Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బుక్ ఫెయిర్ సందర్భం చూసి మరీ వదిలినట్టుంది యండమూరి ఈ పోస్టు..!!

December 25, 2025 by M S R

.

బుక్ ఫెయిర్ జరుగుతోంది కదా హైదరాబాదులో… పుస్తకాల అమ్మకాల కోసం నానా అగచాట్లు, ఖర్చు… రచయితలు, పబ్లిషర్లు, విక్రేతలు… ఎవరి కష్టాలు వాళ్లవి…

మంచి సందర్భం, సమయం చూసి మరీ వదిలినట్టున్నాడు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ పోస్టును… బాగుంది… ఇది తన రాబోయే కొత్త నవలలోని ఓ భాగమట…

Ads



Veerendranath Yandamoori  ……. ‘మనము’ మూడు అక్షరాలు. ‘నువ్వు’ రెండు అక్షరాలు. ‘నా’ ఒక్క అక్షరం..! ‘నా’ వృత్తాన్ని పెద్దది చేసి, ‘నిన్ను’ కలుపుకుంటే, ‘మనము’ అవుతాము. మానసిక ఆరోగ్యానికి అదే మొదటి మెట్టు”.

చదివి తలెత్తి “చాలా బాగా వ్రాశావు. నిజంగా పుస్తకం చాలా బావుంది. ఈ బుక్ మార్కెట్‌లో పెడదాం” నిజాయితీగా అన్నాను.
“ఏం లాభం? ఒక్కరు కొనరు” అంది.
“పుస్తకాలు అమ్ముడు పోని ప్రతి వాడూ అలాగే అనుకుంటాడు”.
“ఏమని?”
“తనది విలువలున్న రచన అనీ- చీప్ గిమిక్స్ లేవనీ, అందుకే అమ్ముడుపోవటం లేదని”.

“పుస్తకాల్లో మంచివి చెడ్డవి అని ఉండవు. నచ్చినవి, నచ్చనివి అని ఉంటాయి. దాన్నే ‘టేస్టు’ అంటారు” కాస్త కోపంగా అంది. “అయినా నా ఉద్దేశ్యం అది కాదు. ప్రస్తుతం పాఠకులు చాలామంది పైరేటెడ్ కాపీలు చదవటానికి అలవాటు పడ్డారని”
“అదే నీ అనుమానం అయితే, పైరేటెడ్ కాపీ చదివిన వాళ్లకి పిల్లలు పుట్టరని కవరు పేజీ మీద ప్రింటు చేయిద్దాం”

“పైరేటెడ్ సాఫ్ట్ కాపీలో కవరు పేజీ ఉండదుగా”
గతుక్కుమని సర్దుకుంటూ, “మూడు పుస్తకాలు కొని ముగ్గురికి పంచితే, భ్రమరాంబికా దేవి ఆశీర్వాదం వలన ఐశ్వర్యం లభిస్తుందని ఎవరైనా ప్రవచనకర్తతో భ్రమన్ టి.వి.లో చెప్పిద్దాం. లేదా దండకారణ్య సమాధుల మధ్య నుంచి తెచ్చిన కాష్మోరా భస్మం ఈ పుస్తకం అంచులకి రాసామనీ, ఈ పుస్తకం ఇంట్లో ఉంటే భూత ప్రేత పిశాచాల బెడద ఉండదనీ ప్రతి పేజీ క్రిందా ప్రింటు చేయిద్దాం. కనీసం వెయ్యిమందైనా కొంటారు” అన్నాను.
“నేను చచ్చినా నమ్మను. అలా ఎవ్వరూ కొనరు”

“దిండు కింద వేపాకు పెట్టుకుని పడుకుంటే, రాత్రిళ్ళు బాగా నిద్ర పడుతుందని ఒక పెద్దావిడ టీవీలో చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో వేపచెట్లన్నీ వారం రోజుల్లో బోడులయ్యాయి. గమనించలేదా?”
“అలాంటి పాఠకులు నాకు అవసరం లేదు”.

“ఎవరైనా పాపులర్ రచయిత చేత ముందుమాట వ్రాయిద్దాం”
“పుస్తకమే కొనకపోతే, అందులో ముందుమాట ఉన్నదని ఎలా తెలుస్తుంది?”
“మరి ముందుమాట ఎందుకు?”
“వ్రాయించమని నేను అనలేదు. వ్రాయిస్తానని నువ్వే అన్నావు” అంది కోపంగా.

