.
మావోయిస్టు పార్టీ దురవస్థకు కారణాలేమిటి..? నక్సలైట్ల పోరాటంపై ఆసక్తి, అవగాహన ఉన్నవాళ్లకు ప్రధానంగా స్థూలంగా కనిపించే కొన్ని కారణాలు…
రిక్రూట్‌మెంట్ లేదు… కరెంట్ జనరేషన్‌కు సాయుధ పోరాటాలు, త్యాగాల మీద సానుకూలత లేదు, ఆసక్తీ లేదు… ప్రజెంట్ నాయకత్వం అనారోగ్యాలతో, వృద్యాప్య సమస్యలతో సతమతం అవుతోంది… ఈ పోరాట అంతిమ లక్ష్యం ఏమిటో కేడర్‌కే స్పష్టత లేదు, నమ్మకం లేదు… రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అయితే ఇతర లెఫ్ట పార్టీల్లాగా జనంలో ఉంటూ, అనవసర ప్రాణ త్యాగాలు లేకుండా పోరాడొచ్చు కదానే జెన్‌జీ ప్రశ్నకు మావోయిస్టు పార్టీ దగ్గర జవాబు లేదు…
Ads
ఇంకా ఆ పడికట్టు పదాల మార్మిక సిద్ధాంతాల నుంచి, విదేశీ రాజకీయ భావజాలాల నుంచి బయటపడి, ఈ దేశానికి సరిపడేలా ఇండియనైజ్ కాకపోవడం…అన్నింటికీ మించి ఆదివాసీల మద్దతు కోల్పోవడం, గిరిజనమే వాళ్లపైకి తుపాకులు ఎక్కుపెట్టడం… దీనికితోడు రాజ్యం బలగాల దూకుడు… ఎప్పటికప్పుడు కీలక నాయకుల సమాచారం బలగాలకు చేరుతుండటం… కోవర్టులు, ఇన్‌ఫార్మర్లు బలపడిపోవడం…
…… మరి ఆత్మ విమర్శ జరగలేదా..? నష్టాల కారణాల విశ్లేషణ, పరిష్కార ప్రయత్నాల మథనం జరిగింది… 2024 డాక్యుమెంట్ అదే చెబుతోంది… పొలిట్ బ్యూరో మథనానికి సంబంధించిన కీలకాంశాలు ఇవిగో… (కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా కూడా కనిపిస్తున్నాయి…)

మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో 2024 పత్రంలో సంచలన విషయాలు
2024 ఆగస్టు నెలలోనే ఈ డాక్యుమెంటును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పంపంది పోలిట్ బ్యూరో… ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్దాం అన్న సమాచారంతో క్యాడర్ కు చేరంది డాక్యుమెంట్… (ఆయుధాలు వదిలేయడమే ప్రధాన చర్చనీయాంశం… ఇటీవల లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్లు కూడా ఇదే చెబుతూ ఆయుధాలతోసహా బయటికొచ్చారు…)
గడిచిన మూడు సంవత్సరాలుగా వివిధ ఎన్కౌంటర్లలో 683 మంది చనిపోయారు… వీళ్లలో 190 మంది మహిళలు ఉన్నారు.. గడిచిన మూడు సంవత్సరాలుగా మావోయిస్టులు 669 ఆపరేషన్లు నిర్వహించారు… వీళ్లలో 261 పోలీసులు మృతిచెందగా, 516 మంది గాయపడ్డారు… 25 కు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు…
2019 పార్టీ వారోత్సవంలో కీలక నిర్ణయం తీసుకుంది…. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని అనేక మార్పులను సూచించింది డాక్యుమెంట్…

2021 నుంచి (ఈ డాక్యుమెంట్ రచన నాటికి) పార్టీ కీలక నేతలను కోల్పోయింది… వీళ్లలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు లక్ము, అంబీర్, సాకేత్, ఆనంద్ అనారోగ్యం కారణంగా చనిపోయారు… తరువాత చాలామంది పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు, మరి కొంతమంది అరెస్టు అయ్యారు… ఈ తరుణంలో నార్త్ తో పాటు సౌత్ ప్రాంతాలలో కేంద్ర కమిటీ నేరుగా దృష్టి పెట్టలేకపోయింది…
ఈస్ట్ తో పాటు సెంట్రల్ రీజన్స్ కమిటిల మధ్య సమన్వయం లేకుండా పోయింది… కేంద్ర కమిటీ నుంచి ఏరియా లెవెల్ వరకు అనేక మందిని కోల్పోవడంతో పార్టీ బలహీన పడింది… బలగాల చర్యలను తిప్పి కొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్ జోనల్ కమిటీలు విఫలమయ్యాయి… 2020 లో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలోనే పార్టీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఊహించాం… గడచిన మూడు సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ చాలా బలహీన పడింది…
2020 లో జరిగిన పొలిట్ బ్యూరోలో అనేక విషయాలు చర్చించాం… అందులో ఒకటి, మాస్ బేస్ ను ఆకర్షించేలా వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలి…. కానీ గడచిన మూడేళ్లుగా పార్టీలో ఇది లోపించింది…
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని మొత్తం 7 ఏరియాలుగా విభజించాం! పార్టీలో గోప్యత లోపించింది… 2012 లో ఇలానే సెట్ బ్యాక్ ఉండేది… కానీ, 2013 లో దాన్ని రెక్టిఫై చేసుకున్నాం… మాస్ పీపుల్ కు దగ్గరవటంలో మనం విఫలమయ్యాం…
దేశవ్యాప్తంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా మన సమస్యగా పోరాడాలి… పార్టీలో రిక్రూట్మెంట్ నిరంతరంగా కొనసాగాలి… ప్రతి చర్యపై సోషల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే… మాస్ ఆర్గనైజేషన్లో పట్టు ఉన్నప్పుడే పార్టీ కోలుకోగలుగుతుంది… ఇప్పటివరకు జరిగిన నష్టాల గురించి ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు…
పార్టీ కమిటీలలో మూడు జనరేషన్లు ఉండేలా చూసుకోవాలి… ఒక సీనియర్ తోపాటు, మధ్య వయసు గలవారు, ఒక జూనియర్ ను కలిపి కమిటీల్లో సభ్యులను పెట్టుకోవాలి… కొత్తగా మాస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేసుకుంటేనే పార్టీ నిలబడుతుంది… మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు నిర్వహించి తెలుసుకోవాలి… ఎప్పటికప్పుడు ప్లేస్ లు మారుస్తూ ఉండాలి. ఒకేచోట ఉండకూడదు…

సో, 2020 లోనే రాబోయే నష్టాలు, పార్టీ దురవస్థ గురించి అంత చర్చించి, అన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా… ఏవీ అమల్లోకి రాలేదు… ఇక 2024లో ఆయుధ విరమణ చర్చ దాకా వెళ్లింది మథనం… కానీ సెంట్రల్ పార్టీ తుది నిర్ణయం తీసుకోలేదు, తీసుకునే అవకాశాలూ కనిపించలేదు, మరోవైపు భారీగా కేడర్ నేలకొరుగుతోంది… సెంట్రల కమిటీ సభ్యుల ప్రాణాలకే దిక్కులేదు… ఇంకా ఎన్నాళ్లు ఈ అనవసర ప్రాణత్యాగాలు అనుకుని ఇక కీలకనేతలు లొంగుబాటపట్టారు… ఇదీ జరిగింది, జరుగుతోంది…!!
Share this Article