ఫ్యామిలీ మ్యాన్ స్థాయికి టాలీవుడ్ చేరుతుందా.?
సిరీస్ ఒక్కటి, ఎపిసోడ్లు పది, ఒక్కోటి 50 నిమిషాలు… ఇది ఆమెజాన్ ప్రైంలో ఫ్యామిలీ మాన్ గురించి…
ఇద్దరు తెలుగు కుర్రాళ్లు.., తిరుపతికి చెందిన నిడుమోరు రాజు, చిత్తూరుకు చెందిన దాసరి కొత్తపల్లి కృష్ణ.. ఇద్దరు కలిసింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీ, తిరుపతిలో. మంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ లో స్థిరపడ్డా.. మనసెందుకో మళ్లీ ఇండియా వైపే లాగింది. నిడుమోరు రాజు కాస్తా రాజ్‌గా, దాసరి కృష్ణ కాస్తా.. డీకేగా మారిపోయారు. కొన్ని వెబ్ సిరీస్‌లు తీసినా.. గో గోవా గాన్‌తో దశ తిరిగింది. తెలుగులో డి ఫర్ దోపిడి అనే సినిమాను సొంతంగా నిర్మించారు కూడా. సినీ రంగంలో ఎన్ని చేసినా, ఎన్ని తీసినా.. ది ఫ్యామిలీ మాన్ మాత్రం ఓ సెన్సేషన్. యావత్తు దేశం.. ఆ మాటకొస్తే.. ప్రపంచవ్యాప్తంగా రాజ్, డీకే పేరు మారుమోగింది ఫ్యామిలీ మాన్‌తో. కథ అంతా రాజ్, డీకే సొంతగా రాసుకున్నారు, డైలాగ్‌లు మాత్రం సుమిత్ అరోరాతో రాయించారు.
ఒక్కటి చూద్దామని ఆన్ చేస్తే.. పది ఎపిసోడ్లు చూసేవరకు నిద్రపోం. ఎక్కడా చూపు తిప్పుకోనియదు. 50 ఇంచుల టీవీ అవసరం లేదు, 5 ఇంచుల మొబైల్ అయినా ఫరావాలేదు. మొత్తం చూసే వరకు లేవలేం.
Ads
ఏముంది ఫ్యామిలీ మాన్లో..?
ముంబైలో ఓ కామన్ మెన్‌కు సంబంధించిన అన్ కామన్ లైఫ్..
ఓ మధ్యతరగతి భర్త, పేరు శ్రీకాంత్ (మనోజ్ భాజ్‌పాయ్, నార్త్ ఇండియన్) చాలీచాలని జీతం, ఇంట్లో బోలెడు ఇష్యూలు (సమస్యలని చెప్పలేం కానీ..), ఎప్పటికైనా ఓ సొంత అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్న కల…
భర్త తన ఇష్టాలను పట్టించుకోవట్లేదన్న అసంతృప్తిలో భార్య.. పేరు సుచిత్ర అయ్యర్ (మనకు బాగా తెలిసిన ప్రియమణే) తనకు బోలెడు తెలివి ఉన్నా.. చిన్న ఉద్యోగంలోనే సర్దుకుపోతున్నానన్న బాధ, అదే సమయంలో పైకి ఎదగాలన్న తాపత్రయంలో తెలిసీ తెలియకుండానే పక్కదారి పట్టించే పరిస్థితులు..
అప్పుడప్పుడే కౌమారంలో అడుగుపెట్టిన కుమార్తె.. ప్రపంచంలో ఉన్న సంతోషాన్నంతా మొబైల్లో చూసుకోవాలనుకున్న తాపత్రయం.. తెలియకుండానే డ్రగ్స్ రుచి చూపించాలన్న స్నేహితులు…. పదేళ్ల కొడుకు.. బోలెడు అల్లరి…
ఇంతేనా కథ.. కాదు, ఇందులోనే ఇంకో పార్శ్యముంది…
పైకి సాదాసీదాగా కనిపించే శ్రీకాంత్.. చేసే ఉద్యోగం NIAలోని TASC అనే డిపార్ట్మెంట్లో… ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగంలో మనోజ్ బాజ్‌పేయ్ పూర్తిగా జీవించేశాడు. దేశంలో ఉగ్రవాద దాడులను ముందే పసిగట్టే ఉద్యోగం. తలా తోక లేని పని. గమనించిన ప్రతీ విషయాన్ని మరో దాంతో లింకు చేస్తూ అనుమానించాల్సిన ఉద్యోగం. చివరకు భార్యను కూడా.
