.
చాన్నాళ్ల క్రితం హైదరాబాద్ ఫుల్‌బాల్ అడ్డా… చాలామంది స్టార్ ప్లేయర్లు… కానీ తరువాత కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఆటకు అభిమానులు పెరిగారు… ఇప్పుడు మళ్లీ హైదరాబాదులో ఫుట్‌బాల్ మేనియా కనిపిస్తోంది… దీనికి కారణం, స్టార్ ప్లేయర్ మెస్సీ వస్తుండటం, ఏకంగా ముఖ్యమంత్రి తనతో ఆడుతుండటం..!
మెస్సీతో ఫోటోకు ఏకంగా 10 లక్షలు అట రేటు, అదీ వంద మందికేనట… మెస్సీ ఆడే మ్యాచుకు ఫ్రీపాసుల కోసం వీఐపీలు, ప్రజాప్రతినిధులు కూడా పైరవీలు చేస్తున్నారు… అనూహ్య స్పందన లభిస్తోంది…
Ads
ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఇది ఉపయోగకరం… ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయదలిచిన స్పోర్ట్స్ యూనివర్శిటీకి కూడా ఇదొక ప్రేరణగా నిలుస్తుంది… ఐతే రాష్ట్ర ప్రభుత్వం మెస్సీ రాకకు, తనకు భారీగా ఖర్చు చేస్తోందా..? ఈ దిగువ కథనం ఆ సందేహాలకు సమాధానం…

John Kora …. రేవంత్ రెడ్డి Vs మెస్సీ
అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటించనున్నాడు… డిసెంబర్ 13 నుంచి 15 మధ్యలో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమాల్లో హాజరవుతాడు… ఇండియాలో జరుగుతున్న ఈ పర్యటనను GOAT India Tour 2025గా పిలుస్తున్నారు… అయితే ఇది పూర్తిగా ప్రైవేట్ టూర్…
- కానీ తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ టూర్‌కు సహకరిస్తోంది. అయితే నేరుగా నగదు చెల్లింపుల రూపంలో కాకుండా.. లాజిస్టిక్స్, సెక్యూరిటీ పరంగా ఆయా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి.
నిర్వహించేది ఎవరు?
పశ్చిమ బెంగాల్‌కు చెందిన శతద్రు దత్త అనే వ్యక్తి ఈ టూర్‌కి ఆద్యుడు. క్రికెటర్ సౌరవ్ గంగూలీకి వీరాభిమాని, అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. శతద్రు దత్తా కోల్‌కతాకు చెందిన ఒక ప్రముఖ స్పోర్ట్స్ ప్రమోటర్, వ్యాపారవేత్త… గతంలో ఫుట్‌బాల్ స్టార్స్ పీలే , మారడోనా, ఎమిలియానో మార్టినెజ్, రొనాల్డిన్హో వంటి దిగ్గజాలను కూడా కోల్‌కతాకు తీసుకొని వచ్చాడు. సాధారణంగా ఫిఫా వరల్డ్ కప్ విజేతలను కోల్‌కతాకు తీసుకొని వస్తుంటాడు.
2015లో లెజండరీ సాకర్ ప్లేయర్ పీలేను 38 ఏళ్ల గ్యాప్ తర్వాత కోల్‌కతాకు రప్పించాడు. ఇక డిగో మారడోనాను 2017లో తీసుకొని వచ్చి… Match for Unity పేరుతో మారడోనా, గంగూలీ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాడు.
2022లో అప్పటి సాకర్ విన్నింగ్ కెప్టెన్ Cafu తో కోల్‌కతాలో మ్యాచ్ నిర్వహించాడు. 2023లో వరల్డ్ కప్ విన్నింగ్ టీవ్ (అర్జెంటీనా) గోల్ కీపర్ మార్టినెజ్‌ను ఇండియాకు తీసుకొచ్చాడు. అదే ఏడాది బ్రెజీలియన్ స్టార్ రొనాల్డిన్హోను కూడా ప్రమోషనల్ టూర్స్ కోసం పిలిపించాడు…
ఫైనాన్స్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శతద్రు.. క్రికెటర్ సౌరవ్ గంగూలీకి అభిమాని అయినా.. ఫుట్‌బాల్ అంటే మాత్రం విపరీతమైన పిచ్చి. అందుకే ఫుట్‌బాల్ స్టార్స్‌ను కోల్‌కతాకు ఎక్కువగా తీసుకొస్తుంటాడు. 2022లో మెస్సీ సారధ్యంలో అర్జెంటీనా సాకర్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి మెస్సీని ఇండియాకు తీసుకొని రావడానికి శతద్రు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

