Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే బాలయ్య, ఆపై బోయపాటి… ఇంకేం..? తెరపై అఖండ తాండవం..!!

December 12, 2025 by M S R

.

అసలే బాలయ్య… అందులోనూ బోయపాటి… అసలు తెలుగు హీరో అంటేనే ఓ మానవాతీత శక్తి… ఇక అఘోరా వంటి మానవాతీత దైవిక శక్తులున్న అఖండ పాత్ర అయితే… ఇంకేముంది..? సినిమా అంతా దబిడి దిబిడే… అనగా లాజిక్కుల జోలికి పోకూడదు, అవి వెతికితే మతిపోతుంది అని..!

ఫస్ట్ ఆఫ్ ఆల్… చైనా గురించి ఈ దర్శకుడికి కనీసావగాహన లేనట్టుంది… మన ఇండియన్ సినిమా దేశభక్తి టచ్ అనగానే యాంటీ పాకిస్థాన్, యాంటీ టెర్రర్ లైన్ తీసుకుంటుంది కదా, కానీ ఇక్కడ డిఫరెంట్… చైనాను తీసుకున్నారు… పాకిస్థాన్‌లో సైనిక జనరల్స్ పెత్తనాలు, నిర్ణయాలు చల్తా… కానీ చైనాలో నెవ్వర్… చైనాలో పార్టీ, ప్రభుత్వం అల్టిమేట్… వాళ్ల ప్రతి అడుగుకూ ఓ లెక్క ఉంటుంది… సైన్యం ఏమీ సుప్రీం కమాండ్ కాదు…

Ads

అన్నింటికీ మించి చైనా అన్నిరకాల బయోవార్ సహా అన్నిరకాల యుద్ధాలకూ రెడీగా ఉంటుంది తప్ప… అది హిందూ ధర్మం మీద, మరీ కుంభమేళాల్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసుకుని, నదుల్లో ప్రమాదకర వైరస్‌ను కలపడం వంటి క్షుద్ర, ఉగ్రవాద పోకడలకు వెళ్లినట్టు దాఖలాల్లేవు… సరిహద్దుల్లో గల్వాన్ చేతియుద్ధాలే తప్ప, మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం తప్ప… పాకిస్థాన్ తరహా ‘టెర్రరిస్టు’ పోకడలు ఉండవు దానికి…

akhanda2

సేమ్, అలాగే చైనాను విలన్‌గా చూపించాలీ అంటే వాళ్ల ఆహారాన్ని, వాళ్ల భాషను, వాళ్ల సంస్కృతిని తిట్టిపోయాల్సిన పని లేదు కూడా… ఇంకాస్త చెప్పుకోవాలంటే గంజాయి అమ్ముకునే బ్యాచ్ అధికారుల్ని కిడ్నాప్ చేస్తే ఏకంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగిపోయి ఒంటిచేత్తో ఫైట్ చేయాలా..? పైగా పీఎం ఆఫీసు నుంచి ఫోన్ వస్తుందట, ఎస్పీ కూడా ఆ కిడ్నాప్ బాధితుల్లో ఉంటాడట… హేమిటో…

  • అఖండ ఫస్ట్ పార్ట్‌లో ప్రజ్ఞా జైస్వాల్‌ బాలయ్యకు కల్లు తాపించి, ఆవకాయ బద్దను నాకిస్తుంది… ఇందులో ఓ లేడీ ఆఫీసర్‌తో మందుకొడతాడు… (మొన్నీమధ్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బోయపాటి, బాలయ్య విచిత్రమైన హిందీ మాట్లాడతారు చూశారా..? అక్కడక్కడా అఖండ తెరపై బాలయ్య పాత్ర కూడా అలాగే మాట్లాడేస్తూ ఉంటుంది)…