మన తెలుగు సినిమాల్లోగా సిక్స్ ప్యాక్‌తో కండలు తిరిగిన బాడీ ఏమి కాదు. సీరియస్ పోలీస్ అధికారిగా మనోజ్ భాజ్పాయ్ను ఎందుకు ఎంచుకున్నారో అనుకుంటామేమో కానీ.. అసలు పాత్రకు ప్రాణం పోశాడు. మనోజ్ బాజ్‌పాయ్‌కి ఇదే మొదటి వెబ్ సిరీస్. ఈ పాత్రకు తొలుత అక్షయ్ ఖన్నాను అనుకున్నారట. చర్చలు కూడా పూర్తయ్యాయి కానీ, రెమ్యూనరేషన్ విషయంలో లెక్క కుదరలేదు. ఎంత సాదాసీదాగా మొదలెట్టారంటే.. ఫ్యామిలీ మాన్ టీజర్ పోస్టర్ కోసం వన్ ప్లస్ ఫోన్‌తో ఫోటోలు తీశారట.
సిరీస్ అంతా ఎక్కడా అతిశయోక్తి అనిపించదు. ఎక్కడా కథ బిగి సడలదు. స్క్రీన్ ప్లేను మరో స్థాయికి తీసుకెళ్లగలిగాడు డైరెక్టర్. ఆపరేషన్ జుల్ఫికర్ చుట్టే కథ అంతా నడుస్తుంది. 70 శాతం ముంబైలో, కొంత కశ్మీర్లో, మరికొంత ఢిల్లీలో.
కొన్నే లోకేషన్లు. ఓ ఆస్పత్రి, ఓ ఇల్లు, ఓ ఆఫీసు, ఓ కంటోన్మెంట్, కొన్ని కశ్మీర్ సీన్లు.. మిగతా వన్నీ నాచురల్ లోకేషన్లే. ఎక్కడా భారీ సెట్టింగులు లేవు.
నటుల విషయంలో రాజ్ & డీకే ఎంచుకున్న పంథానే సగం సక్సెస్ తెచ్చిందేమో. మనోజ్ బాజ్‌పేయి పూర్తిగా నార్త్. వయస్సు 52 ఏళ్లు. అయినా సినిమా మొత్తం బాజ్‌పేయి చుట్టునే తిరిగింది. ఇక ప్రియమణి గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ్, మళయాళీలో ఊపేసింది. బ్రేక్ తర్వాత ఫ్యామిలీ మాన్లో అదరగొట్టింది. ఫోర్స్ వన్ ఆఫీసర్ పాషాగా మన తెలుగోడే కిషోర్ కుమార్, కొత్త పోలీసు అధికారిగా తెలుగమ్మాయి ధన్వంతరి శ్రేయ, భయపెట్టే విలన్ మూసాగా మళయాళం డాన్సర్ నీరజ్ మాధవ్.. మరో కీలకమైన పాత్రలో సందీప్ కిషన్.. ఇలా ఎవరి పాత్రల్లో వాళ్లు జీవించేశారు.
పది ఎపిసోడ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా బోర్ కొట్టించే సీను లేదు. ఎక్కడా ఫార్వార్డ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆ మాటకొస్తే.. వెనక్కి వెళ్లి మళ్లీ మళ్లీ చూసే సీన్లు బోలెడు.
ఒక వ్యక్తిని గొప్పగా చూపించాల్సిన హీరోయిజం అవసరం ఫ్యామిలీ మాన్కు రాలేదు. నిజానికి హీరో భార్య.. మరొకరితో తిరుగుతుంటే సగటు టాలీవుడ్ ప్రేక్షకుడయితే జీర్ణించుకోలేడు. ఉన్నదున్నట్టుగా స్ట్రేయిట్‌గా మన కళ్ల ముందు కథ నడుస్తుంటుంది.
ఇప్పుడు జూన్ 4న సెకండ్ సిరీస్. ఓ అడుగు ముందుకేసి సమంతాను దించేశారు. ఇప్పటికే ప్రోమోలు దుమ్మురేపుతున్నాయి. వివాదాలు చుట్టుముడుతున్నాయి. అయినా నాకేంటీ అన్నట్టుగా ధీమాగా ఉన్నారు రాజ్ & డీకే. రెండో సిరీసే కాదు.. మూడో సిరీస్ కూడా తీస్తున్నామని ముందే ప్రకటించడమంటే ఎంత దమ్ము, ధైర్యం ఉండాలి. హ్యాట్సాఫ్ రాజ్ & డీకే… ఇదే స్థాయిలో ఓ తెలుగు సినిమాను ఎక్కించకూడదా..! అత్యాశ అవుతుందా..?…………… — స్వప్న పచ్చిమట్ల, సికింద్రాబాద్, pachimatlaswapna@gmail.com
Share this Article