.
అవును, మీరు చదివిన శీర్షిక, ఆ పోలిక కరెక్టే… ఫుల్ కంట్రాస్టు కాబట్టి… అక్కడ బెంగాల్‌లో, అదీ ఇండియన్ ఫుట్‌బాల్ అడ్డాలో… మమతా బెనర్జీ నాయకత్వంలో… లియెనిల్ మెస్సీ గోట్ టూర్ (G.O.A.T … Greatest of all time) కోల్‌కత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో అట్టర్ ఫ్లాప్… లక్ష మంది ప్రేక్షకుల ఆగ్రహం, ఉద్రిక్తత…
ఇక్కడ హైదరాబాదులో అదే మెస్సీ టూర్ ఆనందోత్సాహాల నడుమ… సాఫీగా… సరదాగా… స్మూత్‌గా… వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల నడుమ విజయవంతంగా జరిగింది… ఎస్, రేవంత్ రెడ్డి ఆడుతూ పాడుతూ సూపర్ గోల్ కొట్టాడు… (హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం అంటే ఇదీ…)
Ads

నిజానికి కోల్‌కత్తాలో ఫుట్‌బాల్ ఈవెంట్లు కొత్త కాదు… గతంలో చాలామందిని పట్టుకొచ్చిన శతద్రు ఈసారి మెస్సీ పర్యటనను ఆర్గనైజ్ చేశాడు… కానీ ఈవెంట్ నిర్వహణలో టీఎంసీ ప్రభుత్వం ఫ్లాప్… అడుగడుగునా నిర్వహణలోపాలు… వీఐపీలు, టీఎంసీ నేతలు ఆటోగ్రాఫులు, సెల్ఫీలకు ఎగబడ్డారు… దాంతో జస్ట్, కాసేపు ఉండి, మెస్సీ వెళ్లిపోయాడు…

తన కోసం వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహంతో కుర్చీలు, బాటిల్లు, చేతికి ఏది అందితే అది గ్రౌండ్‌లోకి విసిరారు… ఉద్రిక్తత… ఒక దశలో స్టేడియం వెళ్లాలనుకున్న మమత అక్కడి పరిస్థితి తెలిసి వెనక్కి తగ్గింది… సిగ్గుతో తలదించుకుని మెస్సీకి, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది… అంతర్జాతీయ యవనిక మీద కోల్‌కత్తా పరువు పోయింది… నెటిజనం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు బెంగాల్ పోలీసులను, మమత నిర్వాకాన్ని…
సీన్ కట్ చేస్తే… మెస్సీ హైదరాబాద్ వచ్చాడు… ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్లేయర్ అవతారం ఎత్తాడు… దేశ రాజకీయ యవనిక మీద ఎప్పుడూ చూడని సీన్… సీఎం ఓ ప్లేయర్‌గా ఆడాడు… అఫ్‌కోర్స్, అదొక సరదా, ఎగ్జిబిషన్ మ్యాచ్… సీరియస్ మ్యాచ్ కాదు…

- కానీ ఎంత ఆహ్లాదకరంగా ఆర్గనైజ్ చేశారనేది ముఖ్యం… అందులో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సూపర్ సక్సెస్… కోల్‌కత్తా ఫ్లాప్ షో కారణాలు తెలిసి పోలీసులు అప్పటికప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకుని, అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా… కంట్రోల్ చేశారు…
లియోనల్ మెస్సీ మేనేజర్, ఆయన భద్రతా బృందం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి . శివధర్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబులను ప్రత్యేకంగా ప్రశంసించారు… ఈ హైప్రొఫైల్ మ్యాచుకు వచ్చిన గెస్టులకు భద్రత, ఎస్కార్ట్‌తోపాటు ముఖ్యంగా స్టేడియం లోపల, బయట ట్రాఫిక్ నియంత్రణ, వేలాది మంది ప్రేక్షకులకు భద్రత తదితర అంశాలు… స్టేడియం దగ్గర ఏర్పాట్లు బాగున్నాయని మెస్సీ టీమ్ అభినందించింది… కోల్‌కత్తాలో చేదు అనుభవాలు చూశాక హైదరాబాద్ ఏర్పాట్లు వాళ్లకు బాగా నచ్చేశాయి…
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె పిల్లలతోపాటు… హైదరాబాదులోని వీవీఐపీలు… ఆ ఆటను వినోదంగా వీక్షించారు… మొన్నటికిమొన్న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం దీన్ని కూడా అలవోకగా సక్సెస్ చేసింది… గుడ్…

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా డ్రోన్ల ప్రదర్శనతో గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు… అక్కడ కీరవాణి… ఇక్కడ మెస్సీ టూర్ సందర్బంగా రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ పాటలు… (గ్లోబల్ సమ్మిట్, ఫుట్‌బాల్ మ్యాచ్… రేవంత్ రెడ్డి మనవడు రేయాన్ష్ రెడ్డితో కలిసి ఎంజాయ్ చేశాడు… 56 ఏళ్ల తాత తన గావురాల మనమడితో…)
జుబిలీ హిల్స్ ఉపఎన్నికలో ఘనవిజయపు సంతోషం… పంచాయితీ ఎన్నికల్లో అనూహ్య సానుకూల ఫలితాల ఆనందం… గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ ఉత్సాహం, మెస్సీ గోట్ టూర్ ఉల్లాసం… హైకమాండ్‌తో సాన్నిహిత్యంపై స్పష్టతనిచ్చిన రాహుల్ రాకడ… రేవంత్ రెడ్డి గ్రహచారం బాగున్నట్టుంది..! పార్టీపై, ప్రభుత్వంపైనా గ్రిప్ పెరిగింది…
అన్నట్టు... జాతీయ మీడియా, విదేశీ మీడియా హైదరాబాద్ మెస్సీ టూర్‌కు, రేవంత్ రెడ్డి ఆతిథ్యం, కలుపుగోలుతనానికి మంచి ప్రయారిటీ ఇచ్చాయి... కోల్‌కత్తా ఫుట్‌బాల్ ప్రేమికులు కుళ్లుకుంటున్నారు హైదరాబాద్ మ్యాచ్ చూసి..!!

Share this Article