వేక్సిన్ అనేది ముందు జాగ్రత్త… అది చికిత్స కాదు… గంగానదిలో వైరస్ కలిపితే, ఎందరి ప్రాణాలు పోతూ ఉంటే… అప్పుడు సైంటిస్టు (హర్షాలి) జనని వేక్సిన్ కనిపెడితే, సైంటిస్టుల్ని చంపేసి, ఆమెను వేటాడటం ఏమిటి..? వేక్సిన్ కొత్తవాళ్లకు వైరస్ రాకుండా అడ్డుకోగలదు గానీ ఆల్రెడీ ఆ ప్రభావం ఉన్నవాళ్ల మీద పనిచేసేది ఏముంటుంది..? పైగా బయోవార్ చేసేవాడు వేక్సిన్‌ను అంతం చేయాలని చూడడు, మరో వైరస్ ప్రయోగిస్తాడు… చైనా వూహాన్ ల్యాబులో బోలెడు వైరసులు… కోవిడ్‌ను మించినవి.,.

akhanda2

సరే, ఆమెను కాపాడటానికి అఖండలోలాగే అఘోరా బాలయ్య వచ్చేస్తాడు… కమాన్ సర్జికల్ స్ట్రయిక్స్ అంటాడు, అదీ చేతిలో ఒక్క శూలంతో… మొత్తానికి నానా బీభత్సపు ఫైట్లు చేసేసి దేశాన్ని రక్షించేస్తాడు… సనాతన ధర్మాన్ని కూడా కాపాడేస్తాడు… సగటు తెలుగు హీరోను మించిన ‘అతి’ యాక్షన్‌తో… శుభం…

  • సినిమాకు బలం… బాలయ్య అభిమానుల కోణం నుంచే కాదు, తటస్థ ప్రేక్షకులకూ నచ్చేవి డైలాగ్స్… పదునుగా బాలయ్య నోటి నుంచి వచ్చి పడుతుంటయ్… నిజానికి అఖండ డైలాగులతో పోలిస్తే తక్కువే, ఐనా పవర్‌ఫుల్‌గానే ఉన్నాయి… ఫస్టాఫ్ ఏవో సీన్లు, పాటలు గట్రా ఉన్న సెకండాఫ్ అఖండ పాత్ర ఎంటరయ్యాకే బీభత్సరసం థియేటర్లలో పొంగిపొర్లుతుంది… యాక్షనే యాక్షన్… సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, యతీంద్రియ మ్యాన్..!!

దానికితోడు థమన్ దంచుడు… తనకు తెలిసిన బీజీఎం అంటే మోత, అతి… ఎక్కువ డెసిబిల్స్ సౌండ్ అంటే ఎక్కువ దంచినట్టు అట… బీజీఎం మోత మీద పెట్టిన శ్రద్ధ పాటలు, ట్యూన్స్ మీద పెడితే బాగుండేది… నిజానికి ఆ డైలాగ్స్ మామూలుగా చెప్పినా బాగానే ఉంటాయి, కానీ బాలయ్య కదా, అరిచి చెప్పాల్సిందే, లేకపోతే పేలవా..? ఏమో… బోయపాటి ఇలాంటివి అస్సలు పట్టించుకోడు…

akhanda

  • నటీనటుల విషయానికి వస్తే బాలయ్యకు తిరుగేముంది..? యాక్షనే కాదు, తల్లి అంత్యక్రియలు వంటి కొన్ని ఎమోషనల్ సీన్లలోనూ తన అనుభవాన్ని రంగరించాడు… నిజానికి అఖండ అంటే బాలయ్య, అంతే… తనకు తప్ప ఇంకెవరికీ సూట్ కాదు అన్నట్టుగా చేశాడు… సంయుక్త  ప్రయారిటీ లేని పాత్ర… ఉన్నంతలో హర్షాలి పాత్ర బెటర్… చైనా ఆర్మీ జనరల్ పాత్రలో షాంఘై షెల్ట్రిం, మాజీ జనరల్ పాత్రలో శాశ్వత ఛటర్జీ, ప్రధాని పాత్రలో సర్వదమన్ బెనర్జీ, క్షుద్ర మాంత్రికుడు ఆది పర్లేదు…