మళ్ళీ ఇంకొకసారి దెబ్బతిని, “పురుషాధిక్య సమాజం గురించి రాసి కొంతమంది పాపులర్ అయ్యారు కదా. నువ్వు అబలాధిక్య సమాజం గురించి వ్రాస్తే చరిత్రలో నిలబడే అవకాశం ఉన్నది” అంటూ మరో ఆయాచిత సలహా ఇచ్చే ప్రయత్నం చేశాను.
“అబల అంటేనే బలం లేనిది కదా. అబలాధిక్య సమాజం ఏమిటి?”

యండమూరి

“పోనీ ఇంగ్లీషులో వ్రాయి. ఈ సారి నేను పబ్లిష్ చేయి౦చి మా కోర్టుల్లో ఫ్రీగా అమ్ముతాను.”
“ఫ్రీగా ‘అమ్మటం’ ఏమిటి?” అనుమానంగా అడిగింది.

మూడోసారి గతుక్కుమని సర్దుకుంటూ “అంటగట్టటం, మొహమాట పెట్టటం, పాత పరిచయాలతో ఒత్తిడి చెయ్యటం” అన్నాను.
“ఒక పుస్తకం అమ్మటం కోసం ఇంత కష్టపడటం నాకిష్టం లేదు. వదిలెయ్యి. నా పుస్తకం నలుగురూ చదవాలనే నా చిన్ని ఆశని నువ్విలా ఎగతాళి చేస్తావనుకోలేదు.”

“నీ కోరిక అదే అయితే క్లయింట్లకి, తోటి లాయర్లకీ, జడ్జీలకి ఫ్రీగా ఇస్తాను. ఇంగ్లీషులో వ్రాయి”.
“అమ్మో. నాక౦త ఇంగ్లీషు రాదు. అందులోనూ ఇంగ్లీషులో వ్రాయటం అస్సలు రాదు”.
“ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సే కదా. అలా ప్రయత్నిద్దాం”.
“దాని మీద నాకస్సలు నమ్మకం లేదు ఆనంద్..!”
“ఎందుకు?”
“మొన్నో రచయిత్రి ఇలాగే ఏ.ఐ తో అనువాదం చేయించుకుని, చూసుకోకుండా ప్రింటింగ్‌కి ఇచ్చేసింది. పుస్తకం మార్కెట్‌లో రిలీజయ్యాక జనాలు తల వాచేట్టూ తిట్టారు.”

“ఎందుకు?”
ఆ రచయిత్రి తెలుగులో “తొలిరాత్రి అతడామె నడుము చుట్టూ చెయ్యి వేసి బలంగా పొదివి పట్టుకుని పూలగదిలోకి ప్రవేశించాడు’ అని వ్రాస్తే, ‘తొలిరాత్రి అతడామె నడుము పట్టుకొని బలంగా పూల గదిలోకి ప్రవేశించాడు’ అని ఇంగ్లీషులో ప్రింట్ అయింది”.

నేను సాధారణంగా ఎక్కువ నవ్వను. కానీ ఆ మాటలకి బిగ్గరగా నవ్వేశాను. నేను అంత గట్టిగా నవ్వటం తొలిలి సారి చూసి ఆమె భయపడింది. (కొత్త పుస్తకం నుంచి. ఫిబ్రవరి విడుదల. )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాముడు కృష్ణుడు అనగానే ఎన్టీయార్ గుర్తొచ్చినట్టు… క్రీస్తు అనగానే…!!
  • బుక్ ఫెయిర్ సందర్భం చూసి మరీ వదిలినట్టుంది యండమూరి ఈ పోస్టు..!!
  • మెప్పించావు దర్శకా..! చాలా క్లిష్టమైన ప్రయోగాన్ని ఛేదించావుపో…!!
  • రోషన్… హీరో మెటీరియలే…! కానీ ఈ పాత్ర మోయలేనంత బరువు..!!
  • ‘మగ శివాజీ’ లీడ్ రోల్… దండోరా ఓ మంచి ప్రయత్నమే… కానీ..?!
  • ఈషా (Eesha) – ఈ దెయ్యం భయపెట్టలేదు… చిరాకెత్తించింది…
  • ఒకే ఒక డైలాగ్… బలమైన జంగిల్ రాజ్, మాఫియా రాజ్ కూలిపోయింది…
  • తక్కువ మంది అతిథులతో పెళ్లి… ఆశీస్సులు, పలకరింపులు, మర్యాదలు…
  • అసలే వాణిశ్రీ… పైగా చిరంజీవి… విజయశాంతీ ఉండనే ఉంది… ఇంకేం..?!
  • దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions