.
శ్రీకాంత్- ఊహ కొడుకు రోషన్… అందగాడు… ఓ లేడీ జర్నలిస్టు భాషలో చెప్పాలంటే హీరో మెటీరియలే… ఒడ్డూ పొడుగూ ప్లస్ నటన కూడా పర్లేదు, అనుభవం పెద్దగా లేకపోయినా కష్టపడతాడు… పాత్రకు తగిన పర్‌ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు… రక్త వారసత్వం నటనే కదా…
మొన్న బిగ్‌బాస్ ఫినాలేలో కనిపించాడు… నిజానికి సినిమాల్లోకన్నా బయటే బాగున్నాడనిపించింది… కానీ ఇంకా లేతదనం పోలేదు పిల్లాడిలో… అందుకే ఛాంపియన్ సినిమాలోని బరువైన పాత్ర నప్పలేదేమో… ఒక చారిత్రిక పోరాట యోధుడి పాత్ర మోయడానికి ఇంకా తన వయస్సు, తన అనుభవం సరిపోలేదేమో…
Ads
తను నిర్మల కాన్వెంట్ సినిమా నుంచే ఈజ్ కనబరుస్తున్నాడు… కానీ ఈ పాత్ర ఎంపిక సరైంది కాదు, తనను నిర్మాత- దర్శకుడు ఈ బరువైన పాత్రకు ఎంచుకోవడం కూడా సరైంది కాదు… తనేదో తక్కువ చేశాడని కాదు… తను సరిపోలేదు, అంతే…

ఈ కథ చాలా భారమైనది… మన నిజాం కాలం నాటి రజాకార్ల అరాచకాలు, భైరాన్‌పల్లి పోరాటం నేపథ్యంలో సాగుతుంది… మైఖేల్ (రోషన్) అనే కుర్రాడికి లండన్ వెళ్ళి ఫుట్‌బాల్ ఆడాలనేది కల… కానీ పరిస్థితులు అతన్ని భైరాన్‌పల్లి పోరాటంలోకి లాగుతాయి… తన వ్యక్తిగత ఆశయం నుండి ప్రజా పోరాటం వైపు అతను ఎలా మళ్ళాడు అనేదే ఈ సినిమా…
ముందే చెప్పుకున్నాం కదా.,. కొన్ని సీన్లలో లీడ్ హీరోలా కాకుండా చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు… ఇలాంటి ‘హెవీ’ రోల్స్ కంటే తన వయసుకు తగ్గ కథలు ఎంచుకుంటే ఇంకా బాగా మెప్పిస్తాడు… డైలాగ్ డిక్షన్, యాస కూడా పాపం కష్టమైపోయింది పిల్లాడికి…
అనస్వరా రాజన్ పాపం తన పాత్రకు పెద్దగా స్కోప్ లేదు… దానికి తోడు డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు.., చాలా ఇబ్బందిగా అనిపించింది…
కె.కె. మీనన్ వంటి పెద్ద నటుడిని పెట్టుకొని, అస్సలు బలం లేని పాత్ర ఇవ్వడం అంటే ఆయన్ని వేస్ట్ చేసినట్టే… కల్యాణ్ చక్రవర్తి పాత్ర కూడా అలాగే నీరసంగా సాగుతుంది…
ఎక్కడ తేడా కొట్టింది?
దర్శకుడు ప్రదీప్ అద్వైతం మంచి పాయింట్ తీసుకున్నాడు కానీ, దానిని తెరపైకి తీసుకురావడంలో తడబడ్డాడు… ఫస్టాఫ్ అంతా చాలా ఫ్లాట్‌గా సాగుతుంది… ఇంటర్వెల్ లో ఏదో జరుగుతుందని ఆశిస్తే, అది కూడా నిరాశే మిగిల్చింది…
ఒక చారిత్రక కథ చెబుతున్నప్పుడు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావాలి, కళ్ళు చెమర్చాలి… కానీ ఈ సినిమాలో ఏ ఒక్క సీన్ కూడా మనల్ని లోపలికి తీసుకెళ్ళదు… స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ లోపమే ఇది… టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది… ఎటొచ్చీ కొన్ని సీన్లనైనా ప్రేక్షకుడు ఎమోషనల్ ఫీలయ్యేలా రాసుకుని ఉంటే బాగుండేది…
మిక్కీ జె మేయర్ పాటలు బాగున్నాయి, ముఖ్యంగా “గిర గిర గింగిరాగిరే” సాంగ్ చార్ట్‌బస్టర్… బోలెడు షార్ట్స్, రీల్స్ ఆల్రెడీ ఈ పాటతో కనిపిస్తున్నాయి… హిట్ పాట, డౌట్ లేదు… కానీ ఆ ఒక్క పాట కోసం సినిమా చూసే ఖర్చును ఎఫర్డ్ చేయలేం… మధీ విజువల్స్ వోకే… సినిమా చాలా గ్రాండ్… స్వప్న సినిమా నిర్మాణ విలువలు ఎప్పటిలాగే బాగున్నాయి… బ్యాడ్ లక్ రోషన్… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్..!!
Share this Article