.
పొద్దున్నే చెప్పుకున్నాం కదా… విధి ఎవరిని, ఎప్పుడు, ఎలా కలుపుతుందో తెలియదు అని… ఓ భూకంప బాధితురాలిని, సహాయక చర్యలకు వచ్చిన ఓ సైనికుడిని కలిపిన ఉదాహరణతో…
మరో ఉదాహరణ… ఇది మన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ఓ బ్రిటిష్ అందం హేజెల్ కీచ్ ప్రేమ కథ… ఆసక్తికరమే… హఠాత్తుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది వీళ్ల కథ ప్రతి డిసెంబరులో… ఇప్పుడూ కనిపిస్తోంది… ఇంతకీ ఎవరు ఈ బ్రిటిష్ అందం అంటారా..? పదండి వివరాల్లోకి…
Ads
హేజెల్ కీచ్… బ్రిటిష్ హిందూ… అవును… కాస్త వెనక్కి వెళ్తే… ఇండో మారిషియస్ జాతి… అంటే ఇండియా నుంచి కూలీలుగా మారిషస్ వెళ్లిన ఇండియన్ కుటుంబాలు… అలా వెళ్లిన ఓ కుటుంబానికి చెందిన హిందూ మహిళ ఓ బ్రిటిషర్‌ను పెళ్లి చేసుకుంది…
వాళ్లకు పుట్టిన బిడ్డ ఈ హేజెల్ కీచ్… అందుకే ఆమెది బ్రిటిష్, భారతీయ సంస్కృతుల వారసత్వ కలయిక… ప్లస్ మారిషన్ సంస్కృతి అదనం… బాగా చదువుకుంది… యాక్షన్, సింగింగ్, డాన్స్ నేర్చుకుంది… ఆమె హ్యారీ పోటర్ సీరీస్ తెలుసు కదా, అందులోని మొదటి మూడు చిత్రాలలో హాగ్ వార్ట్స్ విద్యార్థినిగా (ఎక్స్‌ట్రా) కనిపించింది…
మోడలింగ్ చేసేది… ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చి, 2007లో తమిళ చిత్రం ‘బిల్లా’తో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది… ఈ సినిమా తెలుగులోకి డబ్ అవ్వడంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరోక్షంగా పరిచయమైంది… అందులో రియా అనబడే ఓ అప్రధాన పాత్ర… హిందీలో ‘బాడీగార్డ్’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది…
అంతేకాదు… బిగ్‌బాస్ హిందీ 7వ సీజన్ కంటెస్టెంట్… సుజుకి మోడలింగ్… ఓ రీమిక్స్ పాటకు డాన్స్… ఆమె ఫ్యాషన్, వినోదరంగంలో టచ్ చేయని విభాగం లేదు… ఎక్కడో యువరాజ్ సింగ్‌కు కనిపించింది… అప్పటికే తను కేన్సర్‌ను జయించాడు… తొలి చూపులోనే పడిపోయాడు… కానీ ఆమె పెద్దగా ఇంట్రస్టు చూపించలేదు…
.

మూడున్నరేళ్లు… అవును, మూడున్నరేళ్లపాటు ఇద్దరికీ తెలిసిన కామన్ ఫ్రెండ్స్ దారా చెప్పిస్తూ… ఆమె తిరస్కరిస్తూ… అలాగని ఛీత్కరించలేదు, కానీ దూరదూరం ఉండేది… కాఫీకి రమ్మన్నా, ఇంకెక్కడికి రమ్మన్నా వోకే అనేది, తీరా సమయానికి ఫోన్ స్విచాఫ్… యువరాజ్ ప్రేమలో బలమెంత తెలుసుకోవడం ఆమె ఉద్దేశం…
చివరకు ఆమె నంబర్ డిలిట్ చేసేశాడు… కానీ మళ్లీ అనుకోకుండా ఓ కామన్ ఫ్రెండ్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా టచ్‌లోకి వచ్చారు ఇద్దరూ… కొన్నాళ్లకు ఇద్దరి నడుమ పరిచయం, ప్రణయంగా మారింది… ఆల్రెడీ కేన్సర్ నుంచి బయటపడ్డాడని తెలుసు ఆమెకు… రెగ్యులర్ చెకింగ్స్, ఫాలోఅప్ సమస్యలు కూడా ఆమెకు తెలుసు… ఐనా యువరాజ్ ప్రేమను అంగీకరించింది…
ఆమె చాలా సరదా మనిషి… స్పాంటేనిటీ, జోవియల్ కూడా… మీ బ్రిటిష్ క్రికెటర్‌పైనే యువరాజ్ ఆరు సిక్సర్లు ఒకే ఓవర్‌లో కొట్టాడు తెలుసా అంటే… ఓవర్‌కు ఎన్ని బాల్స్ అనడిగింది… క్రికెట్ అంటే ఆమెకు పెద్దగా తెలియదు… యువరాజ్ క్రికెట్ కెరీర్ కూడా పెద్దగా తెలుసుకోలేదు… ఇతర క్రికెటర్ల భార్యలతో పోలిస్తే ఎంత తేడా..?
2016లో వారి వివాహం జరిగింది… వారు ఇద్దరి కుటుంబ సంస్కృతులను గౌరవిస్తూ రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు…
-
సిక్కు సంప్రదాయం (ఆనంద్ కరాజ్)…: యువరాజ్ సింగ్ మతాన్ని అనుసరించి పంజాబ్‌లో జరిగింది… ఈ సందర్భంగా హేజెల్ పేరు గుర్బసంత్ కౌర్‌గా మారింది…
-
హిందూ సంప్రదాయం…: హేజెల్ తల్లి హిందూ మూలాలను గౌరవిస్తూ గోవాలో జరిగింది…

ప్రస్తుతం,..
యువీ-హేజెల్ ఇద్దరూ తమ కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు… గోవా, గురుగ్రామ్‌లలో ఇళ్లు… ఇద్దరు పిల్లలు… ఓరియన్ కీచ్ సింగ్ (దాదాపు 4 సంవత్సరాలు), ఆరా కీచ్ సింగ్ (దాదాపు 2 సంవత్సరాలు)… పిల్లల పేర్లలో కీచ్, సింగ్ పేరెంట్స్ సర్‌నేమ్స్… వాళ్ల వివాహ వార్షికోత్సవం గుర్తొచ్చినప్పుడల్లా సోషల్ మీడియా, మీడియా వాళ్ల ఫోటోలను, ప్రేమకథను గుర్తుచేస్తుంటాయి…
యువీ తన 'YouWeCan' ఫౌండేషన్ ద్వారా కేన్సర్ పోరాట యోధులకు సహాయం చేస్తుంటాడు... సహధర్మచారిణి తన కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది, యూవీకి సహకారం అందిస్తుంటుంది...
.
Share this Article