ఏదైనా పెద్ద సినిమా ప్రాజెక్టు ప్రారంభమైతే చాలు… అందులో ఏదో ఒకటి పట్టేసుకుని, ఉద్దేశపూర్వకంగా ఓ వివాదాన్ని క్రియేట్ చేసి, మనోభావాల్ని దెబ్బతీసుకుని, రచ్చ చేసుకుని, చివరకు ఎక్కడో ఓచోట సెటిల్ చేసుకునే ఉదంతాలు బోలెడు ఈరోజుల్లో..! ఒక్క తెలుగులోనే కాదు, దేశమంతటా ఇదే తంతు… ప్రతి భాషలోనూ ఇదే దందా..!! కరోనా లాక్ డౌన్ల కాలం కదా, షూటింగులు ఆగిపోయి, చాలామంది ‘మనోభావాల వ్యాపారం’ పడిపోయింది… ఐనా ఏదో ఒకటి దొరక్కపోదు అని కాచుకుని కూర్చుంటారు… కర్ణిసేన తెలుసు కదా… రాజ్పుత్ గౌరవ పరిరక్షణ అని చెప్పుకునే సంస్థ… వయోలెంట్ కేరక్టర్… గుర్తుంది కదా, దీపిక పడుకోన్ ముక్కుకోస్తామని ప్రకటించారు… పద్మావతి సినిమా మీద వివాదం లేవనెత్తి, బెదిరించి, సంజయ్ లీలా భన్సాల్ వెంటపడి, సెట్లు ధ్వంసం చేసి, దాడులు చేసి నానా రచ్చ చేశారు… ఇప్పుడు మళ్లీ ఓ చాన్స్ దొరికింది వాళ్లకు… కాదు, కాదు, చాన్స్ దొరికించుకున్నారు… ఆ సినిమా పేరు పృథ్వీరాజ్…
ఈ కరోనాతో డల్ అయిపోయాడు గానీ, లేకపోతే ఏటా అయిదారు సినిమాలు అలవోకగా తీసి దేశం మీదకు వదుల్తుంటాడు అక్షయ్ కుమార్… ఈమధ్య జాతీయవాద సినిమాల మీద కూడా గురి కుదిరింది బాగా… అంటే రైట్ వింగ్ ఐడియాలజీ అన్నమాట… ఆమధ్య చివరి రాజ్పుత్ రాజు, యోధుడు పృథ్విరాజ్ జీవితం మీద సినిమా ప్రకటించాడు, ఓ ట్రెయిలర్ వదిలాడు… తరువాత కరోనా కారణంగా ఆగిపోయింది… హీరోయిన్ మానుషి చిల్లర్… ఇప్పుడు కర్ణిసేన మళ్లీ తెర మీదకు వచ్చింది… ఆ సినిమా పేరును కేవలం పృథ్విరాజ్ అని పెట్టొద్దట… కర్ణిసేన యువజన విభాగం అధ్యక్షుడు సూర్జిత్ సింగ్ రాథోడ్ ఏమంటాడంటే..? ‘‘జస్ట్, అంత సింపుల్గా పేరు పెట్టడం మా మనోభావాల్ని దెబ్బతీయడమే… పూర్తి పేరు పెట్టాలి… అంతేకాదు, సినిమా విడుదలకు ముందే మాకు చూపించండి, అంతా బాగుంటే వోకే అంటాం, లేకపోతే పద్మావత్ సినిమా అనుభవాలు గుర్తున్నాయి కదా’’ అని హెచ్చరించాడు…
Ads
చివరకు సినిమా పేరు ఏముండాలో, ఎంత పొడుగు ఉండాలో కూడా కర్ణిసేనే ఖరారు చేస్తుందన్నమాట… రేప్పొద్దున సినిమాను నిజంగానే వాళ్లకు చూపిస్తే సదరు పృథ్విరాజ్ ఆభరణాలు, బొట్టు, వేషధారణ, బట్టలు, కత్తి, బాణం కూడా ఎలా ఉండాలో వాళ్లే చెబుతారేమో… మరీ ఈ మనోభావాల దందా మాఫియా టైపుగా మారుతోంది… నిజానికి పృథ్విరాజ్ మీద సినిమా ఇప్పుడే కొత్తేమీ కాదు… గతంలో ఆరేడు సినిమాలు వచ్చినయ్… రెండు టీవీ సీరియళ్లు కూడా వచ్చినయ్… పుస్తకాలకైతే లెక్కేలేదు… భారతీయ రాజకీయ చరిత్రలో ఈ రాజుది విశిష్ట అధ్యాయం… మహమ్మద్ ఘోరీని వరుసగా 16 సార్లు ఓడించి, పరుగులు పెట్టించిన రాజు తను… చివరకు తన చేతిలోనే ఓడిపోయి, కళ్లను కోల్పోయి… ప్రేమలో, యుద్ధంలో ఏదీ తప్పు కాదు అని తన ఆస్థానకవి ప్రభోదంతో… ఘోరీని తెలివిగా హతమార్చిన కథ… ఈ రాజు కథలో రెండు మూడు సినిమాలకు కావల్సినంత సరుకుంది…
రాజు శౌర్యాన్ని, సాహసాన్ని విని… తన చిత్రపటాన్ని చూసి, మనసు పారేసుకుంటుంది పొరుగుదేశపు కనౌజ్ రాజు జయచంద్ బిడ్డ సంయుక్త అలియాస్ సంయోగిత… ఆమె చిత్రపటాన్ని చూసే రాజు కూడా ప్రేమించేస్తాడు… జయచంద్కు పృథ్విరాజ్ అంటే గిట్టదు… ఆధిపత్యం, అహం బాపతు పోరాటం… ఓసారి ఆమె స్వయంవరం ఏర్పాటు చేసి, పృథ్విరాజును పిలవడు సరికదా, తన విగ్రహాన్ని ద్వారపాలకుడిగా పెడతాడు… సంయుక్త ఓ లేఖ పంపిస్తుంది తనను తీసుకెళ్లమని… స్వయంవరం సమయానికి వస్తాడు, ఆమెను ఎత్తుకెళ్లిపోతాడు, ఈ కోపంతో జయచంద్ ఘోరీతో చేతులు కలిపి, అల్లుడి మీద పగ తీర్చుకుంటాడు… తరువాత పృథ్విరాజుకు ఏమైంది అనేది కథ… ఒకరకంగా రాజ్పుత్ మీసాన్ని ఇంకాస్త పైకి మెలితిప్పే కథ… ఎంకరేజ్ చేయాల్సింది పోయి, ఇదుగో ఇలా బెదిరింపులకు పాల్పడుతూ… చికాకు పెడుతూ… మనోభావాలకు పదును పెడుతున్నారు…!!
Share this Article