హైదరాబాద్‌కే ఎందుకు?
మెస్సీ బిజినెస్ మేనేజర్‌గా అతని తండ్రి జార్జ్ మెస్సీ వ్యవహరిస్తున్నాడు. మెస్సీతో పాటు మొత్తం అర్జెంటీనా టీమ్‌ను తీసుకొచ్చి మ్యాచ్ ఆడించాలని కేరళ ప్రభుత్వం భావించింది. మెస్సీ, అర్జెంటీనా టీమ్ ఫీజులతో పాటు.. మ్యాచ్ నిర్వహణకు రూ.50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీంతో కేరళ ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
అదే సమయంలో శతద్రు.. జార్జ్ మెస్సీతో చర్చలు జరిపాడు. తనకు గతంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించి పూర్తిగా ఒక ప్రైవేట్ టూర్‌ను ప్రతిపాదించాడు. దీనికి ఓకే చెప్పడంతోనే మెస్సీ ఇండియా టూర్ కన్ఫార్మ్ అయ్యింది.
డిసెంబర్ 13న మెస్సీ కోల్‌కతాకు వస్తాడు. ఉదయం నుంచి అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అక్కడ తన విగ్రహాన్ని తానే వర్చువల్‌గా ఆవిష్కరించుకోనున్నాడు. అయితే కేరళ మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో.. ఆ స్లాట్‌ను హైదరాబాద్‌కు తీసుకొని రావడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అందుకే 13న కోల్‌కతా ప్రోగ్రామ్ అనంతరం మెస్సీ హైదరాబాద్‌కు వస్తాడు.
ఎంత ఖర్చు?
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్పోర్ట్స్ పాలసీని తీసుకొని వచ్చింది. దీంతో పాటు ఫ్యూచర్ సిటీలో కూడా క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీలో మెస్సీని భాగస్వామ్యం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది.
- ఈ క్రమంలోనే అందివచ్చిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేజిక్కించుకుంది. మెస్సీ టూర్‌కు సంబంధించి సెక్యూరిటీ, లాజిస్టిక్స్ మాత్రమే తెలంగాణ ప్రభుత్వం భరిస్తోంది. అంతకు మించి అతనికి ప్రత్యేకమైన ఫీజులు ఏమీ చెల్లించడం లేదు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రెంట్ మాత్రం ప్రభుత్వం తరపున చెల్లిస్తారని తెలుస్తోంది. ఇక 13న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో రేవంత్‌రెడ్డి, మెస్సీ జట్లు తలపడతాయి. కేవలం 20 నిమిషాలు మాత్రమే మెస్సీ ఈ మ్యాచ్‌లో ఆడతాడని నిర్వాహకులు చెప్తున్నారు.
- రేవంత్‌రెడ్డి జట్టుకు సింగరేణి కాలరీస్ స్పాన్సర్‌గా ఉంది. అందుకే ఈ జట్టుకు సింగరేణి ఆర్ఆర్9గా పిలుస్తున్నారు. ఇక మెస్సీ జట్టుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అపర్ణ స్పాన్సర్‌గా ఉంది. అందుకే దీన్ని అపర్ణా మెస్సీగా పిలుస్తున్నారు. దీంతో పాటు ఈ మ్యాచ్‌కు స్పాన్సర్‌గా అనేక కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ అఫీషియల్ టికెటింగ్ పార్ట్‌నర్‌గా ఉంది. ఈ డబ్బంతా శతద్రు కంపెనీకే వెళ్తాయి.

లైవ్ స్ట్రీమింగ్ లేదా?
సింగరేణి ఆర్ఆర్-9 Vs అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య జరుగనున్న ఈ మ్యాచ్ సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం జరిగనుంది.
ఓకే.. మరి తెలంగాణకు ఫాయిదా ఏంటి?
ఈ ఒక్క మెస్సీ ఈవెంట్‌తో తెలంగాణకు వందల కోట్ల పెట్టుబడులు రాకపోవచ్చు. కానీ.. తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి తెలుస్తుంది. తెలంగాణ రైజింగ్ అనే నినాదంలో భాగమైన క్రీడా పాలసీకి ఒక ఊతం ఇవ్వొచ్చు. మున్ముందు మెస్సీ కనుక ఫ్యూచర్ సిటీ ప్రణాళికల్లో భాగమైన స్పోర్ట్స్ యూనివర్సిటీకి తోడుగా ఉంటే అది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం. ఈ-కార్ రేసింగ్ పేరుతో వందల కోట్లు లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే.. ఈ మ్యాచ్ చాలా నయం.
మరి మెస్సీతో సెల్ఫీ?
ముందే చెప్పాను… ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్. తెలంగాణ ప్రభుత్వానికి దాంతో సంబంధమే లేదు. కేవలం ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు మాత్రమే ప్రభుత్వ సహకారం ఉంది….. #భాయ్‌జాన్
Share this Article