.
తిరుమల వెంకన్న అంటే క్షుద్ర రాజకీయ నాయకులందరికీ అలుసే… భక్తులు నిలువు దోపిడీలు ఇచ్చే ఆ దేవుడినే నిలువు దోపిడీ చేసే ‘అన్ ట్రస్టు’ బోర్డులు… నెయ్యి కాని నెయ్యి, సిల్క్ కాని సిల్క్, పరకామణి చోరీలు… అన్యమత ఉద్యోగులు… అక్కడ లేని అరాచకం లేదు…
- కానీ కొన్నిసార్లు కాస్త మెచ్చుకోవచ్చు అనే ఒకటీఅరా మంచి నిర్ణయాలు… అందులో ఒకటిరెండు మొన్నటి టీటీడీ నిర్ణయాలు… ముందు ఆ ప్రకటన చదవండి…
‘‘దివ్య ఔషధ వనం… రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటుకు టీటీడీ ఆమోదం… తిరుమల కొండలకు మరో మణిహారం… భారతీయ సంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది…
Ads

అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు జీవనాడి… అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ సంకల్పించింది… ఔషధ మొక్కలను సంరక్షిస్తూ, ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం… తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తోడ్పడనుంది…
ఈ ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, ఋతు వనం, విశిష్ట వృక్ష వనం, ఔషధ మొక్కలు వంటి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు…..

తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు… ..భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు….
- ….. సంకల్పం, నిర్ణయం మంచివే… కానీ ఇది సరిపోదు… సనాతన భారతీయ వైద్యానికి ఆయువుపట్టుగా నిలవాలంటే దీన్ని ఓ ఔషధ మొక్కల పర్యాటక ప్రాంతం చేయకూడదు… ఆయుర్వేదం, మూలికా వైద్యంలో అత్యంత విలువైన ఔషధ రకాల సంరక్షణ మాత్రమే కాదు… ఆధునిక పరిశోధనలకు నడుం కట్టాలి… ప్రాచీన గ్రంథాల ఆధారంగా పరిశోధనలు జరిగితే… ఈ కార్పొరేట్ అల్లోపతిక్ దోపిడీల నుంచి భారతీయ సమాజాన్ని రక్షించిన వారవుతారు… అదీ భక్తుల కానుకలకు సార్థకత… ధర్మం కూడా..!!

మరో నిర్ణయం… తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్… నిజమే, రాత్రి తిరుమలలోనే నిద్ర చేయాలనే వారి కోసం గాకుండా… కేవలం దర్శనం కోసం వచ్చేవారికి ఇక్కడే వసతి ఇచ్చి… రూమ్స్, లాకర్లు, బెడ్స్, కామన్ బాత్‌రూమ్స్ చాలు చాలామందికి… కాకపోతే వాళ్లకు దర్శనవేళలకు తగినట్టు పైకి వెళ్లే బస్సులుండాలి…
- వీలైనంతవరకూ తిరుమలలో రద్దీ తగ్గాలి… ఒత్తిడి తగ్గాలి… మూణ్నాలుగు వేల కోట్ల ఖర్చు అట… ఐనా సరే, వెంకన్నకు నిధుల కొరత లేదు… గదుల నిర్మాణాలకు కూడా విరాళాలు వస్తాయి… కేవలం దర్శన వేళలకే తిరుమలపైకి చేరుకునేలా వ్యవస్థ ఏర్పడితే… క్యూ లైన్లలో గంటల కొద్దీ మగ్గే దురవస్థ కూడా తప్పుతుంది..!! కాకపోతే ఈ భారీ ఖర్చులో కూడా ప్రవేశించే చీడపురుగులే అసలు సమస్య..!!
Share this Article