.
ఒక్కసారి ఊహించండి… తెలుగులో ఎవరైనా ఓ టాప్ స్టార్‌కు వ్యతిరేకంగా, తప్పుపడుతూ ఎవరైనా చిన్న నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని నోరు విప్పగలదా..? గళమెత్తితే తెల్లవారి ఇండస్ట్రీలో ఉండగలదా..? హీరోల ఆభిజాత్యాలకు పెద్ద పెద్ద నిర్మాతలే వాళ్ల కాళ్ల మీద పడి పాకుతున్న స్థితిలో స్మాట్ ఆర్టిస్టుల గొంతు పెగులుతుందా..?
కానీ కొంతలోకొంత మలయాళ ఇండస్ట్రీ కొంత డిఫరెంట్… ఎంత పెద్ద తోపు నటులైనా సరే, తమకు నచ్చకపోతే మీడియాలో కడిగేస్తుంటారు, ప్రత్యేకించి చిన్న ఆర్టిస్టులు కూడా భయపడరు… ఓ పెద్ద ఉదాహరణ చూద్దాం… ఎందుకంటే… మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను కూడా కడిగేస్తున్నారు కాబట్టి..!
Ads
- వివరాల్లోకి వెళ్తే… కేరళ చలనచిత్ర పరిశ్రమను గత ఎనిమిదేళ్లుగా కుదిపేస్తున్న “నటిపై లైంగిక దాడి కేసు” (2017 Kerala Actor Assault Case) ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది… నటుడు దిలీప్ నిర్దోషిగా విడుదల కావడం, వెంటనే తన సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టడం, దానికి మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మద్దతు తెలపడం తీవ్ర వివాదానికి దారితీసింది…

అసలు కేసు ఏమిటి? (The 2017 Incident)
ఫిబ్రవరి 17, 2017న ఒక ప్రముఖ మలయాళ నటి (భావన… ఆమే సోషల్ నిందకు భయపడకుండా స్వయంగా బయటికొచ్చి పలుసార్లు మీడియాలో చెప్పుకుంది కాబట్టి పేరు రాస్తున్నాను)… షూటింగ్ ముగించుకుని కొచ్చికి ప్రయాణిస్తుండగా, కొందరు వ్యక్తులు ఆమె కారును అడ్డగించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు… ఆ దృశ్యాలను వీడియో కూడా తీశారు…
-
ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని.
-
అయితే, ఈ ఘోరానికి అసలు సూత్రధారి నటుడు దిలీప్ అని, వ్యక్తిగత కక్షతో ఆయనే సునికి ఈ పనికి సుపారీ ఇచ్చాడని పోలీసులు ఆరోపించారు… జూలై 2017లో దిలీప్‌ను అరెస్టు చేశారు… ఆయన సుమారు 85 రోజులు జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చాడు…
కోర్టు తీర్పు: ఎందుకు వివాదం?
- సుదీర్ఘ విచారణ తర్వాత, ఇటీవలే కొచ్చిలోని ప్రత్యేక కోర్టు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది… నిజానికి నిర్దోషి అని కాదు, సాక్ష్యాధారాలు సరిగ్గా లేవని కోర్టు పేర్కొంది… (అంటే, పోలీసులు నేరాన్ని నిరూపించలేని వైఫల్యమే తప్ప నేరం జరగలేదని కాదు… పోనీ, దిలీప్ చేయించాడని కాదు…)
-
విమర్శ….: ఈ తీర్పుపై బాధితురాలి మద్దతుదారులు మండిపడుతున్నారు… కోర్టులో బాధితురాలిని విచారించిన తీరు అత్యంత అమానవీయంగా ఉందని, సాక్ష్యాలను తారుమారు చేశారని డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి వంటి వారు ఆరోపిస్తున్నారు…

‘భా భా బ’ (Bha Bha Ba) – తాజా వివాదం
దిలీప్ నిర్దోషిగా ప్రకటించబడిన వెంటనే, ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘భా భా బ’ (భయం, భక్తి, బహుమానం) ట్రైలర్‌ను విడుదల చేశారు… ఈ సినిమా పోస్టర్‌ను సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు…
- భాగ్యలక్ష్మి విమర్శ…: “మనందరం ప్రేమించే మోహన్‌లాల్ కనీసం ఒక్క నిమిషం ఆలోచించకుండా ఈ పోస్టర్‌ను ఎలా షేర్ చేస్తాడు? బాధితురాలి పక్షాన నిలబడాల్సిన బాధ్యత లేదా?” అని సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి ప్రశ్నించింది… బాధితురాలు ఎదుర్కొన్న నరకం కంటే, కోర్టులో ఆమెను ప్రశ్నించిన తీరు దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది…