ప్రస్తుతం సినిమా ట్రెండ్ ఏమిటి..? సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్ టచ్ ఏదో ఒకటి బలంగా ఉండాలి కదా… ఇందులో అన్నీ కలిపి కొట్టారు… ఏమాటకామాట… హైందవం మీద, చైనా కల్చర్‌తో తేడా మీద డైలాగ్స్ బాగున్నాయి… కుంభమేళా సీన్స్, హిమాలయాల సీన్స్ చిత్రీకరణ గట్రా నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి…

akhanda

బాలయ్య ఫ్యాన్ కోణంలో చూస్తే, సినిమా అఖండం… అలాగే చూడాలి… గతంలో బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణిలో పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి… బాలయ్య అరిచి చెప్పడు, స్పష్టంగా, అర్థమయ్యేలా ఉంటుంది డిక్షన్… ప్చ్, అలా చెప్పిస్తే బోయపాటికే నచ్చదు, బాలయ్యకు నప్పదు అనుకుంటాడు… అవునూ, ఈ రేంజ్ యాక్షన్ సీన్లు, ఈ హై డెసిబిల్స్ సౌండ్స్‌తో ఓ రేంజ్, ఓ లెవల్‌కు తీసుకుపోయారుగా, తరువాత సినిమా ఎలా ఉండాలి..? దీనికి రెట్టింపు ‘స్టాండర్డ్’ సెట్ చేయాలా..?!

కానీ ఏమాటకామాట అఖండకు పూర్తి కంట్రాస్టులో బాలయ్య తన నాన్న ఎన్టీయార్‌లాగే ఓ వీరబ్రహ్మేంద్రస్వామి వంటి సాత్విక, ధార్మిక పాత్ర చేస్తే చూడాలని ఉంది..!! తల్లి కడుపులో ఉన్నప్పుడే జైబాలయ్య నినాదం విన్న అభిమన్యుడు కదా... చేస్తాడేమో చూడాలి..!!


వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నీడలా అంటిపెట్టుకుని ఎప్పుడూ ఓ సూరీడు కనిపిస్తుండేవాడు… జుట్టు తెల్లగా, మీసాలు మాత్రం నల్లగా… నిగనిగ… బాలయ్య అఖండ లుక్ చూడగానే గుర్తొచ్చే కేరక్టర్ సూరీడే… గడ్డం పూర్తిగా నెరిసి, మీసాలు మాత్రం నల్లగా… మరి బాలయ్య పౌరుషం కదా… ఎన్నటికి నెరిసేదే లేదన్నమాట… లుక్కు కూడా లాజిక్కుకు అందకూడదు మరి, అంతే…!!


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే బాలయ్య, ఆపై బోయపాటి… ఇంకేం..? తెరపై అఖండ తాండవం..!!
  • మోడీ కరెక్ట్… ఒవైసీ చెబితే వింటాడు… టీబీజేపీ ఎంపీలు తలో దిక్కు…
  • డియర్ రామ్మోహన్ నాయుడూ… ఓసారి ఈ పైలట్ లేఖ చదువుతావా…
  • నిలువు దోపిడీ..! నేతి లడ్డూలో నెయ్యి లేదు… పట్టు శాలువాలో పట్టు లేదు..!!
  • తెర మీద మాయమై… పోలాండ్‌లో హోటల్ వ్యాపారిగా రూపాంతరం…
  • వివాహ భోజనంబు..! షడ్రుచుల విందు… కాస్త కామెడీ డోస్ మెండు..!!
  • ‘కక్క’ వేముల ఎల్లయ్య ఒక్కడే… ఒక మహోద్యమం..! ఓ అవలోకనం..!!
  • పానీపూరి అమ్మిన లాభాలతో ఏకంగా హెలికాప్టర్ కొనేశాడా..? నిజమేనా..?!
  • ఆ ఊళ్లో ఎవరింట్లోనూ వంటశాల ఉండదు, ఎవరూ వండుకోరు…
  • డబ్బు పంచం, మందు తాపం.,. వోట్లు కొనం…… తరువాత మీ ఇష్టం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions