.
అనుకుంటాం గానీ… గురివింద టైపు మన జర్నలిజం… ప్రత్యేకించి మహిళా జర్నలిస్టుల పట్ల వివక్ష… మహిళలు- సమానావకాశాలు వంటి ఎన్నో కథనాలు రాసీ రాసీ అలిసిపోయామే తప్ప… ఓ ప్రఖ్యాత, ప్రభావశీల ప్రెస్‌క్లబ్ అధ్యక్ష పీఠం దాకా మహిళను అస్సలు రానివ్వలేదు…
కానీ ఆ అడ్డుగోడ ఇప్పుడు బద్ధలైంది… ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) కు తొలి మహిళా అధ్యక్షురాలు ఎన్నికైంది… అదీ బంపర్ మెజారిటీతో… ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్టు… ఏ ప్రముఖ మీడియా ప్రతినిధి కాదు, ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేసుకుంటున్న ఆమె ఆ కుర్చీ ఎక్కడం ఓ విశేషమే…
Ads
ఎంతో సుదీర్ఘమైన చరిత్ర, సంప్రదాయాలు కలిగిన ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (PCI) పీఠాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా సంగీతా బరూహ్ పిషారోటి రికార్డు సృష్టించింది… సంస్థాగతమైన పాత్రికేయ విలువలు, విధానాలను ప్రతిబింబించే ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఒక మహిళా అధ్యక్షురాలు రావడం కేవలం లింగ సమానత్వానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నేటి మీడియా వాతావరణంలో స్వతంత్ర పాత్రికేయానికి దక్కిన ఒక గొప్ప గుర్తింపు…
అసాధారణ విజయం: ఒక నిర్ణయాత్మకమైన మద్దతు
సంగీతా బరూహ్ పిషారోటి సాధించిన విజయం కేవలం గౌరవప్రదమైనది మాత్రమే కాదు, ఇది ఒక నిర్ణయాత్మకమైన ప్రజాతీర్పు... ఆమెకు పోలైన మొత్తం 1,019 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అతుల్ మిశ్రా (129 ఓట్లు)పై భారీ మెజారిటీని దక్కించుకుంది… ఇంతటి విస్తృతమైన మెజారిటీ, ఈ విజయం కేవలం లింగ సమతుల్యతకు చిహ్నం మాత్రమే కాదు.., జర్నలిస్టులు ఏదో స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారనీ, పాత నాయకత్వాలు, వాళ్ల మేనేజ్‌మెంట్ ధోరణుల పట్ల అసంతృప్తితో ఉన్నారని కూడా అర్థం..!
స్వతంత్ర జర్నలిజానికి కిరీటం
ఈ విజయంలో ఆసక్తికరం ఏమిటంటే, ఆమె స్వతంత్ర జర్నలిస్ట్ కావడం… ఎటువంటి మీడియా సంస్థకు అనుబంధం లేకుండా, తన నైపుణ్యం, వృత్తికి మాత్రమే కట్టుబడి ఉండడం ఈ రోజుల్లో ఒక సాహసం… సంస్థాగతమైన ఒత్తిడికి లోను కాని ఒక స్వతంత్ర స్వరం PCIని నడిపించబోతోంది అనడం, క్లబ్ ప్రయాణం దిశలో ఒక సానుకూల మలుపును సూచిస్తుంది…
సంగీతా బరూహ్ పిషారోటి: ఒక పరిచయం
సంగీతా బరూహ్ పిషారోటి సుదీర్ఘ కాలం పాటు పాత్రికేయ రంగంలో ఉంది…
-
పాత అనుబంధం…: ఆమె చాలా సంవత్సరాలు ది హిందూ దినపత్రికలో పనిచేసింది.., ముఖ్యంగా ‘మెట్రో ప్లస్’ విభాగంలో తమ సేవలను అందించింది…
-
ది వైర్…: తరువాత, ఆమె ది వైర్ వంటి డిజిటల్ మీడియా సంస్థల్లో కూడా కీలక పాత్ర పోషించింది… అయితే గత సంవత్సరం ఆ సంస్థ నుండి వైదొలిగింది…
-
ఈశాన్య ప్రాంత నిపుణురాలు…: ఆమె ఈశాన్య భారతదేశం (North East) అంశాలపై గొప్ప పరిజ్ఞానం కలిగి ఉంది… అస్సాం, దాని సంస్కృతిపై ఒక పుస్తకాన్ని కూడా రాసింది…
-
వ్యక్తిగత జీవితం…: ఆమె మలయాళీ అయిన మోహన్ పిషారోడి (మాజీ UNI ఉద్యోగి)ని వివాహం చేసుకుంది… వారి కుమార్తెకు ‘ఓమన’ అనే మలయాళీ పేరు పెట్టుకున్నారు…
- ఆమెది అస్సాం… ఫస్ట్ పోస్టింగ్ యూఎన్ఐలో… ఈ కొత్త నాయకత్వం చాలా మంది పాత సభ్యులకు తిరిగి క్లబ్‌లోకి రావడానికి ఒక సౌకర్యవంతమైన, స్వాగతించే వాతావరణాన్ని అందిస్తుందని ఆశించవచ్చు…
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా రెండోసారి పాలమూరుకు చెందిన చెందిన మన తెలుగు జర్నలిస్టు పబ్బ సురేశ్ బాబు ఎన్నికయ్యాడు…
మొన్నమొన్ననే కదా హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి ... వచ్చే ఎన్నికలకు ఎవరైనా ప్రిపేర్ అయిపొండి... ఏమో, ఢిల్లీ అనుభవం ఇక్కడ రిపీట్ కావద్దని ఏముంది..? ఇంకెన్నాళ్లు ఈ మగ పెత్తనాలు..?!
Share this Article