ఇతర పరిశ్రమలతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీ భిన్నమైనది. అక్కడ WCC (Women in Cinema Collective) అనే బలమైన వ్యవస్థ ఉంది…
-
రేవతి, పార్వతి తిరువోతు, రిమా కల్లింగల్, భాగ్యలక్ష్మి వంటి వారు ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలను ప్రశ్నించడానికి వెనుకాడరు…
-
గతంలో మోహన్‌లాల్ అధ్యక్షుడిగా ఉన్న ‘అమ్మ’ (AMMA – మలయాళ నటీనటుల సంఘం) నుండి దిలీప్‌ను తొలగించాలని వీరు పెద్ద పోరాటమే చేశారు…
-
ఇండస్ట్రీలో మహిళల పట్ల వివక్ష, వేధింపులపై ఏర్పడిన హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత, ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలపై వీరు మరింత గళం విప్పుతున్నారు…
- దిలీప్ నిర్దోషిగా విడుదలైనా, నైతికంగా ఆయనను బాధ్యుడిని చేస్తూ మలయాళ మహిళా లోకం పోరాడుతోంది… మోహన్‌లాల్ వంటి అగ్ర నటులు దిలీప్‌కు మద్దతు తెలపడం, బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వీరి వాదన… నిజమే, మోహన్‌లాల్ మరీ ఇంత ఇన్‌సెన్సిటివ్ అని ఆయన అభిమానులు కూడా అనుకోలేదు, తనను తనే దిగజార్చుకున్నాడు… సంయమనం పాటించి ఉండాల్సింది…

- మోహన్‌లాల్ వంటి అగ్ర నటులు ఇలాంటి వివాదాస్పద, సున్నిత విషయాల్లో తలదూర్చకుండా ఉంటే బాగుండేదనేది చాలా మంది సినీ అభిమానుల అభిప్రాయం… ఇక్కడే మరొకటీ చెప్పుకోవాలి… ‘అమ్మ’ (AMMA… మలయాళ నటీనటుల సంఘం) సంఘానికి చరిత్రలో మొదటిసారి ఒక మహిళ అధ్యక్షురాలు ఎన్నికౌంది ఈమధ్యే… ఆమె మరెవరో కాదు, ప్రముఖ నటి శ్వేత మీనన్ (Shwetha Menon)…
ఆగస్టు 2024 లో జరిగిన ఎన్నికల్లో…. ఇదే మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఆయన ప్లేసులో ఆమె ఎన్నికైంది… దిలీప్ కొత్త సినిమా, మోహన్‌లాల్ మద్దతు (ఆ సినిమాలో గెస్ట్ రోల్ అట కూడా)పై ఆచితూచి స్పందించింది శ్వేత మీనన్…
- “కోర్టు తీర్పును గౌరవిస్తాం, కానీ బాధితురాలికి జరిగిన అన్యాయం విషయంలో సంఘం ఎప్పుడూ ఆమె వెంటే ఉంటుంది… దిలీప్‌ను మళ్ళీ సంఘంలోకి తీసుకునే (Reinstatement) అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి చర్చలు జరగడం లేదు, తను ప్రస్తుతానికి ‘అమ్మ’లో సభ్యుడు కాదు… నిందితులకు (పల్సర్ సుని వంటి వారికి) పడిన శిక్ష సరిపోదు.., బాధితురాలు పైకోర్టుకు వెళ్తే మా మద్దతు ఉంటుంది…’’
మోహన్‌లాల్ దిలీప్ సినిమాను ప్రమోట్ చేసినప్పుడు ఆమె నేరుగా ఆయన్ని విమర్శించకుండా, సంఘం పరంగా బాధితురాలికి అండగా ఉంటామని బ్యాలెన్స్డ్ గా కామెంట్స్ పాస్ చేసింది… కానీ మల్లిక సుకుమారన్ (పృథ్వీరాజ్ తల్లి) వంటి సీనియర్ నటీమణులు మాత్రం, ఈ వివాదాల సమయంలో ‘అమ్మ’ సంఘం సంబరాలు చేసుకోవడంపై శ్వేత మీనన్ కమిటీని కూడా ప్రశ్నిస్తున్నారు…
(Swetha menon)
ఆ బాధితురాలు ప్రముఖ నటి భావన… ఈ కేసు ప్రారంభమైనప్పటి నుండి దాదాపు ఐదేళ్ల పాటు ఆమె తన పేరును బయట పెట్టలేదు… కానీ 2022లో ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి, తనపై జరిగిన అఘాయిత్యం గురించి, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా స్పందించింది…
-
మౌనాన్ని వీడి…: “నేను బాధితురాలిని మాత్రమే కాదు, ప్రాణాలతో బయటపడిన Survivor” అని ఆమె ప్రకటించింది… అప్పటి నుండి ఆమెకు మద్దతుగా #WithYouBhavana అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది…
-
పరిశ్రమకు దూరం…: ఈ ఘటన తర్వాత ఆమె మానసిక ఒత్తిడి వల్ల మలయాళ చిత్ర పరిశ్రమకు చాలా కాలం దూరంగా ఉండిపోయింది… ఆ సమయంలో ఆమె కన్నడ సినిమాల్లో మాత్రమే నటించింది… (ఇక్కడ శాండల్‌వుడ్‌ను మెచ్చుకోవాలి)… ఆమె ఐదేళ్ల తర్వాత మళ్ళీ మలయాళంలో (Ntikkakkakkoru Premandaarnnu…. తెలుగులో దీన్ని రాయడం కష్టమే) అనే సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది…
( 'న్తిక్కక్కక్కోరు ప్రేమాండార్న్ను' (Ntikkakkakkoru Premandaarnnu)... దీని అర్థం "నా అన్నయ్యకు ఒక ప్రేమకథ ఉండేది" అని...
WCC మద్దతు…: భావన పక్షాన నిలబడటానికే రేవతి, మంజు వారియర్, పార్వతి తిరువోతు వంటి వారు *WCC (Women in Cinema Collective)* స్థాపించారు…
-
ప్రస్తుత పరిస్థితి…: దిలీప్ నిర్దోషిగా విడుదలైనప్పటికీ, భావన తన పోరాటాన్ని ఆపలేదు… కోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…
మలయాళ ఇండస్ట్రీలో భావన పట్ల ఉన్న సానుభూతి వల్లే, మోహన్‌లాల్ వంటి పెద్ద నటులు దిలీప్‌కు మద్దతు తెలపడాన్ని భాగ్యలక్ష్మి లాంటి వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు…
అసలు మంజు వారియర్ పాత్ర ఏమిటి..?
ఈ మొత్తం కథలో మంజు వారియర్ పాత్రే కీలకం… మొత్తం మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది ఆమె కొన్నేళ్లుగా…! ఈమె సదరు కేసులో నిందితుడైన నటుడు దిలీప్ భార్య… మంజు వారియర్, దిలీప్ విడిపోయారు… వారిద్దరూ 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు… అసలు వీళ్ల సంసారంలో కైలాట్కం ఎక్కడొచ్చింది..? అంటే…
1. వివాహం (1998)….: మంజు వారియర్ అప్పట్లో మలయాళంలో టాప్ హీరోయిన్… కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె 1998 అక్టోబర్ 20న నటుడు దిలీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది… పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరమై గృహిణిగా ఉండిపోయింది…. (చాలా సినిమావాళ్ల పెళ్లిళ్లలో ఉన్నట్టుగానే)… వీరికి మీనాక్షి అనే కుమార్తె ఉంది…
2. విడాకులు (2015)…: దాదాపు 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి… 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, జనవరి 31, 2015న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది…
-
కారణం..: దిలీప్‌కు మరో నటి కావ్య మాధవన్‌తో ఉన్న సంబంధమే విడాకులకు ప్రధాన కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి… దీనిపై మంజు వారియర్ కూడా గతంలో కోర్టులో సాక్ష్యం ఇచ్చింది…
-
రెండో పెళ్లి…: విడాకులు తీసుకున్న ఏడాదికే, అంటే 2016లో దిలీప్ నటి కావ్య మాధవన్‌ను వివాహం చేసుకున్నాడు… అంటే కావ్యతో సంబంధాలు నిజమే అని తనే సమాజానికి చెప్పినట్టయింది…

