.
Psy Vishesh…… కానీ… ఇదొక కంత్రీ పదం..
♦️ మీ డ్రెస్ బాగుంది, కానీ (but)…
♦️ మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)…
♦️ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)…
♦️ ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం… కానీ (but)…
♦️ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)…
♦️ చంపడం, చంపించడం తప్పే… కానీ (but)…

Ads
ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? ఆ సమయంలో మీ మనసులో ఏమనిపిస్తుంది?
ఈ విషయంపై మీరెప్పుడూ పెద్దగా ఆలోచించి ఉండరు. కానీ ఆలోచించాల్సిన, తెలుసుకోవాల్సిన సమయమొచ్చింది.
ఎందుకంటే, మొదటంతా మంచిగా మాట్లాడినట్లుగా మాట్లాడి, ఆ తర్వాత ‘కానీ’ అని సన్నాయి నొక్కులు నొక్కడం వెనుక ఓ పెద్ద కుట్రే ఉంది.
కానీ… ఒక ల్యాండ్ మైన్
‘కానీ’ అనే పదం ఒక లాంగ్వేజ్ ల్యాండ్ మైన్ లాంటిది. ఎందుకంటే ఈ పదం దానికి ముందు ఉన్న వాక్యాన్ని తిరస్కరిస్తుంది. ఆ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఆ తర్వాత వస్తుందనీ, దాన్ని అంగీకరించాలనీ చెప్తుంది.
ఉదాహరణకు… మీ డ్రెస్ బాగుంది, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది.. అని ఎవరైనా చెప్పారంటే, మీ మనసు డ్రెస్ బాగుందనే విషయాన్ని తిరస్కరిస్తుంది, రెడ్ అయితే బాగుంటుందనే విషయాన్నే అంగీకరిస్తుంది.
అంటే… మీ డ్రెస్ బాగుంది అని చెప్పడం అబద్ధమన్నమాట. ఆ మాట చెప్పలేక, బాగుందని చెప్పి, ‘కానీ’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారన్నమాట. అలా ‘కానీ’గాళ్లు తమకు కావాల్సిన, తమకు నచ్చిన అభిప్రాయాన్ని మీ మనసుపై రుద్దుతారన్నమాట.
కానీ, మీరు మీ మనసు ఆ మోసాన్ని గ్రహించలేరు. అలా ‘కానీ’ అనే ఈ చిన్న పదం దుర్వినియోగమవుతుంది.
ఒక మేనేజర్ మీ అప్రైజల్ ఇచ్చేటప్పుడు దీన్నెలా ఉపయోగిస్తాడంటే…

♦️ మొత్తం మీద మీ పనితీరు బాగుంది… కానీ…
♦️ మీరు ఆ ప్రాజెక్ట్ బాగా హేండిల్ చేశారు… కానీ…
మీ లైఫ్ పార్ట్నర్స్ ఎలా ఉపయోగిస్తారంటే…
♦️ ఇలా నీతో ఉండటం చాలా బాగుంది… కానీ…
♦️ నువ్వన్నా, నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం… కానీ…
టీచర్లు ఎలా ఉపయోగిస్తారంటే…
♦️ నీ చేతిరాత బాగుంది… కానీ…
♦️ నీ స్పెల్లింగ్ బాగుంది… కానీ…
….. ఇలా మిమ్మల్ని మెచ్చుకున్నట్లుగానే మాట్లాడి.. తాము నిజంగా చెప్పాల్సిన విషయాన్ని చెప్తారు. మీ మనసు ఆ ‘కానీ..’ ముందు ఉన్నదాన్ని తిరస్కరించి, దాని తర్వాత ఉన్నదాన్నే అంగీకరిస్తుంది. ‘అయితే’ అనే పదం కూడా దాదాపు ఇలాంటి ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది.

మరేం చేయాలి?
‘కానీ’ని ‘అలాగే’ అనే పదంతో భర్తీ చేయండి! ఇలా ఒక వారం రోజులు మీరు ప్రయత్నిస్తే… ‘కానీ’ బారినుంచి తప్పించుకోవచ్చు.
❎ ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, కానీ మీరు టీమ్ మెంబర్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను…. అనే వాక్యానికి బదులుగా ఇలా వాడండి.
✅ ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, అలాగే మీరు టీమ్ మెంబర్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
❎ మీరు చెప్పే చాలా విషయాలతో నేను అంగీకరిస్తున్నాను, కానీ ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించగలమా అని ఆశ్చర్యపోతున్నాను.
✅ మీరు చెప్పే చాలా విషయాలతో నేను అంగీకరిస్తున్నాను, అలాగే ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించగలమా అని ఆశ్చర్యపోతున్నాను.
అయితే ఈ ‘అలాగే’ వాడకంతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు దీన్ని ఎక్కువగా నొక్కిచెప్పినా, దానిని ఉపయోగించటానికి ముందు, తరువాత పాజ్ చేసినా, ఇది ‘కానీ’లాంటి ప్రభావాన్నే చూపిస్తుంది.
కానీ… ఉపయోగించాల్సిన పద్ధతి
వాస్తవానికి, ‘కానీ’ అనే పదం ఎదుటి వ్యక్తి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదు.

