషణ మొత్తం టేప్ రికార్డర్ లో రికార్డ్ చేశారు. మరునాడు ఆ వ్యక్తి తన కాకినాడ ఆయిల్ మిల్లు సమస్య పరిష్కరించాలంటూ మంత్రికి 10 వేల కవర్ ఇచ్చి బైటికి రావటం రెండే రెండు నిమిషాల్లో పూర్తయింది.
*****
బేగంపేటలోని మంత్రి నివాసం బయట ఎదురుచూస్తున్న అదనపు డీజీపీ అప్పారావు వెంటనే మంత్రి ఛాంబర్ లోకి వెళ్ళటం, ఆయన మీద అభియోగం మోపటం వెనువెంటనే జరిగిపోయింది. మోసపూరితంగా ఇరికించారంటూ చెప్పుకోవటానికి మంత్రి ఎన్టీఆర్ దగ్గరికెళ్లినా కలవటం కుదరలేదు.
అప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సమావేశాలు అయ్యాక బర్తరఫ్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. కానీ ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలు బైటపెట్టటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మంత్రి వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. కావాలనే సీఎం తనని ఇరికించారని ఆరోపించారు.
ప్రతిపక్షం ఆగ్రహం… మరోవైపు కేసీఆర్ రాజకీయ గురువైన మదన్ మోహన్ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో ఎన్టీఆర్ తీరును సభలో ఎండగట్టారు. ఒక మంత్రి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని గద్దించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎన్టీఆర్ సహా చాలామంది మీద ఆరోపణలు ఉండగా మాధవరం మీదనే ఎందుకిలా అని కేశవరావు నిలదీశారు.
అక్కినేని నాగార్జున పెళ్ళి కోసం మద్రాసు వెళ్ళిన ఎన్టీఆర్ హుటాహుటిన హైదరాబాద్ తిరిగి వచ్చి.. రామచంద్రరావును బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫార్సు చేశారు. మరుసటి రోజు … అంటే 1984 ఫిబ్రవరి 20 నాడు ఈ విషయం శాసనసభను కుదిపేసింది. మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పించారో, ఎందుకు తప్పించారో సభకు తెలియాలని జనతాపార్టీ సభ్యుడు ఎస్ జైపాల్ రెడ్డి కోరారు.
ఎందుకు తొలగించానంటే… పత్రికలద్వారా బైటికొచ్చిందని, ఆ తరువాత గవర్నర్ ఉత్తర్వులు వెలువడ్డాయని, అసలు విషయం సభకు తెలియజేయాలని బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు కూడా కోరారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సభలో తన ప్రకటన చదివారు.
- “ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వచ్చమైన, సమర్థవంతమైన పాలనమ అందించటానికి కృషి చేస్తానని వాగ్దానం చేసిన సంగతి గుర్తు చేశారు. శ్రీ రామచంద్రరావు నిజాయితీ సంశయాస్పదముగా వున్నట్లు అనుమానము కలిగినందున .. మంత్రిమండలి నుంచి తొలగించవలసిందిగా నిన్న గవర్నరు గారికి సిఫార్సు చేశాను” అని చెప్పారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా జరిగిన ఈ ప్రహసనం మీద తన అభిప్రాయం చెప్పటానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు మదన్ మోహన్ స్పీకర్ ను అడిగారు. మంత్రిని తొలగించటం ముఖ్యమంత్రి ఇష్టమే అయినా, సభ జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకునే హక్కు సభకే ముందుంటుందన్నారు. పైగా, పత్రికల్లో వార్త రాగానే తాను నోటీసు కూడా ఇచ్చానన్నారు.
జైపాల్ రెడ్డి జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వం తనంతట తానుగా సభలో ప్రకటన చేయలేదని, అంతకు ముందే ప్రతిపక్ష నాయకుడు నోటీసు ఇవ్వటం వలన ఈ అంశం భిన్నమైనదని, మదన్ మోహన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వటం సమంజసమేనంటూ మద్దతుగా మాట్లాడారు. వెంకయ్య నాయుడు కూడా ఇదే వాదనను సమర్థించారు.
ఆ తరువాత మదన్ మోహన్ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరును సుదీర్ఘంగా విశ్లేషించారు. ఏమైనా.. ట్రాప్ చేసినట్టు మాత్రం సభలో చెప్పకుండా ఎన్టీఆర్ దాటవేశారు. ఆ ఆడియో టేపులు రామకృష్ణ స్టూడియోలోనే ఎందుకు పరిశీలించారన్న ప్రతిపక్షాల ప్రశ్నకూ జవాబు రాలేదు.
మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు తన మంత్రి వర్గ సహచరుడి మీద చేసిన స్టింగ్ ఆపరేషన్ చరిత్రలో ఒక వివాదంగా, ఒక సంచలనంగా మిగిలిపోయింది….. – తోట భావనారాయణ
Share this Article