భావన కేసుతో లింక్….. ఇక్కడే ఒక ముఖ్యమైన లింక్ ఉంది… దిలీప్- కావ్య మాధవన్ మధ్య ఉన్న సంబంధాన్ని మంజు వారియర్‌కు మొదట చెప్పింది నటి భావన… తన కాపురంలో నిప్పులు పోసిందని భావనపై కోపంతోనే, దిలీప్ ఆమెపై దాడి చేయించాడనేది పోలీసుల ప్రధాన ఆరోపణ… (కావ్య మాధవన్‌ను కూడా పోలీసులు విచారించారు)…
భావన, మంజు వారియర్ ప్రస్తుత స్థితి...
విడాకుల తర్వాత మంజు వారియర్ మళ్ళీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది... మరోవైపు భావన కూడా..! అవునూ, దిలీప్ రెండో భార్య కావ్య మాధవన్ ఏమంటోంది..? ప్రత్యేకంగా ఏమీ లేదు... దిలీప్ చెప్పగానే సినిమాలు మానేసింది... తను నిర్దోషి అని తీర్పు రాగానే ఇంట్లో సంబురాలు చేసింది... అంటే తోటి నటి భావనపై భర్త దిలీప్ అత్యాచారాన్ని సమర్థిస్తోందా..? నో... ఈ ప్రశ్నకు అసలు జవాబు దొరకదు... రాదు...
- ముగింపు…. మలయాళ ఇండస్ట్రీ నటీనటులు, ఇతర ఆర్టిస్టుల వ్యక్తిగత వివాదాల్ని పట్టించుకోదు, ఆ నిర్మాతలు- దర్శకులు తమకు అవసరమైన వాళ్లను ఎంచుకుంటారు, పనిచేయించుకుంటారు… అంతే… షూటింగ్ స్పాట్ బయట జరిగే యవ్వారాలు, వివాదాలను లైట్ తీసుకుంటారు..!!
Share this Article