అందువల్ల మీరు ప్రతికూలమైనదాని స్థానంలో సానుకూల ప్రత్యామ్నాయాన్ని నొక్కి చెప్పేటప్పుడు ‘కానీ’ ఉపయోగించండి. ఉదాహరణకు…
✅ మనం ఈ ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నాము, కానీ మనం విజయం సాధించగలమని నాకు తెలుసు.
✅ మనం పూర్తిగా ఫెయిలయ్యాం, కానీ మన తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాలి.
కానీ… పై ఎందుకింత రచ్చంటారా?
అనుభవజ్ఞులైన కార్పొరేట్ మేనేజర్లు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినప్పటికీ, ఆపై ‘కానీ’ జోడించడం ద్వారా ప్రభావాన్ని దెబ్బతీస్తారు.
కపుల్స్ తమ జీవిత భాగస్వాములను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పి, ఆపై ‘కానీ’ అనడంతో మొత్తం నాశనం చేస్తారు.
తల్లిదండ్రులు వారి ‘BUTs’ ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో ప్రతికూల స్పందనల్ని ప్రేరేపిస్తారు.
పరువు హత్యలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో ‘కానీ’ చాలా దుర్వినియోగం అవుతోంది.

ఉదాహరణకు..
♦️ చంపడం, చంపించడం తప్పే, కానీ ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకోండి.
♦️ చంపడం తప్పే, కానీ కుటుంబం పరువు తీసినప్పుడు ఏం చేయగలరు?
ఇలా మాట్లాడేవాళ్లు ఆ హత్యలను సమర్థిస్తున్నట్లే. కానీ ఆ విషయం బహిరంగంగా చెప్తే అసహ్యించుకుంటారని… ‘కానీ’ కుటుంబ పరువు, తండ్రి ప్రేమ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు.
అలాక్కాకుండా…

✅ ఆ తండ్రి కూతుర్ని చాలా ప్రేమించాడు, కానీ చంపడం, చంపించడం తప్పే.
✅ కుటుంబం పరువు పోయేట్టు ప్రవర్తించినా కానీ చంపడం, చంపించడం తప్పే.. అని అన్నప్పుడే పరువు హత్యలను నిజంగా వ్యతిరేకించినట్లు.
అలా చెప్పమని ‘కానీ’ గాళ్లను అడగండి, ససేమిరా అంటారు.
మా ఉద్దేశం మంచిదని ఎవరైనా చెప్తే సరిపోదు. వారి అసలు ఉద్దేశమేమిటో వారు మాట్లాడే మాటలు పట్టిస్తాయి. కానీ.. అనే చిన్న పదం మనసులో దాగి ఉన్న, దాచుకున్న నిజమైన ఫీలింగ్స్ ను ఎలా పట్టిస్తుందో చూశారుగా.
ఇలాంటి క్లూస్ లింగ్విస్టిక్స్, న్యూరో లింగ్విస్టిక్స్ లో చాలా ఉంటాయి. అవి నాలాంటి Neuro Linguistic Psychologist దృష్టిని దాటిపోలేవు.
కాబట్టి మీ ‘కానీ’ ఎక్కడుందో, ఎలా ఉపయోగిస్తున్నారో గమనించుకోండి.

‘కానీ’ ఉపయోగం గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, ‘అలాగే’ తో భర్తీ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
.
(నో నో... మగ శివాజీకి ఈ పోస్టుకూ లింక్ లేదు... చదవాల్సిన పని లేదు... అనసూయ అసభ్య వస్త్రధారణకూ దీనికీ లింక్ లేదు... శివాజీ బెదిరిస్తే ఎహెపోవోయ్ అని ఈ మగ ఇండస్ట్రీలో భయపడకుండా ఆమె పురుగులాగా తీసిపడేయటానికీ దీనికీ లింక్ లేదు.... తన మగ తత్వం మారని శివాజీకి దీనికీ లింక్ లేదు... కానీ..?)
Share this Article